చేపలు తినాలని ఉన్నా రెండు విషయాలు వెనకడుగు వేసేలా చేస్తాయి. ఒకటి ముళ్లు... రెండోది శుభ్రం చేసే ప్రక్రియ. ఈ రెండింటిని అధిగమించడం రాకపోతే ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే చేపల్ని మనం తినలేం. గర్భిణులు... గుండెజబ్బులున్న వాళ్లు సైతం తినే ప్రొటీన్లు చేపల్లో ఉంటాయి.
ముళ్లు లేకుండా చేపలు శుభ్రం చేసుకుందాం!
పైన పొలుసు తీసి... అడ్డంగా ముక్కలుగా తరగడం సంప్రదాయ పద్ధతి. మనలో చాలామందికి ఈ విధానం మాత్రమే తెలుసు. కానీ ఫిష్ ఫిల్లేయింగ్ అనేది కొత్త టెక్నిక్. దీనివల్ల చేపలని ముళ్లు లేకుండా కోసుకుని.. ఆ చేపముక్కలతో అద్భుతమైన వంటకాలు చేసుకోవచ్చు. పల్చని, పొడవాటి, పదునైన కత్తితో ఈ ఫిల్లేయింగ్ చేస్తారు.
శంఖుల కింద నుంచి కత్తిపెట్టి ముల్లుపై నుంచి తోక వరకూ కత్తిని లాగుతారు. ఇలానే చేపకి రెండు పక్కలా చేస్తారు. తలని వేరుచేస్తారు. అలాగే చర్మాన్ని కూడా వేరు చేస్తారు. బరువు ఎక్కువగా ఉన్న పెద్ద చేపలని ఇంత తేలిగ్గా ఒక్కదెబ్బతో ఫిల్లేయింగ్ చేయలేం. ఒక చేపని నాలుగు ముక్కలు చేస్తారు. అధికంగా పైకి పొడుచుకు వచ్చినట్టుగా ఉన్న ముళ్లని ప్లైయర్(పట్టకారులాంటిది)తో తొలగించుకోవచ్చు. ఈ ఫిల్లేయింగ్ కోసం ప్రత్యేకంగా కత్తులు దొరుకుతాయి. ఇవి పల్చగా, పొడుగ్గా, పదునుగా ఉంటాయి. పెద్దపెద్ద మాల్స్‌లో చేపలు కొన్నప్పుడు... అడిగితే వాళ్లే ఫిల్లేయింగ్ చేస్తారు. కొర్రమేను, వంజరం, చందువ, పండుగొప్పవంటివి ఇలా ఫిల్లేయింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.
రెసిపీస్
ఇప్పుడు చేపతో వివిధ రకాల చిరుతిళ్లు చేసుకోవడం ఎలానో చూద్దాం. ముళ్లు కనిపించకుండా, చేతికి వాసన అంటుకోకుండా... ఫిష్ కట్‌లెట్, అపోలో ఫిష్, పకోడి వంటివి చేసుకోవచ్చు.
ఉప్పు, కారం, వెల్లుల్లిపేస్ట్, మసాలాలు ఒక పాత్రలో విడిగా కలుపుకొని రుచి చూసి అప్పుడు చేపకు పట్టిస్తే మంచిది. ముందే చేపపై వేస్తే రుచి చూడ్డానికి చేపవాసన ఇబ్బంది పెడుతుంది.