Eating habits: ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి? - ఆహార నియమాలు
తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు.. మనసునిండా తినాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి..?
ఆహారపు అలవాట్లు
By
Published : Sep 11, 2021, 1:01 PM IST
ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. వీలు కుదిరినప్పుడే తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు.. మనసునిండా తినాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి..?
భోజన సమయం
భోజన సమయాన్ని ప్రతి రోజు ఒకే విధంగా పాటించడం మంచిది. అయితే, ఆహారం తీసుకోవడంలో కొన్ని రకాల పద్దతులున్నాయి. కొందరు ఉదయం, మధ్యాహ్నాం, రాత్రి పూట భోజనాల మధ్య కచ్చితమైన వ్యవధిని పాటిస్తారు. మరికొందరు సమయంతో పనిలేకుండా ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు ఆహారం లాగించేస్తారు. అయితే, ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం కన్నా కొద్దిమొత్తంలో ఎక్కువగా సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ ఆహారం తినాల్సివస్తే.. భోజనాల మధ్య పది గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి.
ఆకలా? దాహమా?
కొన్నిసార్లు ఆకలి అనిపించినా శరీరంలో నీరు తక్కువైన కారణంగా అలాంటి భావన కలుగుతుంది. అందుకే, ఆకలి అనిపిస్తే ముందుగా మంచినీరు తాగండి. అప్పటికీ ఆకలిగా ఉంటే ఆహారం తీసుకోవచ్చు.
ఎంత తింటున్నామో గమనించండి
ఊబకాయం రావొద్దన్నా.. అనారోగ్యానికి గురికావొద్దన్న ముందుగా ఆహారం మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. మీ కంచెంలో ఆహారం ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఇతరులతో ఆహారాన్ని పంచుకోండి. తద్వారా తోటివారితో సఖ్యత.. ఆరోగ్యం రెండూ కలిసొస్తాయి. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోకి చేరే కెలరీలు తగ్గుతాయి. తద్వారా ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు.
తింటున్నారా.. భోజనంపైనే దృష్టి పెట్టండి!
ఈ కాలంలో చాలా మంది టీవీ చూస్తూ లేదా మొబైల్ వాడుతూ తినడం చూస్తూనే ఉన్నాం. అయితే, అలా తినడం వల్ల ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామనే విషయంపై అవగాహన ఉండదు. అలాగే, భోజనాన్ని ఏ మాత్రం ఆస్వాదించలేం. కాబట్టి.. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం భోజనంపైనే దృష్టిసారించి తినండి. అప్పుడు కడుపుతోపాటు మనసు కూడా నిండుతుంది. తీసుకునే ఆహారంపై నుంచి దృష్టి మరలితే శరీరంలో పోషకాల శోషణ సరిగా జరగదని నిపుణులు చెబుతున్నారు.
మింగేయొద్దు.. నమలండి
తొందరతొందరగా తినేయాలన్న ఉద్దేశంతో చాలా మంది అన్నం ముద్దలను నమలకుండా మింగేస్తుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. మీరు తిన్న ఆహారంతో కడుపు నిండిందని మీ మెదడు సంకేతాలు ఇవ్వడానికి 20 నిమిషాలు సమయం పడుతుందట. నమలకుండా అలాగే మింగేయడం ద్వారా అతిగా తినేసే అవకాశముంది. అందుకే, ఆహారాన్ని నమలుతూ.. ఆస్వాదిస్తూ తింటే తక్కువ ఆహారమైనా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కడుపునకు సరిపడా ఆహారమే తీసుకుంటారు. నమలడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. దీంతో పోషకాలు తొందరగా శరీరానికి చేరతాయి.
ఆరోగ్యకరమైన ఆహారమే తినండి
ఏదీ మంచి ఆహారం.. ఏది కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఆరోగ్యానికి మంచిది కావని తెలిసినా రుచికి అలవాటు పడి జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తినేస్తుంటాం. మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి. పోషకాలు మెండుగా ఉన్న కూరగాయాలు, పండ్లు తినాలి. భోజనం చేసిన తర్వాత కూడా మధ్యలో ఆకలి వేస్తే చాక్లెట్స్, చిప్స్ లాంటివి కాకుండా పండ్లు తినడం ప్రారంభించండి.
కొనుగోళ్లలో వాటికి చోటివ్వకండి
షాపింగ్‌కు వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే మన మనసు తినుబండారాలవైపు వెళ్తుంది. దీంతో జంక్‌ఫుడ్, బేకరీ పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకుంటాం. ఇంట్లో ఎదురుగా కనిపించేసరికి ఉవ్విళ్లూరి తినేస్తాం. ఈ అలవాటు మారాలంటే ముందుగా అలాంటి పదార్థాల కొనుగోళ్లను మానేయడం అలవాటు చేసుకోవాలి. అవి ఇంట్లో లేనప్పుడు తినే ఆస్కారమే ఉండదు కదా.. ఈ చిట్కా సులభంగా ఉంది.. కదా!