భోజనం చేసేటప్పుడు పంచభక్ష్య పరమాన్నాలూ ఉన్నా చివరిగా పెరుగన్నం తినకపోతే అది సంపూర్ణం కాదని చాలామంది భావిస్తారు. కానీ శీతాకాలంలో చలిగాలుల ప్రభావం వల్ల పెరుగు అంత గట్టిగా తోడుకోకపోవచ్చు. లేదా పైకి బాగానే ఉన్నా అడుగున పాలలానే ఉండిపోవచ్చు. అందుకే చలికాలంలో కమ్మని, చిక్కని పెరుగు తయారుకావాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
పెరుగు తయారీ ఇలా..!
ఒక పాత్రలోకి పాలను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లబడే వరకు అంటే కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల పెరుగు వేసి కలపాలి. ఈ పాత్రను కదపకుండా అలాగే 5 నుంచి 6గంటలు పక్కన ఉంచితే పెరుగు సిద్ధమైపోతుంది. సాధారణంగా అయితే ఈ పద్ధతిలో సులభంగానే పెరుగు తయారైపోతుంది కానీ చలికాలంలో అది సాధ్యం కాకపోవచ్చు.
గట్టిగా తోడుకోవాలంటే..
- పెరుగు గట్టిగా, చిక్కగా, కమ్మగా ఉండాలంటే మనం తోడుకు ఉపయోగించే పెరుగు కూడా అలాగే ఉండాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది.
- అలాగే పెరుగు తోడుపెట్టడానికి ఉపయోగించే పాలు కూడా నాణ్యమైనవై ఉండాలి. అంటే నీటి శాతం ఎక్కువగా ఉండి పలుచగా ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది
గట్టిగా మారకపోవచ్చు.
- పాలల్లో పెరుగు వేసే ముందు ఓసారి వేలుపెట్టి అవి గోరువెచ్చగా ఉన్నాయో, లేవో నిర్ధారించుకోవడం తప్పనిసరి. పొరపాటున వేడిగా ఉన్న పాలల్లో పెరుగు వేస్తే అది అంత చిక్కగా, కమ్మగా ఉండకపోవచ్చు. అంతేకాకుండా పెరుగు కాస్త జిగురుగా, నీళ్లలా కూడా అనిపించే అవకాశం ఉంటుంది.
- మరిగించిన పాలు బాగా చల్లగా అయిపోయిన తర్వాత అందులో పెరుగు వేసినా అంతగా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి.
పరిసరాలు బాగా చల్లగా ఉంటే..
- సాధారణంగా పెరుగు తోడుకోవాలంటే గది ఉష్ణోగ్రత 37 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ చలికాలంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావు.
- అందుకే ఆ వెచ్చదనాన్ని కలిగించడానికి మనమే బయటి నుంచి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
- పెరుగు తోడుపెట్టిన తర్వాత ఆ పాత్రని ఒక దళసరి లేదా వూలు వస్త్రంతో చుట్టేయాలి. గాలి లోపలికి చొరబడకుండా మూత పెట్టాలి.
- చలిగాలులు తగిలే చోట పెట్టకుండా వేడిగా ఉండే ప్రదేశంలో ఆ పాత్రని ఉంచాలి. అప్పుడే పెరుగు గట్టిగా తోడుకునే అవకాశం ఉంటుంది.
- మీ ఇంట్లో ఒవెన్ ఉందా?? అయితే దాన్ని ఒక రెండు నిమిషాల పాటు 180డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి కట్టేయండి.
- ఇప్పుడు అందులో పెరుగు తోడుపెట్టిన పాత్రను ఉంచి 6 నుంచి 7 గంటలు లేదా రాత్రంతా అలా వదిలేస్తే ఉదయానికి పెరుగు గట్టిగా తోడుకుంటుంది.
- వంటగదిలో బియ్యం డబ్బాలో కూడా ఈ పాత్రను ఉంచితే వెచ్చగా ఉండటంతో పాటు పెరుగు గట్టిగా తోడుకుంటుంది. కానీ పాత్రని జాగ్రత్తగా కవర్ చేయడం మాత్రం మరవద్దు.
- ఇదేవిధంగా పెరుగు తోడుపెట్టిన పాత్రని థర్మాకోల్‌తో చేసిన బాక్సులో పెట్టినా కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి పెరుగు గట్టిగా తోడుకుంటుంది. లేదా ఇన్సులేటెడ్ పాత్రల్లో పెరుగు తోడుపెట్టడం కూడా ఒక చక్కటి మార్గమే.
ఇవండీ.. చలికాలంలో చిక్కని పెరుగు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పాటించాల్సిన చిట్కాలు.. మీరు కూడా ఓసారి ప్రయత్నించండి మరి..!