వివిధ కారప్పొడుల తయారీ విధానం చూద్దాం..
కొబ్బరి కారం
కావలసినవి
ఎండుకొబ్బరి చిప్పలు: రెండు, ఎండుమిర్చి: పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, సెనగపప్పు: 3 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: టీస్పూను, నూనె: అరటీస్పూను, జీలకర్ర: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కరివేపాకు: పది రెబ్బలు
తయారుచేసే విధానం
- బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, సెనగపప్పు వేసి వేయించి తీయాలి. తరవాత ఎండు కొబ్బరిముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి వేయించి చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.
పల్లీల పొడి
కావలసినవి
పల్లీలు: కప్పు, ఎండుమిర్చి: 12, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, జీలకర్ర: 2 టీస్పూన్లు, ఎండుకొబ్బరి పొడి: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం
- పల్లీలు వేయించి, చల్లారాక పొట్టు తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి ఓ నిమిషం వేగాక జీలకర్ర వేసి ఓ నిమిషం వేయించి దించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తరవాత వెల్లుల్లి, వేయించిన పల్లీలు కూడా వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి తీయాలి.
నల్ల కారం
కావలసినవి
దనియాలు: కప్పు, మినప్పప్పు: 3 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: 3 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: 20, కరివేపాకు: 2 రెబ్బలు, చింతపండు: నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, నూనె: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం
- బాణలిలో నూనె వేసి కాగాక దనియాలు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి.
- బాణలిలో సెనగపప్పు,మినప్పప్పు వేసి వేగనివ్వాలి. తరవాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీయాలి. తరవాత చింతపండు, వెల్లుల్లి కూడా వేసి ఓ నిమిషం వేయించి తీయాలి.
- చల్లారిన తరవాత ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో వేసి పొడి చేసి తీయాలి.