తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 1:00 PM IST

ETV Bharat / priya

ఉగాది పండక్కి నోరూరించే వంటలు..!

మన పండుగల్లో భగవంతుని పూజ ఎంత ముఖ్యమో విందు భోజనమూ అంతే ముఖ్యం. అందులోనూ ఉగాది పండుగ ఎలా గడిస్తే ఆ సంవత్సరమంతా అలాగే ఉంటుందని మన నమ్మకం కూడా..! అయితే ఈ ఉగాది పండక్కి నోరూరించే సరికొత్త రుచులు చవి చూసి, ఏడాదంతా అంతే రుచికరమైన భోజనంతో సాగించడానికి సిద్ధమేనా మరి..!

ugadi recipes, recipes in telugu
ఉగాది స్పెషల్ వంటకాలు, తెలుగు వంటలు

ఉగాది పండుగ తెలుగు వారికి చాలా ప్రత్యేకం. షడ్రుచుల సమ్మేళనంతో పాటు రకరకాల వంటకాలు చేయాలనుకుంటారు. కొత్త సంవత్సరం నాడు ఏం చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి చూసేద్దామా...!

గసగసాల పాయసం..

కావల్సినవి..

  • గసగసాలు- పావు కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము- ముప్పావు కప్పు
  • తురిమిన బెల్లం- అర కప్పు
  • సన్నగా కట్ చేసుకున్న డ్రైఫూట్స్ - పావు కప్పు
  • యాలకులు - ఒకటి లేదా రెండు
  • నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు

తయారీ

  • బాణలిలో స్పూన్ నెయ్యి వేసి, గసగసాలు కాస్త రంగు మారే వరకూ వేయించాలి. వేగిన గసగసాలను పక్కకు తీసి, అదే బాణలిలో డ్రైఫ్రూట్స్ వేయించుకోవాలి. గార్నిష్ కోసం ఒక టీస్పూను డ్రైఫ్రూట్స్‌ని పక్కన పెట్టుకోవాలి.
  • వేయించిన గసగసాలు, డ్రైఫ్రూట్‌లను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెదిగాక, ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
  • యాలకులను పొడిచేసి పెట్టుకోవాలి.
  • పావు కప్పు నీటిలో తురిమిన బెల్లాన్ని కలిపి, లేత పాకం తయారయ్యే వరకూ మరిగించాలి.
  • పాకం తయారవగానే ఇందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని, యాలకుల పొడిని, నేతిని కలిపి చిక్కబడేవరకూ కలుపుతూ ఉండాలి.
  • చిక్కబడగానే డ్రైఫ్రూట్ పలుకులతో గార్నిష్ చేస్తే.. వేడి వేడి గసగసాల పాయసం రడీ..!

పల్లీ బొబ్బట్లు

కావల్సినవి..

  • గోధుమ పిండి- రెండు కప్పులు
  • నూనె/నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - చిటికెడు
  • పల్లీలు - ఒక కప్పు
  • నువ్వులు - పావు కప్పు
  • గసగసాలు - రెండు టీస్పూన్లు
  • తురిమిన బెల్లం- ముప్పావు కప్పు
  • యాలకుల పొడి- పావు టీస్పూను


తయారీ..

  • గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల నూనె/నెయ్యి వేసి, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. చపాతీ పిండిలా కలపాలి.పైన నూనె/ నెయ్యి రాసి మూతపెట్టి అరగంట పాటు నానబెట్టాలి.
  • బాణలిలో పల్లీలు, నువ్వులు, గసగసాలు విడివిడిగా వేయించుకోవాలి.
  • వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో బెల్లపు తురుము, యాలకుల పొడి వేసి, బాగా కలిసే వరకూ మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.
  • కొద్దిగా పాలు పోసి, ఈ పిండిని గుండ్రటి ముద్దలుగా చేసుకోవాలి.
  • గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేతి వెడల్పున ఒత్తుకోవాలి.
  • వీటిలో పల్లీ పొడి ముద్దలను స్టఫ్ చేసి, అంచులను మూయాలి.
  • వేళ్లకు నెయ్యి/ నూనె రాసుకుంటూ ఈ ఉండలను గుండ్రంగా ఒత్తుకోవాలి.
  • స్టౌ మీడియంలో ఉంచి, వీటిని నూనె/నేతితో కాల్చాలి.


రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇచ్చే కర్ణాటక స్పెషల్ 'శెన్గ హోళిగె ' అదే.. పల్లీ బొబ్బట్లు సిద్ధం.!

అరటిపండు బోండా

కావల్సినవి

  • అరటి పండు - ఒకటి
  • గోధుమపిండి - అర కప్పు
  • బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు
  • బెల్లపు తురుము - అర కప్పు
  • యాలకుల పొడి - అర టీస్పూను
  • బేకింగ్ సోడా - ముప్పావు టీస్పూను
  • నూనె - వేయించడానికి సరిపడా


తయారీ..

  • ముందుగా అరటిపండు, యాలకుల పొడి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • పావుకప్పు నీళ్లలో తురిమిన బెల్లం వేసి, కరిగే వరకూ కలపాలి. దీన్ని పది నిమిషాలు స్టౌ మీద సన్నని మంటపై ఉంచి, లేత పాకం తయారు చేయాలి. పాకం కాస్త చల్లార్చి వడగట్టాలి.
  • ఇందులో గోధుమ పిండి, బేకింగ్ సోడా, బొంబాయి రవ్వ, అరటి పండు గుజ్జు కలిపి, గంటపాటు నానబెట్టాలి.
  • పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ నూనెలో వేయించుకుంటే నోరూరించే బనానా బోండా రెడీ..!

మేతీ కార్న్ వడ

కావల్సినవి

  • శెనగ పప్పు- అర కప్పు
  • కంది పప్పు- అర కప్పు
  • మెంతికూర - ఒక కప్పు
  • స్వీట్ కార్న్- అర కప్పు
  • పచ్చి మిర్చి- మూడు
  • అల్లం- అంగుళం ముక్క
  • కారం - అర స్పూను
  • పసుపు - పావు స్పూను
  • జీలకర్ర - అర స్పూను
  • ఉప్పు - రుచికి తగినంత
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు- గుప్పెడు
  • నూనె- వేయించడానికి సరిపడా


తయారీ..

  • ముందుగా కంది పప్పు, శెనగపప్పు నాలుగు గంటలపాటు నానబెట్టాలి.
  • నాలుగు గంటల తర్వాత నీటిని వడగట్టాలి.
  • నానిన కంది పప్పు, శెనగపప్పు, పచ్చి మిరపకాయలు, అల్లం, జీలకర్ర కలిపి నీళ్లు పోయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని బౌల్ లోకి తీసుకుని, ఇందులో తరిగిన మెంతికూర, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, స్వీట్ కార్న్, కరివేపాకు వేసి కలపాలి.
  • బాణలిలో నూనె మరగనిచ్చి, తర్వాత స్టౌ మీడియం మంటలో ఉంచాలి.
  • వడ పిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని, గుండ్రంగా చేయాలి.
  • వాటిని ముని వేళ్లతో ఒత్తుకుని, వేయించుకోవాలి.
  • వేయించిన వడలను టిష్యూ లేదా పేపర్ టవల్‌పై వేసుకుని నూనె కాస్త పీల్చుకోగానే.. వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.

అల్లం - మామిడి చిత్రాన్నం

కావల్సినవి

  • అన్నం - రెండు కప్పులు
  • పచ్చి మామిడి తురుము- అర కప్పు
    ( పులుపు తక్కువ తినేవారు మామిడి తురుము తగ్గించాలి)

  • * అల్లం తురుము- టీస్పూను
  • అల్లం - అరంగుళం ముక్క
  • జీడి పప్పు - రుచికి తగినన్ని
  • మెంతులు - చిటికెడు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె/ నెయ్యి - తాలింపుకి సరిపడా
  • ఆవాలు- తాలింపుకి సరిపడా
  • జీలకర్ర - తాలింపుకి సరిపడా
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - చిటికెడు
  • కరివేపాకు - రెండు రెబ్బలు
  • కొత్తిమీర - గార్నిష్‌కి సరిపడా
  • ఎండు మిర్చి- రెండు


తయారీ

  • అన్నం పొడి పొడిగా వండుకోవాలి.
  • బాణలిలో నూనె/నెయ్యి వేసి, జీడిపప్పు, సన్నగా గుండ్రంగా తరిగిన అల్లం విడి విడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. (అల్లం కరకరలాడేలా వేయించాలి)
  • ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, నిలువుగా తరిగిన పచ్చి మిరపకాయలు వేసి వేయించి, తర్వాత పసుపు, ఇంగువ వేయాలి.
  • ఈ తాలింపుకి అల్లం తురుము, మామిడి తురుము, తగినంత ఉప్పు చేర్చి పచ్చిదనం పోయే వరకూ వేయించాలి.
  • మామిడి తురుములోని నీరంతా ఇగిరి పోయి, తాలింపు నూనె కనిపించాక స్టౌ ఆపేసి కాస్త చల్లారనివ్వాలి.
  • ఇందులో అన్నాన్ని కలిపి వేయించిన అల్లం ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే అల్లం-మామిడి చిత్రాన్నం ఆస్వాదించడానికి రెడీ!

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ABOUT THE AUTHOR

...view details