మేథీ ముర్గ్....
కావాల్సినవి: చికెన్- అరకేజీ, మెంతికూర- మూడు కట్టలు, పసుపు- అర టీస్పూన్, ఉప్పు- సరిపడా, కారం- టేబుల్‌స్పూన్, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- రెండు, ధనియాలపొడి- టీస్పూన్, తుంచిన కరివేపాకు- రెండు రెమ్మలు, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు- రెండు, చిన్నగా కోసిన టొమాటో- ఒకటి, జీలకర్ర- అరటీస్పూన్, గరంమసాలా పొడి- టీస్పూన్, కసూరీ మేథి- టీస్పూన్, కొత్తిమీర తరుగు- గుప్పెడు.
తయారీ:మెంతికూర, చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్‌ను వెడల్పాటి గిన్నెలో వేసుకుని దీంట్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. గిన్నె మీద మూతపెట్టి అరగంటపాటు పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేడిచేసి మెంతికూరను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా వేయించడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. ఇదే నూనెలో జీలకర్ర వేసి చిటపటలాడాక నానబెట్టిన చికెన్ వేయాలి. దీన్ని బాగా కలుపుతూ మధ్యస్థంగా ఉండే మంట మీద ఐదు నిమిషాలపాటు వేయించాలి. తర్వాత చికెన్‌లో నుంచే నీళ్లు వస్తాయి. అవి ఇంకిపోయేంత వరకు ఉడికించి మెంతికూర, గరంమసాలా పొడి వేయాలి. ఇప్పుడు కసూరీమేథి వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. ముద్ద కూరలా కావాలనుకుంటే తక్కువ నీళ్లు పోయాలి. గ్రేవీ బాగా ఉండాలంటే ఎక్కువ నీళ్లు కలపాలి.
తోటకూర పచ్చి రొయ్యలు...
కావాల్సినవి: రొయ్యలు- అరకేజీ, తోటకూర తరుగు- కప్పు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో- ఒక్కోటి చొప్పున, చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు,, పసుపు- అర టీస్పూన్, గరంమసాల, ధనియాలు, జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్ చొప్పున, కారం, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా.