ఆపిల్ బాసుంది
కావాల్సినవి: టోన్డ్‌మిల్క్- అరలీటరు, కుంకుమపువ్వు రేకలు- ఎనిమిది (వీటిని గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), యాలకుల పొడి- పావు టీస్పూన్, సన్నగా తురిమిన ఆపిల్- కప్పు, చియాసీడ్స్- టీస్పూన్, షుగర్ సబ్‌స్టిట్యూట్ - నాలుగు గ్రా., నిమ్మరసం- అర టీస్పూన్, బాదం, పిస్తా తురుము- రెండు టీస్పూన్లు.
తయారీ: మందపాటి గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద గంటపాటు మరిగించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లో మూడు గ్రాముల షుగర్ సబ్‌స్టిట్యూట్, యాలకుల పొడి వేసి కలిపి పావుగంటపాటు మరిగించాలి. ఇప్పుడు గిన్నెలో ఆపిల్‌తురుము, కొద్దిగా షుగర్ సబ్‌స్టిట్యూట్ వేసి కాసిన్ని నీళ్లు పోయాలి. దీన్ని మూడు నిమిషాల పాటు ఉడికించి, చల్లార్చి ఈ మిశ్రమాన్ని పాలల్లో వేయాలి. దీంట్లో నానబెట్టిన చియాసీడ్స్ వేసి బాగా కలిపితే ఆపిల్ బాసుందీ సిద్ధమవుతుంది. చివరగా బాదం, పిస్తా తురుముతో అలంకరించాలి.
సొరకాయ హల్వా
కావాల్సినవి: లేత సొరకాయ - సగం ముక్క, నెయ్యి- టేబుల్‌స్పూన్, జీడిపప్పు, కిస్‌మిస్, బాదం- గుప్పెడు, బెల్లంతురుము- అరకప్పు, పాలు- కప్పు, యాలకుల పొడి- చిటికెడు.
తయారీ: సొరకాయ విత్తనాలను తీసేసి సన్నగా తురుమి పెట్టుకోవాలి. తర్వాత గట్టిగా పిండి దీంట్లోని నీళ్లు తీసేయాలి. కడాయిలో నెయ్యి వేసి తక్కువ మంట మీద జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో సొరకాయ తురుము వేసి తక్కువ మంట మీద పది నిమిషాలపాటు వేయించాలి. దీంట్లోనే బెల్లం తురుము వేసి కరిగేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు పోసి తక్కువ మంట మీద అవి ఇగిరేంత వరకు ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, బాదం వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని నచ్చిన ఆకృతిలో కోసుకోవాలి.