స్వీట్ సమోసా..
కావలసినవి: మైదా: రెండు కప్పులు, బొంబాయిరవ్వ: చెంచా, నెయ్యి: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా. స్టఫింగ్‌కోసం: కోవా: కప్పు, చక్కెరపొడి: అరకప్పు, కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, యాలకులపొడి: చెంచా, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు. పాకం కోసం: నీళ్లు: పావుకప్పు, చక్కెర: కప్పు
తయారీవిధానం: ముందుగా ఓ గిన్నెలో మైదా, బొంబాయిరవ్వ వేసుకుని బాగా కలపాలి. తరవాత నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా కలిపి ఓ చెంచా నెయ్యి వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక బాదం, కిస్‌మిస్, జీడిపప్పు పలుకులు వేసి వేయించి తరువాత కోవా, చక్కెర, కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. మరో గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా అవుతున్నప్పుడు దింపేయాలి. నానిన పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తి మధ్యకు కోయాలి. అలా కోసిన చపాతీ ముక్క మధ్యలో ఒకటిన్నర చెంచా కోవా మిశ్రమాన్ని ఉంచి... సమోసా ఆకృతి వచ్చేలా అంచుల్ని మూసేయాలి. ఇలా అన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని రెండు నిమిషాలయ్యాక చక్కెరపాకంలో ముంచి తీయాలి.
నువ్వుల లడ్డు..
కావలసినవి: తెల్ల నువ్వులు: అరకప్పు, కోవా: అరకప్పు, బెల్లం పొడి: ముప్పావుకప్పు, నెయ్యి: పావుకప్పు.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నువ్వుల్ని వేయించుకుని తీసుకోవాలి. అవి వేడి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి కోవా వేయాలి. అది మెత్తగా అయ్యాక స్టౌ కట్టేసి నువ్వులపొడి, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అన్నీ కలిశాయనుకున్నాక నెయ్యి చల్లుకుంటూ ఉండల్లా చుట్టాలి.