తెలంగాణ

telangana

ETV Bharat / priya

కాస్త కారంగా... కాస్త ఘాటుగా!

రోటీ, పులావ్‌.. లాంటివి వండుకున్నప్పుడు కూరలు కాస్త మసాలా ఘాటుతో ఉంటేనే బాగుంటాయి కదూ! అలాంటి కూరలే ఇవన్నీ మరి.

special spicy curries for roti and pulao
మసాలా ఘాటుతో కూరలు

By

Published : Nov 1, 2020, 12:20 PM IST

హైదరాబాదీ ధమ్‌కా ముర్గ్‌

హైదరాబాదీ ధమ్‌కా ముర్గ్‌

కావలసినవి:

మారినేషన్‌కోసం: చికెన్‌: కేజీ, పెరుగు: అరకప్పు, కారం: టేబుల్‌స్పూను, దనియాలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు: చెంచా, గరంమసాలా: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు. మసాలాకోసం: ఉల్లిపాయలు: మూడు పెద్దవి, అల్లం: పెద్ద ముక్క, వెల్లుల్లి రెబ్బలు: పది, పచ్చిమిర్చి: రెండు, నూనె: అరకప్పు, బిర్యానీ ఆకులు: రెండు, దాల్చినచెక్క: ఒక పెద్ద ముక్క, లవంగాలు: మూడు, టొమాటో గుజ్జు: రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పుపొడి: రెండు చెంచాలు, కొత్తిమీర: కట్ట.

తయారీవిధానం:

ఓ గిన్నెలో మారినేషన్‌ కోసం పెట్టుకున్న పదార్థాలన్నీ వేసి, కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు ఉల్లిపాయల్ని, అల్లంవెల్లుల్లి పచ్చిమిర్చిని విడివిడిగా ముద్దలా చేసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయను చెంచా నూనెలో ఎర్రగా వేయించి తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి... బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, లవంగాలు వేయించి ఉల్లిపాయ ముద్ద వేయాలి. అది వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గుజ్జు వేయాలి. అవీ వేగాక చికెన్‌ ముక్కలు, జీడిపప్పు పొడి, కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేయాలి. ఇది కూరలా తయారయ్యాక కొత్తిమీర వేసి స్టౌ కట్టేయాలి.

మసాలా ఎగ్‌కర్రీ

మసాలా ఎగ్‌కర్రీ

కావలసినవి:

గుడ్లు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, చింతపండురసం: పావుకప్పు, కారం: చెంచా, దనియాలపొడి: ఒకటిన్నర చెంచా, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, నూనె: మూడుచెంచాలు, ఆవాలు: చెంచా, మినప్పప్పు: అరచెంచా, కరివేపాకు: రెండురెబ్బలు. మసాలాకోసం: ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, సెనగపప్పు: అర టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: రెండు, కొబ్బరితురుము: పావుకప్పు, సోంపు: అరచెంచా.

తయారీవిధానం:

స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి.. మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి.. అన్నింటినీ వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి.. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. అన్నీ వేగాయనుకున్నాక ముందగా చేసుకున్న మసాలా, చింతపండు రసం, తగినంత ఉప్పు, కారం, దనియాలపొడి వేసి ఓసారి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక గుడ్లను పగలగొట్టి కర్రీలో వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. రెండు మూడు నిమిషాలకు గుడ్లు ఉడుకుతాయి. అప్పుడు కొత్తిమీర చల్లి దింపేయాలి.

పనీర్‌ కాలీమిర్చ్‌

పనీర్‌ కాలీ మిర్చ్‌

కావలసినవి:

పనీర్‌ ముక్కలు: కప్పు, గరంమసాలా: అరచెంచా, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు: కప్పు, జీడిపప్పు: ఆరు (నానబెట్టుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, పెరుగు: మూడు టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: చెంచా, మిరియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: ముప్పావుచెంచా, ఉప్పు: తగినంత, క్రీమ్‌: పావుకప్పు, కారం: పావుచెంచా, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట, లవంగాలు: నాలుగు, యాలకులు: నాలుగు, దాల్చినచెక్క: చిన్న ముక్క.

తయారీ విధానం:

ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. నిమిషమయ్యాక ఉల్లిపాయ ముద్ద వేయాలి. అది వేగాక స్టౌని సిమ్‌లో పెట్టి గిలకొట్టిన పెరుగు, దనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాలపొడి, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి కప్పు నీళ్లు పోయాలి. ఇది గ్రేవీలా తయారవుతున్నప్పుడు పనీర్‌ముక్కలు, గరంమసాలా, కొత్తిమీర, క్రీమ్‌ వేసి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.

కోకోనట్‌ ప్రాన్‌ కర్రీ

కోకోనట్‌ ప్రాన్‌ కర్రీ

కావలసినవి:

మారినేషన్‌కోసం: రొయ్యలు: అరకేజీ, అల్లంవెల్లుల్లి ముద్ద: అరటేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, కారం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత,నిమ్మరసం: టేబుల్‌స్పూను.మసాలాకోసం: నూనె: పావుకప్పు, ఉల్లిపాయలు: అయిదు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద: అరటేబుల్‌స్పూను, టొమాటోలు: మూడు, కారం: అరటేబుల్‌స్పూను, దనియాలపొడి: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, లవంగాలపొడి: అరచెంచా,దాల్చినచెక్కపొడి: అరచెంచా, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, కొబ్బరి ముద్ద: అరకప్పు.

తయారీవిధానం:

రొయ్యల్ని శుభ్రంగా కడిగి... వాటిపైన మారినేషన్‌కోసం పెట్టుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక కారం, దనియాలపొడి, పసుపు, టొమాటో ముక్కలు వేయాలి. టొమాటో ఉడికాక జీలకర్రపొడి, లవంగాలపొడి, దాల్చినచెక్కపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి రొయ్యలు వేయాలి. రొయ్యలు ఉడికాక కొబ్బరి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక స్టౌ కట్టేయాలి.

ABOUT THE AUTHOR

...view details