తెలంగాణ

telangana

ETV Bharat / priya

DUSSEHRA 2021: దసరా సంబురాలు.. అమ్మ మెచ్చే నైవేద్యాలు.. - దసరా పండుగ వార్తలు

దసరా (Dussehra 2021) వచ్చేస్తోంది. శరన్నవరాత్రుల్లో మహాశక్తిగా కొలిచే దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తారు. ఆరగించరమ్మని ఆహ్వానిస్తారు. అవేంటో చెబుతున్నారు విజయవాడకు చెందిన విష్ణుభట్ల పద్మావతి.

DUSSEHRA 2021
దసరా సంబురాలు

By

Published : Oct 7, 2021, 8:32 AM IST

హేమపాత్ర స్థితమ్‌ దివ్యమ్‌
పరమాన్నమ్‌ సుసంస్కృతం పంచదా
షడ్రసోపేతమ్‌ గృహాణ పరమేశ్వరి
శర్కరా పాయసా పూపమ్‌
ఘృత వ్యంజన సంయుతమ్‌

చిట్టిగారెలు

తొమ్మిదిరోజులు దుర్గమ్మ... మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది. అలసట రాకుండా ‘మాష చక్రములు’ అంటే చిట్టిగారెల్ని పెడతారు. అమ్మవారికి ఇష్టమైన మినుములతో వీటిని చేస్తారు.

కట్టెపొంగలి

పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి...తయారు చేసే కట్టె పొంగలిని భవానీ మాత ఎంతో ఇష్టంగా ఆరగిస్తుందట.

దద్దోజనం

శాంతి రూపాన్ని కోరుకుంటూ, అందరికీ చల్లని దీవెనలు అందించమంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్దోజనం ప్రసాదంగా నివేదిస్తారు.

నువ్వులన్నం

నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ అన్నాన్ని వండుతారు. అసురులతో పోరాడే కాళికకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఇలా చేస్తారు.

చిత్రాన్నం/హరిద్రాన్నం

దుర్గమ్మ మెచ్చే ప్రసాదాల్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి. పోపు సామగ్రి వేసి రుచికరంగా చేసే దీన్ని అమ్మవారు ఇష్టంగా ఆరగిస్తారనేది నమ్మకం.

గుడాన్నం

లలితా సహస్రనామాల్లో ‘గూడాన్నః ప్రీత మానస’ అంటూ చదువుకుంటాం. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. పెసరపప్పు, బియ్యం, ఉడకబెట్టి బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండు ఫలాలను వేసి తయారు చేస్తారు. సకల శుభాలూ అందించమని కోరతారు.

కదంబం ప్రసాదం

దశమిరోజున పదకొండు రకాల కూరగాయలు, పప్పు, బియ్యంతో చేసిన కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు.

అప్పాలు

అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. ఆయన మెచ్చే అప్పాల్నే అమ్మవారికి నివేదిస్తారు. గోధుమ పిండి, బియ్యప్పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి వాడి వీటిని చేస్తారు.

శాకాన్నం

తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి వేసి నవశక్తికి నైవేద్యంగా పెడతారు. సస్యవృద్ధిని కోరుకుంటూ దీన్ని దుర్గమ్మకు పెడతారు.

ఇదీ చూడండి:అరగంటలో 134 వంటకాలు- ఇండియా బుక్​లో చోటు​

దోశెల పిండితో ఐదు రకాల వంటలు ఇలా చేయండి!

FOOD: ఈ కిట్లు తెచ్చుకుంటే... హోటల్‌ రుచులు ఇంట్లోనే!

ABOUT THE AUTHOR

...view details