తెలంగాణ

telangana

రోజుకో బ్రేక్​ఫాస్ట్​.. సింపుల్​గా చేసుకోండిలా!

By

Published : Jun 21, 2020, 2:56 PM IST

పొద్దునే బ్రష్​ చేసుకుంటామో లేదో... కడుపులో ఎలుకలు పరుగెడుతుంటాయి. కానీ, ఏం చేసుకుని తినాలో అర్థం కాదు. రోజూ ఒకే బ్రేక్​ఫాస్ట్​ చేసుకోవాలంటే బోరు. మరి అందుకే, దక్షిణ భారత ప్రత్యేక రెసిపీలు మీ కోసం తెచ్చేశాం. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఐదు రెసిపీలు ఎలా చేయాలో చూసి.. రోజుకో వెరైటీ వండుకోండి!

south indian 5 delicious special breakfast recipes at home
రోజుకో బ్రేక్​ఫాస్ట్​.. సింపుల్​గా చేసుకోండిలా!

రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే సింపుల్​ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలు ఈజీగా చేసుకోండిలా....

రైస్‌ ఇడ్లీ

రైస్‌ ఇడ్లీ

కావలసినవి:

బియ్యపు రవ్వ: ఒకటిన్నర కప్పులు, పలుచని అటుకులు: కప్పు, పుల్లని పెరుగు లేదా మజ్జిగ: కప్పు, బేకింగ్‌ సోడా: చిటికెడు, మంచినీళ్లు: తగినన్ని, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం:

అటుకుల్ని పెరుగులో వేసి నాలుగు నిమిషాలు నానబెట్టి గరిటెతో మెత్తగా చేయాలి. అందులోనే బియ్యపురవ్వ వేసి కొద్దిగా సోడా, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి. అటుకులు, బియ్యపు రవ్వ నీటిశాతాన్ని పీల్చేసుకోవడంతో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలిపి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. దించేముందు ఇడ్లీలు ఉడికాయో లేదో ఓసారి వేలితో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. మృదువుగా స్పాంజిలా ఉండే ఈ ఇన్‌స్టంట్‌ ఇడ్లీలు రుచిగా కూడా ఉంటాయి.

సగ్గుబియ్యం దోశ...

సగ్గుబియ్యం దోశ...

కావల్సినవి:

సగ్గుబియ్యం - కప్పు (కప్పు నీటిలో రెండు గంటలముందు నానబెట్టుకోవాలి) సెనగపిండి - అరకప్పు, బియ్యప్పిండి - అరకప్పు, ఉప్పు - తగినంత, సన్నగా తరిగిన అల్లం ముక్కలు - కొన్ని,ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, , పచ్చిమిర్చి - మూడు, జీలకర్ర - చెంచా, కొత్తిమీర తరుగు - కొద్దిగా, నూనె - అరకప్పు.

తయారీ:

సగ్గుబియ్యంలోని నీళ్లు వంపేయకుండానే సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ, అల్లంముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర చల్లాలి. చుట్టూ నూనె వేసి మూతపెట్టేయాలి. ఐదు నిమిషాలకు ఇది కాలుతుంది. ఈ దోశ మెత్తగానే ఉంటుంది. దీన్ని కొబ్బరిచట్నీతో కలిపి తీసుకోవచ్చు.

బంగాళాదుంపతో వడ

బంగాళాదుంపతో వడ

కావల్సినవి:

బంగాళాదుంప, ఉల్లిపాయ - పెద్దవి ఒక్కోటి చొప్పున, మైదా - టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి - రెండు, సోంపు, జీలకర్ర - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.

తయారీ:

ముందుగా బంగాళాదుంపను కుక్కర్‌లో తీసుకుని మెత్తగా ఉడికించుకుని తీసుకోవాలి. దీన్ని మెత్తని ముద్దలా చేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, మైదాతోపాటూ నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని వడల్లా అద్దుకుని అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి.

బ్రెడ్‌ ఉప్మా

బ్రెడ్‌ ఉప్మా

కావల్సినవి:

బ్రెడ్‌ స్లైసులు - ఐదు, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి - రెండు, అల్లం తరుగు - కొద్దిగా, పసుపు - చిటికెడు, సాంబార్‌పొడి - చెంచా, నెయ్యి - నాలుగు చెంచాలు, ఉప్పు - తగినంత, ఆవాలు, సెనగ పప్పు - అరచెంచా చొప్పున.

తయారీ:

ముందుగా బ్రెడ్‌ స్లైసుల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక బ్రెడ్‌ ముక్కల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, సెనగపప్పూ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టొమాటో ముక్కలూ, పసుపూ, సాంబార్‌ పొడీ, ఉప్పూ వేసి మంట తగ్గించాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.

మిక్స్డ్‌ వెజిటబుల్‌ రోటీ

మిక్స్డ్‌ వెజిటబుల్‌ రోటీ

కావల్సినవి:

గోధుమపిండి - ఒక కప్పు, నూనె - పావుకప్పు, క్రీం చీజ్‌ - ఒక చిన్న డబ్బా, మిరియాలపొడి,కారం - అరచెంచా చొప్పున ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, క్యారెట్‌ తురుము - పావుకప్పు,కొత్తిమీర తరుగు - రెండు పెద్ద చెంచాలు, జీలకర్ర - చెంచా, నువ్వులు - అరచెంచా.

తయారీ:

నూనె, క్రీంచీజ్‌ తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఇది పదినిమిషాలు నానాక మరోసారి కలిపి ఓ ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీన్ని వేడిపెనంమీద వేసి రెండువైపులా నూనె వేసుకుని కాల్చుకుని తీసుకోవాలి. ఇప్పుడు క్రీంచీజ్‌ రాయాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకుంటే చాలు. కావాలనుకుంటే ఈ చపాతీని నచ్చిన ఆకృతిలో చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:కరకరలాడే 'చక్లీలు'.. ఇలా చేస్తే భలే ఉంటాయి!

ABOUT THE AUTHOR

...view details