తెలంగాణ

telangana

ETV Bharat / priya

రాఖీ పండగ వేళ.. వెరైటీ వెరైటీ హల్వా - గోధుమపిండి హల్వా

రక్షా బంధన్​ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రాఖీలతో పాటు స్వీట్లు. మరి రాఖీ కట్టాక నోరు తీపి చేయాలి కదా! దీంతో మిఠాయిలకు కూడా చాలా గిరాకీ ఉంటుంది. బయటకొనే స్వీట్ల కన్నా ఈసారి మీ ఇంట్లోనే మీకు నచ్చిన విధంగా హల్వా రెడీ చేయండి. మరి విభిన్న రకాల హల్వా తయారు చేయడమేలాగో తెలుసుకోండి.

rakhi special halwa recipe verities
హల్వా తయారీ

By

Published : Aug 22, 2021, 8:05 AM IST

కంటిపాపలా చూసుకునే అన్నకూ.. చంటిబిడ్డలాంటి తమ్ముడికీ.. రాఖీ కట్టెయ్యండి.. హల్వా పెట్టెయ్యండి. ఏ హల్వా అంటారా?.. ఇవిగో వీటిలో మీకు నచ్చింది చేసి.. వారికి కొసరి కొసరి తినిపించండి.

బీట్‌రూట్‌తో..

బీట్​రూట్​తో..

కావాల్సినవి:బీట్‌రూట్‌ తురుము, నెయ్యి, జీడిపప్పు, పంచదార- కప్పు చొప్పున, పాలు- రెండు కప్పులు, కోవా- రెండు పెద్ద చెంచాలు, యాలకుల పొడి- అరచెంచా.

తయారీ:కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి బీట్‌రూట్‌ తురుమును వేయించాలి. మూతపెట్టి పదినిమిషాలపాటు మంటను చిన్నగా పెట్టి మగ్గనివ్వాలి. బీట్‌రూట్‌ బాగా మగ్గిన తరువాత పాలు పోయాలి. కోవాను జతచేసి మరికాసేపు ఉడికించాలి. మంటను మధ్యస్థంగా పెట్టి మిశ్రమం దగ్గర పడేవరకు ఉడికించాలి. ఆ తర్వాత చక్కెర వేసి కలపాలి. మిశ్రమం మరికాస్త దగ్గర పడ్డాక యాలకుల పొడి, మరికాస్త నెయ్యి వేసి మగ్గించాలి. చివరగా వేయించిన జీడిపప్పును కలపాలి. అంతే యమ్మీ యమ్మీ బీట్‌రూట్‌ హల్వా రెడీ.

డ్రైఫ్రూట్స్‌తో..

డ్రైఫ్రూట్స్​తో..

కావాల్సినవి:ఖర్జూరాలు- కప్పు, వేడినీళ్లు- తగినన్ని, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్‌- పావు కప్పు చొప్పున, కిస్‌మిస్‌, చిరోంజీ, పుచ్చకాయ విత్తనాలు- పెద్ద చెంచా చొప్పున, నెయ్యి- తగినంత, యాలకుల పొడి- పావుచెంచా, చక్కెర, నీళ్లు- అరకప్పు చొప్పున.

తయారీ:కప్పు వేడి నీళ్లలో ఖర్జూరాలను పావుగంట నానబెట్టాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నీళ్లు పోయాలి. ఇందులోనే చక్కెర వేసి కరిగిన తరువాత పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మరో పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక బాదం, కాజూ, వాల్‌నట్స్‌, పిస్తా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి కిస్‌మిస్‌, చిరోంజీ, పుచ్చకాయ విత్తనాలను రోస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి. ఆ తరువాత ఖర్జూరాలను మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక ఖర్జూరాల ప్యూరీ వేసి కాసేపు వేయించాలి. తర్వాత చక్కెర పాకం వేసి ఆ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో డ్రైఫ్రూట్స్‌ పొడి కలపాలి. దీనికి యాలకుల పొడి జత చేయాలి. రెండు చెంచాల నెయ్యి వేసి తేమ అంతా పోయేలా కలుపుతూనే ఉండాలి. అది దగ్గర పడ్డాక దించేయాలి. ఇప్పుడొక ప్లేట్‌కు నెయ్యి రాసి హల్వాను దానిపై సమానంగా వేయాలి. దీనిపై వేయించిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి. దీన్ని ముక్కలుగా లేదా అలాగే గిన్నెలో వేసి ప్రేమతో అన్నాతమ్ముళ్లకు అందించండి.

బాదంతో..

బాదంతో..

కావాల్సినవి: బాదం, చక్కెర- రెండు కప్పుల చొప్పున, కాచి చల్లార్చిన పాలు- కప్పున్నర నెయ్యి- కప్పు, కుంకుమపువ్వు- కొద్దిగా.

తయారీ:బాదం గింజలను రాత్రంతా (దాదాపు 12 గంటలు) నానబెట్టాలి. ఆ తరువాత పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి పాలు పోస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక బాదం పేస్ట్‌ వేసి మధ్యస్థ మంటపై దాదాపు 20 నిమిషాలపాటు నీళ్లన్నీ ఇగిరిపోయేలా ఉడికించాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక చక్కెర వేసి చిన్నమంటపై పదినిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం నుంచి బుడగలు వచ్చే సమయంలో మరికాస్త నెయ్యి వేసి కలపాలి. కాసేపటి తరువాత బాదం పేస్ట్‌ నెయ్యిని పూర్తిగా పీల్చుకుంటుంది. ఇప్పుడు కుంకుమపువ్వు కలిపిన పాలను దీంట్లో కలపాలి. మరికాసేపు కలియబెట్టి చివరకు మరికాస్త నెయ్యి కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి. బాదం తరుగూ, కుంకుమపువ్వుతో గార్నిష్‌ చేసుకుంటే ఘుమఘుమలాడే రుచికరమైన బాదం హల్వా రెడీ!

గోధుమ పిండితో..

గోధుమపిండితో..

కావాల్సినవి:గోధుమపిండి, నెయ్యి- కప్పు చొప్పున, నీళ్లు- అయిదున్నర కప్పులు, చక్కెర- కప్పున్నర, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం - రెండు పెద్ద చెంచాల చొప్పున, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌- చిటికెడు, ఇలాచీ పొడి- పావు చెంచా.

తయారీ:గోధుమపిండిలో నీళ్లు పోసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో ఐదు కప్పుల నీళ్లు పోసి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. ఇప్పుడు ఈ ముద్దని నీళ్లలో పూర్తిగా కలిపేయాలి. ఇది గోధుమ పాలలా తయారవుతుంది. ఈ నీటిని వడబోయాలి. ఇలా చేస్తే పిండి అవశేషాలుంటే తీసేయడానికి వీలవుతుంది. ఈ గోధుమ పాలను ఓ పెద్ద కడాయిలోకి తీసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి పావుగంటపాటు కలుపుతూనే ఉండాలి. ఇది చిక్కబడ్డాక చక్కెర, కాస్తంత నెయ్యి వేసి చక్కెర బాగా కరిగేలా కలపాలి. పావుగంటలో పిండి మిశ్రమం నెయ్యిని పూర్తిగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మరో పెద్ద చెంచా నెయ్యి వేసి మంటను మధ్యస్థంగా పెట్టి కలుపుతూనే ఉండాలి. నెయ్యి పూర్తిగా కరిగాక మరో చెంచా నెయ్యి వెయ్యాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి లేదా పిండి నుంచి నెయ్యి బయటకు వచ్చేవరకూ చేస్తూనే ఉండాలి. నెయ్యి పిండిపై పేరుకున్నాక బాదం, కాజూ తరుగు, చిటికెడు ఫుడ్‌ కలర్‌ వేసి బాగా కలపాలి.

మిశ్రమం బాగా దగ్గర పడి నెయ్యి పైకి తేలేవరకు కలుపుతూనే ఉండాలి. మిశ్రమం దగ్గర పడ్డాక పొయ్యి కట్టేసి, యాలకుల పొడిని చేర్చాలి. ఓ ప్లేట్‌లో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి. దీనిపై డ్రైఫ్రూట్స్‌ తరుగుతో అలంకరించుకోవాలి. రెండు మూడు గంటలపాటు చల్లారనిచ్చి ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన గోధుమ హల్వా రెడీ.

చిలగడదుంపతో..

చిలగడదుంపతో..

కావాల్సినవి:ఉడికించిన చిలగడ దుంపలు- అరకిలో, నెయ్యి- కప్పు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌- గుప్పెడు, కాచి చల్లార్చిన పాలు- కప్పు, పంచదార- పావు కప్పు, యాలకుల పొడి- అర చెంచా, కుంకుమపువ్వు- చిటికెడు(ఆప్షనల్‌).

తయారీ:ఉడికించిన చిలగడ దుంపను తురిమి పక్కన పెట్టుకోవాలి లేదా చేత్తో కూడా మెత్తగా మెదపొచ్చు. పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక జీడిపప్పు, తరిగిన బాదం వేసి రెండు, మూడు నిమిషాలు వేయించాలి. ఇవి కొద్దిగా బంగారు వర్ణంలోకి మారే సమయంలో కిస్‌మిస్‌ను కూడా వేసి మరికాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో పెద్ద చెంచా నెయ్యి వేసి వేడయ్యాక చిలగడదుంప తురుమును వేసి వేయించాలి. మరికాస్త నెయ్యిని కూడా జత చేయాలి. ఆ తరువాత రెండు మూడు నిమిషాలయ్యాక పాలను పోయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి నీరంతా ఇగిరి పోయేవరకు 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పంచదార కలపాలి. ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు, యాలకుల పొడి, నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి. దీంట్లోనే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ను వేయాలి. దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని మరిన్ని నట్స్‌తో గార్నిష్‌ చేస్తే సరి.

ఇదీ చదవండి:ఇడ్లీలు బాగా పొంగాలంటే ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details