కొంతమందికి ముక్కలేకపోతే ముద్ద దిగదు. ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకోకుండా బడ్జెట్లో ఆలోచిస్తే సరిపోయేది చేప. అలాంటి చేప కొత్తగా ట్రై చేయాలి అంటే ఆవిరిపై చేసుకోవాల్సిందే. అయితే అందుకు తయారీ విధానం, కావాల్సిన వస్తువులు ఇప్పుడు చూద్దాం.
కావాల్సినవి: చేపముక్కలు లేదా చిన్న చేపలు- ఎనిమిది, కొబ్బరికోరు- నాలుగు చెంచాలు, కొత్తిమీర- కట్ట, జీలకర్ర- పావుచెంచా, అరిటాకులు- ఎనిమిది, పచ్చిమిర్చి- ఆరు, వెల్లుల్లి రెబ్బలు- పది, నిమ్మరసం- ఆరు చెంచాలు, ఉప్పు- తగినంత, పసుపు- తగినంత
తయారీ: వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో చేపలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని ఓ పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొత్తిమీర, కొబ్బరికోరు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి వీటన్నింటిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అరటి ఆకులపై ఒక్కో చేపనీ పెడుతూ దానిపై రుబ్బి పెట్టుకున్న పేస్ట్‌ని తగినంత వేసి అరటి ఆకులని అరటినారతో చక్కగా విడిపోకుండా ప్యాక్ చేసుకోవాలి. ఇడ్లీపాత్ర లేదా ఏదైనా ఒక పాత్రలో కప్పున్నర నీళ్లు పోసుకుని అవి మరిగిన తర్వాత మరొక పాత్రలో ఈ చేపముక్కలని ఉంచి ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాల్లో చేపలు ఉడికిపోతాయి. నూనె, మసాలాలు లేని ఈ కూర రుచిగానే కాదు.. ఒమెగా పోషకాలనీ పుష్కలంగా అందిస్తుంది.
ఇదీ చూడండి: పసందైన మామిడి రసం చేసుకోండిలా..!