పసుపు టీ
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలతో పాటు కర్క్యుమిన్ అనే ఓ రసాయనిక సమ్మేళనం ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహకరిస్తాయి. అంతేకాదు మంట, నొప్పిని తట్టుకునేలా మన శరీరాన్ని తయారుచేస్తాయి. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. ఒక బౌల్‌లో కప్పు నీళ్లు తీసుకొని.. అందులో అర టీస్పూన్ పసుపు వేసి.. సుమారు 15-20 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక తేనె, నిమ్మరసం కలుపుకొని గోరువెచ్చగా తాగేయాలి.
మసాలా టీ
వ్యాధినిరోధక శక్తిని పెంచే పానీయాల్లో మసాలా టీ ఒకటి. వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా దీనిని తయారుచేసుకోవచ్చు. తురిమిన అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, తులసి ఆకులను.. కొద్ది మొత్తాల్లో తీసుకొని, కప్పు నీటిలో వేసి 30 నిమిషాల పాటు మరిగించాలి. కాస్త చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకొని అందులో తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితముంటుంది. ఈ టీలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు కరోనా లాంటి ఇన్ఫెక్షన్లను నివారించే లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు లాంటి వ్యాధులతో సమర్థంగా పోరాడడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను అందిస్తాయి.
గ్రీన్ స్మూతీ
రోగనిరోధక శక్తిని పెంచుతూనే, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే పానీయాల్లో గ్రీన్ స్మూతీ కూడా ఒకటి. ఇందులో విటమిన్-ఎ, సి, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో బాగా సహకరిస్తాయి. అంతేకాదు శరీరానికి చలువనందించి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తాయి. ఇందుకోసం ఏం చేయాలంటే... కప్పు చొప్పున పాలకూర తరుగు, మామిడి లేదా పైనాపిల్ పండు ముక్కలు, బాదం పాలు లేదా పెరుగును ఒక బౌల్‌లోకి తీసుకుని.. అందులో టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ తాజాగా తురిమిన అల్లం వేయాలి.. వీటన్నింటినీ మిక్సర్‌లో వేసి స్మూతీలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది.