చేపలను రకరకాల పద్ధతుల్లో వండుతుంటాం. ఎక్కువమంది వాటిని పులుసు చేసేందుకే ఇష్టపడతారు. దానికి ఉన్న టేస్ట్ అలాంది మరి. అయితే పాము చేప పులుసు(eel fish curry recipe) ఎప్పుడైనా తిన్నారా? అసలు ఈ పేరే వినుండరు కదూ! కానీ దీంతో చేసే పులుసు టేస్టే వేరు. ఒకసారి తిన్నారంటే మళ్లీ వదిలిపెట్టరు! అలాంటి పాము చేపల పులుసు ఎలా వండుకోలా చూసేద్దామా
కావాల్సిన పదార్థాలు
పాము చేప, నూనె, ఉల్లిపాయలు, మిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు, జీలకర్ర-ధనియాలు పొడి, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర.
తయారీ విధానం
ముందుగా చేపను శుభ్రంగా కడుక్కోవాలి. చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి, దానిపై ఉంచిన పాన్‌లో నూనె వేడి చేసి.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకుని కాసేపు వేయించాలి. తర్వాత చేప ముక్కలు వేసి కొంత సమయం ఉడికించాలి. తర్వాత కారం, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోయాలి. పక్కన ఉంచిన చింతపండు పులుసు ఇందులో వేసి బాగా కలపాలి. గ్రేవీ కాస్త దగ్గరపడే సమయంలో జీలకర్ర, దనియాలు పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చేపల పులుసు స్టవ్‌పై నుంచి దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అంతే పాము చేపల పులుసు రెడీ.
ఇదీ చూడండి:kerala chicken: కేరళ స్టైల్ చికెన్ కర్రీ- తింటే మైమరచిపోవాల్సిందే!