బంగాళా దుంపతో ఏ స్నాక్ చేసినా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. అందుకే భారత్లో ఏ ఇంట చూసినా బంగాళా దుంపలు ఉండి తీరుతాయి. ఇక ఆలూకు క్యారెట్, చాట్ మసాలాలు జత చేసి, వేడి వేడి నూనెలో వేయించి పొటాటో లాలిపాప్స్ చేస్తే.. ఆహా.. ఇక ఆ రుచికి సాటేముంది చెప్పండి. అందుకే మరి, మీ ఇంట్లో సులభంగా రెస్టారెంట్ స్టైల్ 'పొటాటో లాలీపాస్స్' తయారు చేసుకోండిలా...
నోరూరించే 'పొటాటో లాలిపాప్స్' సింపుల్గా చేసేద్దామిలా! కావలసినవి ఇవే..
అల్లం పేస్ట్-1 టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి ముక్కలు-1 టేబుల్ స్పూన్, బ్రెడ్ ముక్కలు-3, బంగాళదుంప-పెద్దది ఒకటి, క్యారెట్-2, చాట్ మసాలా-1 టీస్పూన్, జీలకర్ర పొడి-1 టీస్పూన్, ఉప్పు-రుచికి తగినంత, కార్న్ ఫ్లోర్-2 టేబుల్ స్పూన్లు
సింపుల్గా చేసేయండి..
పొటాటో లాలిపాప్స్ను ఎంతో సులభంగా క్షణాల్లో చేసుకోవచ్చు. ముందుగా ఆలూ, క్యారెట్లను విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలను నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, పచ్చిమిర్చి కలిపి దంచుకుని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప, క్యారెట్ ముక్కలను ఓ గిన్నెలో తీసుకుని.. అందులో చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకుని ముక్కలను మెత్తగా చేస్తూ కలపాలి. వెంటనే, నానబెట్టుకున్న బ్రెడ్ ముక్కల్లో నీటిని పిండేసి ఆలూ మిశ్రమంలో వేయాలి. అందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టుతోపాటు కార్న్ ఫ్లోర్నూ వేసి బాగా కలపాలి.
బాగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బాగా కాగిన నూనెలో ఈ ఉండలను వేసి బంగారు రంగు వచ్చే వరకు చక్కగా డీప్ ఫ్రై చేయాలి. ఉండలను బయటకు తీశాక టూత్పిక్స్ గుచ్చేసి వాటిని లాలిపాప్స్లా చేయాలి. అంతే, కాసింత టామాటా సాస్ పక్కన పెట్టి, వేడి వేడిగా సర్వ్ చేస్తే.. తిన్నవారు ఆహా అనకమానరంటే నమ్మండి.
మరి ఇంట్లోనే ఎంతో సులభంగా పొటాటో లాలిపాప్స్ చేసుకోవడం ఎలాగో చూసేశారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్తో పంచుకోవడం మాత్రం మరచిపోకండి.
ఇదీ చదవండి:మైమరపించే 'గుల్కండ్ షేక్' రెసిపీ మీకోసం!