తెలంగాణ

telangana

ETV Bharat / priya

కేరళ చేపల వెరైటీలు.. మనింట్లోనే చేసుకుందామిలా! - etv bharat food

కేరళ వంటకం అనగానే గుర్తొచ్చేవి.. అరిటాకులో వడ్డించిన కమ్మని కొబ్బరి ఘుమఘుమలు. ఇక తీర ప్రాంతాల చేపల రుచే వేరు. మరి ఆ కమ్మని రుచిని ఆస్వాదించాలంటే ఈసారి చేపలతో ఇలా ప్రయత్నించాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి..

kerala style fish curry and spicy fish  fry with nethili kulumbu
కేరళ చేపల వెరైటీలు.. మనింట్లోనే చేసుకుందామిలా!

By

Published : Aug 14, 2020, 1:00 PM IST

ప్రతి ప్రాంతానికి ఆహార సంప్రదాయాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే కేరళలో చేపల వెరైటీలు ప్రసిద్ధికెక్కాయి. అక్కడి రుచి దేశంలో ఇంకెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదు. మరి వాటిని మనింట్లోనే ట్రై చేద్దామా..

స్పైసీ ఫిష్‌ ఫ్రై

స్పైసీ ఫిష్‌ ఫ్రై..

కావాల్సినవి

చేపలు - అరకేజీ, కారం- నాలుగు చెంచాలు, పసుపు- పావు చెంచా, అల్లం ముక్క- చిన్నది, మిరియాలు - చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, ఉప్పు - తగినంత, నూనె- వేయించేందుకు సరిపడా.

తయారీ

ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె పోయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

నెత్తిలి కుళంబు

నెత్తిలి కుళంబు..

కావాల్సినవి

నెత్తిలి చేపలు- అర కేజీ, ఉల్లిపాయలు - రెండు, అల్లం ముక్కలు- చెంచా, టొమాటోలు - రెండు, నూనె - నాలుగు చెంచాలు, కరివేపాకు- నాలుగు రెబ్బలు, చింతపండు రసం- కప్పు, కారం - రెండు చెంచాలు, ధనియాలపొడి - చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - పావుచెంచా.

తయారీ

చేపలను శుభ్రం చేసుకున్నాక వాటిపై పసుపూ, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసాన్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇందులో కారం, ధనియాల పొడీ వేయాలి. అల్లం, ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకొని తీసుకోవాలి. అదే విధంగా టొమాటో ముక్కల్ని కూడా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక కరివేపాకూ, ముందుగా చేసిపెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసి వేయించాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక టొమాటో ముద్ద వేయాలి. అది బాగా ఉడికాక చింతపండు గుజ్జూ, ఇంకొంచెం ఉప్పూ వేయాలి. ఈ రసం బాగా ఉడికిందనుకున్నాక చేపల్ని వేసి మంట తగ్గించాలి. పది నిమిషాల్లో చేపలు ఉడుకుతాయి. అప్పుడు దింపేయాలి.

మలబార్‌ ఫిష్‌ కర్రీ

మలబార్‌ ఫిష్‌ కర్రీ..

కావాల్సినవి

చేప ముక్కలు - ఒకటిన్నర కప్పు, కొబ్బరి ముక్కలు - అర కప్పు, పసుపు - చెంచా, అల్లం తరుగు - చెంచా, పచ్చిమిర్చి - ఒకటి, చింతపండు గుజ్జు - మూడు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, మినప్పప్పు, ఆవాలు - అరచెంచా చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, కొబ్బరి నూనె - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, కారం చెంచా.

తయారీ

కొబ్బరి ముక్కలూ, పసుపూ, అల్లం తరుగూ, కారం, తగినంత ఉప్పూ, చింతపండు గుజ్జూ, పచ్చిమిర్చీ, అరచెంచా నీళ్లు మిక్సీలో తీసుకుని ముద్దలా చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని వేయాలి. ఐదు నిమిషాలు వేయించి.. అందులో చేపముక్కలను వేసి బాగా కలిపి దింపేయాలి. మరో గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మినప్పప్పూ, ఆవాలూ, కరివేపాకు వేసి ఆ తాలింపులో చేప ముక్కల్ని వేసి మూత పెట్టేయాలి. అవి ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.

ఇదీ చదవండి:'కొత్తు చిల్లీ దోశ' అన్నంలో నంజుకు తినేయండి..

ABOUT THE AUTHOR

...view details