తెలంగాణ

telangana

అతిథులు మెచ్చే కల్యాణ రసం.. కమ్మగా చేసేయండిలా

అసలే వర్షాకాలం. ఆపై ఉదయాన్నే చినుకులు పడుతూ, చలిగా ఉంటే లేవడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కాస్త ఎక్కుసేపు పడుకుంటాం. అలాంటప్పుడు తక్కువ సమయంలో వంట చేసుకోవాల్సి ఉంటుంది. సాంబార్​, రసం, సూప్​లు అయితే సింపుల్​గా క్షణాల్లో తయారు చేసేయొచ్చు. వాటి కోవలోకే వచ్చే ఈ కల్యాణ రసం కూడా తెలుసుకొని ఓసారి ప్రయత్నించండి.

By

Published : Jun 26, 2020, 1:16 PM IST

Published : Jun 26, 2020, 1:16 PM IST

Updated : Jun 26, 2020, 2:26 PM IST

kalyana rasam making in telugu
అతిథుల మెచ్చే కల్యాణరసం.. కమ్మగా చేసేయండిలా..

పెళ్లికో, విందుకో వెళ్లామనుకోండి. అక్కడ వేడి వేడిగా వడ్డించే కల్యాణ రసం చాలు కడుపునిండిపోవడానికి. ఆహా అనిపించే రుచితో కూడిన వంటకాన్ని ఇంటిలోనూ సింపుల్​గా చేసుకోవచ్చు. అప్పడాలు, వడియాలు కాంబినేషన్​తో ట్రై చేస్తే సూపర్​గా ఉంటుంది. మరి తయారీ ఎలాగో తెలుసుకుందామా..?

కావలసినవి..

  • పొడికోసం:

కందిపప్పు: టేబుల్‌స్పూను, దనియాలు: టేబుల్‌స్పూను, మిరియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, ఎండుమిర్చి: రెండు, నూనె: టీస్పూను

  • రసం తయారీకోసం:

కందిపప్పు: 3 టేబుల్‌ స్పూన్లు, టొమాటో: ఒకటి, చింతపండు: నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు: 4, మిరియాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, పసుపు: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, మంచినీళ్లు: తగినన్ని

  • తాలింపుకోసం:

నూనె: ఒకటిన్నర టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, ఇంగువ: చిటికెడు, కొత్తిమీర: కట్ట

తయారుచేసే విధానం..

  • అరకప్పు గోరువెచ్చని నీళ్లలో చింతపండు వేసి నానబెట్టాలి.
  • విడిగా ఓ పాన్‌లో టీస్పూను నూనె వేసి పొడి కోసం తీసుకున్నవన్నీ వేసి వేయించాలి. చల్లారాక పొడి చేయాలి.
  • టొమాటోను ముక్కలుగా కోసి అరకప్పు నీళ్లు పోసి మెత్తగా పిసికి రసం పిండాలి. కుక్కర్‌లో కందిపప్పు, పసుపు వేసి ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి టొమాటో రసం, చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి.
  • వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర మెత్తగా నూరాలి.
  • మందపాటి గిన్నెలో టీస్పూను నూనె వేసి వెల్లుల్లి మిశ్రమం వేసి వేగాక పప్పు, టొమాటో, చింతపండు రసం వేసి సిమ్‌లో మరిగించాలి. తరవాత రసం పొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ మరికాసేపు మరిగించాలి.
  • చిన్న బాణలిలో నూనె వేసి తాలింపుదినుసులన్నీ వేసి రసంలో కలపాలి. చివరగా కొత్తిమీర వేస్తే కళ్యాణరసం రెడీ. పెళ్లిళ్లలో ఎక్కువగా ఈ పద్ధతిలోనే ఈ వంటకాన్ని చేస్తుంటారు.

ఇదీ చూడండి: బేక్​ చేయకుండా కేక్​ చేసుకోండిలా...

Last Updated : Jun 26, 2020, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details