తెలంగాణ

telangana

ETV Bharat / priya

కాకరకాయ పచ్చడి ఇలా చేస్తే అస్సలు చేదుండదు! - కాకరకాయ

కాకరకాయ పేరెత్తితే చాలు అమ్మో చేదు మేం తినలేం అని చాలా మంది అంటుంటారు. కానీ, ఒక్కసారి ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని రుచి చూస్తే.. అస్సలు వదిలిపెట్టరు. వేడి వేడి అన్నంలో నెయ్యి లేకున్నా.. ఈ పచ్చడితో బండెడు అన్నం లాగించేయొచ్చు. అంతటి రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Kakarakaya Nilava Pachadi (Bitter Gourd Pickle Recipe)
కాకరకాయ పచ్చడి.. తిన్నారంటే వదిలిపెట్టరంతే!

By

Published : Aug 12, 2021, 1:18 PM IST

సాధారణంగా ప్రతిపూట భోజనంలో కూరలతో పాటు కొద్దిగా పచ్చడి తినేవారూ ఉంటారు. అయితే ఎక్కువమంది ఆవకాయకే మొగ్గుచూపుతారు. ఎందుకంటే అది అంత ఫేమస్​. దాని రుచికి తగ్గట్టుగా వేడి వేడి అన్నంలో నెయ్యి లేకున్నా అమృతంలా అనిపించే కాకరకాయ పచ్చడి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. రుచిలో చేదు అయినా.. ఆవకాయతో పోల్చుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది. దాంతో పాటు తినడానికి భలే రుచిగానూ ఉంటుంది. కాకరకాయ అంటేనే నచ్చని వాళ్లూ ఈ పచ్చడిని భలేగా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం కాకరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు..

  • కాకరకాయలు - (1/2 కిలో)
  • కారం - (2 స్పూన్లు)
  • ఆవాల పొడి - (2 స్పూన్లు)
  • జీలకర్ర పొడి - (1 స్పూన్​)
  • పసుపు - (తగినంత)
  • ఉప్పు - (తగినంత)
  • నూనె - (డీప్​ఫ్రైకి సరిపడినంత)
  • మెంతిపొడి - (2 స్పూన్లు)
  • నువ్వుల పొడి (2 స్పూన్లు)
  • చింతపండు గుజ్జు - (100 గ్రా.)
  • బెల్లం - (చిటికెడంత)
  • పోపు దినుసులు

తయారీ విధానం..

ముందుగా స్టవ్​ వెలిగించి ఆయిల్​ వేసుకొని.. కాకరకాయ ముక్కలను డీప్​ఫ్రై చేసుకోవాలి. ముక్కలను దోరగా వేయించుకోవాలి. వేగిన కాకరకాయ ముక్కలను విడిగా తీసుకొని.. మిగిలిన ఆయిల్​లో చింతపండు గుజ్జును ఫ్రై చేసుకోవాలి. అందులో కారం, ఉప్పు, పసుపు, ఆవాలు పొడి, మెంతిపిండి, నువ్వుల పొడి, బెల్లం(తగినంత), జీలకర్ర పొడి కలుపుకొని.. బాగా వేయించాలి. వేయించిన చింతపండు గుజ్జులో కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని విడిగా తీసుకోవాలి.

కాకరకాయ పచ్చడి తాలింపు కోసం ప్యాన్​లో నూనె విడిగా తీసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. వేగిన పోపును మిశ్రమంలో కలపాలి. దీంతో మీరు ఎంతగానో ఇష్టపడే కాకరకాయి పచ్చడి రెడీ! పచ్చడిని తయారు చేసుకున్న తర్వాత రెండు రోజుల పాటు జాడీలో నిల్వ ఉంచి.. ఉప్పు, కారం, నూనె పరిమాణాన్ని సరిచూసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాదాపు 2-3 నెలల పాటు కాకరకాయ పచ్చడి నిల్వ ఉంటుంది.

ఇదీ చూడండి..రుచిలో చేదు అయినా.. పోషకాల్లో ఖజానా!

ABOUT THE AUTHOR

...view details