అటు వేడివేడిగా కడుపు నిండుగా, ఇటు మీ ఫిట్‌నెస్ కోల్పోకుండా ఉండాలంటే ఈ చల్లని వాతావరణంలో సూప్స్ ట్రై చేయడం బెటర్. మరి అలా నోరూరిస్తూ.. చలిని దూరం చేసే ఈ వెరైటీలను ఇలా తయారు చేసేద్దాం...
బాదం సూప్
కావాల్సినవి :
- బాదంపప్పులు - అరకప్పు
- పాలు - అరకప్పు
- మష్రూమ్స్(పుట్టగొడుగులు) - 50 గ్రాములు
- వెన్న - 2 టేబుల్ స్పూన్లు
- మైదా - 4 టేబుల్ స్పూన్లు
- నీళ్లు - 4 కప్పులు
- ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
- మిరియాల పొడి - పావు చెంచా
- క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు
తయారీ :
నానబెట్టిన బాదంపప్పుల్లో కొన్నింటిని తీసుకొని మీడియం సైజులో తరిగి పక్కన పెట్టుకోవాలి. మిగతా బాదంపప్పులను పాలలో వేసి బాగా కలిసిపోయేలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ప్యాన్‌లో వెన్న వేసి తరిగిన బాదంపప్పులు, మష్రూమ్స్(పుట్టగొడుగులు) దోరగా వేయించుకోవాలి. అందులో మైదా వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మిశ్రమాన్ని కలుపుతుండాలి. ఈక్రమంలో మైదా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న బాదం పాలను దీనికి చేర్చుకోవాలి. సరిపోయేంత ఉప్పు, మిరియాల పొడి వేసి అయిదు నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఈ క్రమంలో ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత దించి క్రీమ్ కలుపుకుంటే టేస్టీగా ఉండే బాదం సూప్ రెడీ!
టొమాటో సూప్
కావాల్సినవి :
- టొమాటో - కిలో
- జాస్మిన్ టీ బ్యాగ్స్ - 2
- పుదీనా తరుగు - కొద్దిగా
- టబస్కో (సాస్) - ఒక టీస్పూన్
- ఉప్పు - తగినంత
- గార్లిక్ బ్రెడ్ - 4 ముక్కలు
- మిరియాల పొడి - తగినంత
తయారీ :
తొక్కతో పాటు గింజలను తొలగించిన టొమాటోలను స్టౌ మీద ఉడికించుకోవాలి. రసం చిక్కగా మారే సమయంలో ఉప్పు, మిరియాల పొడి, పుదీనా తరుగు, సాస్‌ను కలుపుకొని కాసేపు వేడిచేయాలి. ఇప్పుడు మరో బౌల్‌లో నీటిని తీసుకొని అందులో జాస్మిన్ టీ బ్యాగ్స్ వేసి మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగి రసం దిగిన తర్వాత దాన్ని టొమాటో రసంలో కలుపుకొని గరిటతో తిప్పుకుంటే టొమాటో సూప్ సిద్ధమైనట్లే. దీన్ని నేరుగా తాగేయచ్చు.. లేదంటే గార్లిక్ బ్రెడ్, సాధారణంగా దొరికే మిల్క్ బ్రెడ్‌కి మంచింగ్‌గా తీసుకోవచ్చు. ఈ సూప్ అటు పులుపుగా, ఇటు వేడివేడిగా ఉండడం వల్ల నోటికి రుచిస్తుంది.