గుడ్డు బలవర్థకమైన పదార్థం. అలాగని రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే ఎగ్వంటకాలను వెరైటీగా ట్రై చేస్తే రుచి, ఆరోగ్యం మన సొంతమే. మరి నోరూరించే గుడ్డుతో ఓ వంటకం తయారు చేయాలనుందా? అయితే ఆమ్లెట్ నూడుల్స్ గురించి తెలుసుకోండి.
కావల్సినవి:
గుడ్లు - రెండు, ఉల్లిపాయ ముక్కలు - కప్పు, క్యాప్సికం - ఒకటి, టొమాటో ముక్కలు - పావుకప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు - చెంచా చొప్పున, మిరియాల పొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - పావు కప్పు, కారం - అర చెంచా, పసుపు - చిటికెడు , కొత్తిమీర తరుగు - గుప్పెడు.
తయారీ: మొదట బాణలిని పొయ్యిమీద పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక గుడ్ల సొనను గిలకొట్టి ఆమ్లెట్‌లా పోయాలి. దీనిపై ఉప్పు, పావుచెంచా చొప్పున కారం, మిరియాల పొడి చల్లి, రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. దీన్ని గుండ్రంగా చుట్టి సన్నగా, నూడుల్స్ ఆకృతిలో వచ్చేలా కోసి పెట్టుకోవాలి. ఇంతకు ముందు ఉపయోగించిన బాణలినే మళ్లీ పొయ్యి మీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు టొమాటో, క్యాప్సికం ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిగిలిన కారం, మిరియాలపొడి వేయాలి. ఇందులోని నీరంతా ఇంకిపోయి, కూరగాయ ముక్కలు దగ్గరకి వచ్చాక కొత్తిమీర, కోసిపెట్టుకున్న ఆమ్లెట్ నూడుల్స్ వేసి రెండు నిమిషాలపాటు కలిపి దింపేస్తే చాలు.
ఇదీ చూడండి: రోజుకో బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా చేసుకోండిలా!