తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఆరోగ్యానికి ఒంటెపాలు.. మేలంటున్న నిపుణులు - ఆరోగ్యానికి మేలు కలిగించే ఒంటె పాలు

ఆరోగ్యం కోసమనో ఆధునిక మార్గమనో మామూలుగా మనం తాగే పాలకి బదులుగా అప్పుడప్పుడూ వేరే రకాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మేకపాలు, బాదం పాలు, గాడిదపాలు, సోయాపాలు ఈ కోవలోనివే. కానీ వీటన్నింటినీ తలదన్నేందుకు సిద్ధమవుతోంది ఒంటెపాల మార్కెట్‌! ఆరోగ్యం విషయంలో దీనికి సమానం మరేదీ లేదంటున్న నిపుణులు... దీని వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలని చెబుతున్నారు. ఆ రెండింటికీ సంబంధం ఏమిటంటారా..! మీరే చదవండి...

health experts says camel milk is good for health
ఆరోగ్యానికి ఒంటెపాలు

By

Published : Nov 22, 2020, 2:36 PM IST

మనదేశంలో పెద్దగా లేదుకానీ ప్రపంచవ్యాప్తంగా ఒంటెపాల మార్కెట్‌ చాలా పెద్దది. గత ఏడాదే నాలుగున్నర లక్షల కోట్ల వ్యాపారం జరిగిందంటే చూసుకోండి! ఒంటెపాలకి సోమాలియా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాలూ, అరబ్బు దేశాలే ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు. అక్కడి నుంచి పాలూ, గడ్డకట్టించిన పాలు, పొడిగా చేసిన పాల పౌడర్‌లు వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతుంటాయి. మరీ ఆఫ్రికా, అరబ్బు దేశాల స్థాయిలో కాకున్నా ఒంటెలు మనదేశంలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడూ దేశవ్యాప్తంగా వాటి పాల సేకరణ, సరఫరాలపైన దృష్టిపెట్టలేదు. ప్రస్తుతం ఆ అవసరం రావడానికి విదేశాల తరహాలో ఇక్కడా భారీగా లాభాలు చూడాలన్నది ఒక్కటే కారణం కాదు. ఈ పాల ఉత్పత్తి ద్వారానైనా మనదేశంలో ఒంటెల సంఖ్య అంతరించిపోకుండా కాచుకోవాలన్నదే ఉద్దేశం. ఒంటెల ద్వారా వేలాది సంవత్సరాల పర్యావరణ చక్రాన్ని తెగిపోకుండా చూడటం దీని వెనకున్న అసలు లక్ష్యం!

ఒంటెలు అంతరిస్తున్నాయి...

ఎడారి అనగానే మనకి ముందు గుర్తొచ్చే జంతువు ఒంటె. వందలాది సంవత్సరాల నుంచి రాజస్థాన్‌, గుజరాత్‌ల మధ్య సరకు రవాణాకి ప్రధాన ఆధారం ఒంటెలే. ఆ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ వీటిని ఎక్కువగా వాడుతుండేవారు. కానీ, ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ రోడ్ల నిర్మాణం పెరిగి రవాణా అభివృద్ధయ్యేకొద్దీ ఒంటెల అవసరం తగ్గిపోయింది. వాటి ద్వారా వచ్చే ఉపాధి కోల్పోయిన ‘రైకా’ అనే సంప్రదాయ ఒంటెల కాపరి కులాలవాళ్లు పేదరికంలో కూరుకు పోయారు. వీటిని కబేళాలకి తెగనమ్మడం మొదలుపెట్టారు. గత దశాబ్దకాలంలోనే ఉత్తరాదిలో ఒంటెల సంఖ్య భారీగా పడి పోయింది. వాటి సంఖ్య తగ్గడం పర్యావరణానికి మంచిది కాదనే ఆందోళనా మొదలైంది. అలా ఆందోళనకి గురైనవాళ్లలో జర్మనీకి చెందిన మహిళా శాస్త్రవేత్త ఇల్సే కోలర్‌ రాలఫ్సన్‌ ఒకరు. 1990ల్లో ఇండియా వచ్చిన ఆమె ఇక్కడ ‘కామెల్‌ ఛరిష్మా’ అనే సంస్థని ఏర్పాటుచేశారు. దాని ద్వారా తొలిసారి, ఒంటెపాలని సేకరించి విక్రయించొచ్చని రైకా ప్రజలకి కొత్త ఉపాధి మార్గాన్ని చూపారు. ఈ పాలని ఆటిజం వంటి మానసిక సమస్యలున్న పిల్లలకీ, క్యాన్సర్‌ రోగులకీ, మధుమేహులకీ వాడుతుండేవారు. మనదేశంలో స్టార్టప్‌ల బూమ్‌ మొదలుకాగానే ఆద్విక్‌ ఫుడ్స్‌, డీఎన్‌ఎస్‌ గ్లోబల్‌ ఫుడ్స్‌, న్యూట్రా విటా వంటి సంస్థలు ఈ పాలని సేకరించి విక్రయించడం ప్రారంభించాయి. అమూల్‌ సంస్థ కూడా ఈ ఒంటెపాల రంగంలోకి దూసుకొచ్చింది!

పోషకాల్లో నంబర్‌ వన్‌..!

మామూలు ఆవు, గేదె పాలకంటే ఒంటెపాలలో విటమిన్‌ సి మూడురెట్లు ఉంటుంది. ఐరన్‌, జింక్‌, కాపర్‌, సోడియం, మెగ్నీషియం వంటి మ్యాక్రో-మైక్రో పోషకాలు ఇందులో చాలా ఎక్కువట. వీటితోపాటూ ఇందులోని ల్యాక్టోటెరిన్‌ అనే పదార్థం ఆర్థరైటిస్‌ వంటివాటిని రాకుండా అడ్డుకుంటుందని, పెప్టిన్‌ వంటి సహజ ఇన్సులిన్‌ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహులకీ మంచిదని చెబుతారు. ముఖ్యంగా- లాక్టులోజ్‌ రేట్‌ చాలా స్వల్పమని అంటారు. కాబట్టి, పాలు తాగడం ద్వారా ఏర్పడే అజీర్తి సమస్యలు అసలు ఉండవట. కాకపోతే ఒంటెపాల ఉత్పత్తి తక్కువ కావడం, వాటి ప్రాసెసింగ్‌కయ్యే ఖర్చు ఎక్కువ కావడంతో వీటి ధరలు ఆకాశంలోనే ఉంటున్నాయి. సాధారణంగా ఆవుపాల ధర లీటరు రూ.45 ఉంటే... ‘ఒంటెపాలు’ రూ.125 దాకా ఉంటుంది. ఇక పాల పొడి ధర అర్ధకిలో మూడువేల రూపాయల వరకూ పలుకుతోంది. ఇవేకాకుండా ఈ పాలతో ఐస్‌క్రీములూ, చాక్లెట్లూ, సబ్బులూ, బాడీ క్రీములూ తయారుచేస్తున్నారు. వీటి ధర 150 రూపాయల పైచిలుకే! ధరలు ఎలా ఉన్నా... ఈ ఉత్పత్తులతో పర్యావరణ వేత్తల లక్ష్యం నెరవేరింది. గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఒంటెలని అనామకంగా వదిలేయకుండా పాలకోసమైనా వాటిని కంటికిరెప్పలా చూసుకునే సహకార సంస్థలూ పెరుగుతున్నాయి!

ABOUT THE AUTHOR

...view details