చద్దన్నమా... కావాలని చేసుకుని తింటున్నారా... ఆశ్చర్యంగా అనిపించినా నిజమే. ప్రతి ఇంట్లోనూ అన్నం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. మర్నాడు దాన్ని ఏ పులిహోరో కలుపుకోవడం తెలిసిందే. కానీ ఇక్కడ మన చద్దన్నం అది కాదు. కుక్కర్లు లేని కాలంలో అన్నం వండి గంజి వార్చేవారు. ఓ కుండలో అన్నం వేసి నీళ్లు, కాస్త గంజి పోసి దబ్బ లేదా నిమ్మ ఆకు వేసి, ఒకటి నుంచి మూడురోజులు పులియనిచ్చేవారు. కొందరు అచ్చంగా నీళ్లు పోసీ పులియబెట్టేవారు. ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగో పెరుగో వేసి ఉల్లిపాయో మిరపకాయో నంజుకుని తినేవారు. దీన్నే తర్వాణి అనేవారు. అదే అసలైన చద్దన్నం... పుష్టికరమైన అల్పాహారం. దీన్నే ఫెర్మెంటెడ్ లేదా ప్రొబయోటిక్ రైస్ అంటున్నారు. అయితే కొందరు మిగిలిన అన్నంలో ఉదయాన్నే పులిసిన మజ్జిగ పోసుకుని తినేవారు. అలాగే అన్నంలో నీళ్లుపోసి కాసిని పాలు, పెరుగు వేసి తోడుపెట్టుకుని వేసవిలో ఉదయాన్నే తినడమూ వాడుకలో ఉంది. మొత్తమ్మీద అన్నాన్ని నీళ్లలోనో గంజిలోనో పులియనిచ్చి తినడం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది.
పొరుగు రాష్ట్రాల్లోనూ..
అసోంలో దీన్ని పొయిటాబాత్ అంటే, బిహారీలు జీల్‌బాత్; తమిళులు పళయ సాదమ్; బెంగాల్, ఒడిశాల్లో పఖాలా బాత్ అంటారు. ఏటా మార్చి నెలలో చద్దన్నం దినోత్సవాన్నీ జరుపుకుంటారు ఒడిశావాసులు. అందుకే ఆ రోజున ఒడిశా రెస్టరెంట్ల మెనూలో ఇది తప్పక ఉంటుందట. కొత్త సంవత్సరం రోజున దీన్ని తినడం బెంగాలీల సంప్రదాయం. నీళ్లలో రాత్రంతా పులిసిన అన్నానికి కాస్త పెరుగు, ఆవనూనె, జీలకర్ర, ఉల్లి, పుదీనా జోడిస్తారక్కడ. విందు భోజనంలో అయితే ఇలస చేపముక్కలు, ఆలూబజ్జీ, మామిడికాయ పప్పు... వంటి వాటితో చద్దన్నం వడ్డిస్తారట. ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందనేది ఈశాన్య భారతీయుల నమ్మకం. దీని గొప్పతనం గురించి ఆనోటా ఈనోటా విన్న పాశ్చాత్యులు పసుపు పాలు తాగినట్లే ఇప్పుడు గంజి అన్నాన్నీ రుచి చూస్తున్నారు. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్లీ మన దగ్గరా ప్రాచుర్యంలోకి రావడమే కాదు, స్టార్ హోటళ్ల మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్‌లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయబద్ద... వంటి వాటిని చద్దన్నానికి జోడించి మరీ వడ్డిస్తున్నారు.
చద్దన్నం గొప్పతనం!
ఒకప్పుడు రైతులూ కూలీలూ ఉదయాన్నే చద్దన్నమే తిని పొలం పనులకు వెళ్లిపోయేవారు. ఇది తినడంవల్ల అలిసిపోకుండా పనిచేసుకునేవారు. వేసవిలో వడదెబ్బ తగిలేది కాదు. చద్దన్నం చలవ అనేది ఇందుకే కాబోలు. కానీ క్రమేణా ఇది పేదవాళ్ల ఆహారంగా స్థిరపడిపోయింది. అయితే, జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని చద్దన్నం హరిస్తుందనీ మంచి బ్యాక్టీరియాని పెంచి, పిత్త లక్షణాన్ని తగ్గించడం ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందనీ ఆయుర్వేదం ఎప్పుడో పేర్కొంది. అందుకే అది మన దగ్గర పూర్వం నుంచీ వాడుకలో ఉంది. దాన్నే ఇప్పుడు ప్రొబయోటిక్‌గా అల్లోపతీ చెబుతోంది.