తెలంగాణ

telangana

ETV Bharat / priya

మటన్​, చికెన్​తో ఈ వెరైటీలు టేస్ట్ చేశారా? - mutton keema pakoda

చికెన్‌, మటన్‌ లాంటివాటితో ఎప్పుడూ కూరలూ, వేపుడులాంటివే కాదు... నోరూరించే స్టార్టర్స్‌ను కూడా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని వంటకాలు ఇలా ట్రై చేద్దాం..

receipies
రెసిపీ

By

Published : Nov 3, 2020, 2:30 PM IST

ఎప్పుడూ చికెన్​, మటన్​తో కూరలు, పులుసులతో బోర్ కొడుతోందా? అయితే వీటితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని పదార్థాలు మీకోసం..

పాప్‌కార్న్‌ చికెన్‌

కావలసినవి:చికెన్‌: పావుకేజీ, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, మిరియాలపొడి: పావుచెంచా, కారం: ముప్పావుచెంచా, గరంమసాలా: అరచెంచా.

పాప్​కార్న్ చికెన్

తయారీవిధానం:

  • చికెన్‌ని చిన్నముక్కల్లా కోసి తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, మిరియాలపొడి, కారం, గరంమసాలా వేసి ఓసారి కలిపి.. తరువాత మొక్కజొన్నపిండి వేసి మరోసారి కలపాలి. ఒక చికెన్‌ ముక్కను తీసుకుని ముందుగా గుడ్డుసొనలో ముంచి తరువాత బ్రెడ్‌పొడిలో అద్ది ప్లేటులోకి తీసుకోవాలి. ఇదేవిధంగా అన్నీ చేసుకున్నాక రెండుమూడు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

తందూరి ప్రాన్స్‌

కావలసినవి: రొయ్యలు: పది, నూనె: టేబుల్‌స్పూను, ఇనుప చువ్వలు: అయిదు, చాట్‌మసాలా: ఒకటిన్నర చెంచా, కొత్తిమీర: కట్ట, పెరుగు: మూడు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: అరచెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: అరచెంచా, పసుపు: పావుచెంచా, మిరియాలపొడి: అరచెంచా, కారం: ఒకటిన్నర చెంచా, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత.

తందూరీ ప్రాన్స్

తయారీవిధానం:

  • రొయ్యల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో రొయ్యలు, చాట్‌మసాలా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తరువాత రొయ్యలు కూడా వేసి వాటికి మసాలా పట్టేలా కలిపి మూత పెట్టాలి. పావుగంటయ్యాక రెండు రొయ్యలు చొప్పున ఇనుపచువ్వలకు గుచ్చాలి. స్టౌమీద పుల్కాలు కాల్చుకునేందుకు వాడే గ్రిల్‌పాన్‌ పెట్టి ఈ చువ్వల్ని ఉంచి... అన్నివైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. అన్నీ కాల్చుకున్నాక వీటిపైన చాట్‌మసాలా చల్లితే చాలు.

ఫిష్‌ ఫింగర్స్‌

కావలసినవి: ఏదయినా చేప: అరకేజీ, మైదా: అరకప్పు,ఉప్పు: తగినంత, గుడ్డు: ఒకటి, పాలు: పావుకప్పు,బ్రెడ్‌పొడి: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, మిరియాలపొడి: కొద్దిగా.మసాలాకోసం: కారం: టేబుల్‌స్పూను, కచ్చాపచ్చాగా దంచిన ఎండుమిర్చి గింజలు: టేబుల్‌స్పూను, వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, శొంఠిపొడి: చెంచా, దాల్చినచెక్కపొడి: పావుచెంచా.

ఫిష్ ఫింగర్స్

తయారీవిధానం:

  • మసాలాకోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి. చేపను శుభ్రం చేసుకుని సన్నగా పొడుగ్గా కోసి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, మిరియాలపొడి, ఉప్పు తీసుకుని కలుపుకోవాలి. మరో గిన్నెలో గుడ్డు సొన, పాలు తీసుకుని గిలకొట్టాలి. ఒక చేపముక్కను ముందుగా మైదా పిండిలో ముంచి తరువాత గుడ్డుసొనలో, ఆఖరున బ్రెడ్‌పొడిలో అద్ది కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చేప ముక్కల్నీ వేయించుకున్నాక వీటిపైన మసాలాను చల్లి ఓసారి కలిపితే చాలు.

మటన్‌ కీమా పకోడా

కావలసినవి: గుడ్లు: మూడు, కీమా: పావుకేజీ, పచ్చిమిర్చి తరుగు: చెంచా, మైదా: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, కారం: చెంచా, పసుపు: అరచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, బేకింగ్‌పౌడర్‌: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

మటన్ కీమా పకోడా

తయారీవిధానం:

  • మైదాలో గుడ్డుసొన,బేకింగ్‌పౌడర్‌ వేసి బాగా కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ అందులో వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. గంటయ్యాక స్టౌమీద బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె పోయాలి. అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని చెంచాతో తీసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

ఫిష్‌ కట్‌లెట్‌

కావలసినవి: చేప: అరకేజీ, ఉడికించిన బంగాళాదుంప ముద్ద: కప్పు,ఉల్లిపాయ ముక్కలు: కప్పు, వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, అల్లం ముద్ద:ఒకటిన్నర చెంచా, జీలకర్రపొడి: ఒకటిన్నర చెంచా, పసుపు: చెంచా, కొత్తిమీర తరుగు: అరకప్పు, గరంమసాలా: ఒకటిన్నర చెంచా, మిరియాలపొడి:అరచెంచా, కారం: చెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, గుడ్లు: రెండు, బ్రెడ్‌పొడి: కప్పు.

ఫిష్ కట్​లెట్

తయారీవిధానం:

చేపను శుభ్రంగా కడిగి ముక్కల్లా కోసి వాటిపైన పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకుని... పావుగంటయ్యాక ఆ ముక్కల్ని ఆవిరిమీద ఉడికించుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి చెంచా నూనె వేసి ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేయించుకుని ఓ గిన్నెలో వేయాలి. వీటిపైన గుడ్డుసొన, బ్రెడ్‌పొడి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని కట్‌లెట్‌లా చేసుకుని మొదట సొనలో,తరువాత బ్రెడ్‌పొడిలోఅద్దుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక రెండు మూడు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

ఇదీ చూడండి:మటన్‌తో పసందైన కశ్మీరీ బిర్యానీ చేద్దామిలా!

ABOUT THE AUTHOR

...view details