పండ్లతో అనేక మార్గాల్లో జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. వివిధ ఫలాలతో వెరైటీ జ్యూస్లు చేసుకొని రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
మామిడి పండుతో..
కావాల్సినవి: మగ్గిన మామిడి పండు- ఒకటి, కొబ్బరినీళ్లు- కప్పు, తేనె- చెంచా, పుదీనా ఆకులు- నాలుగైదు.
తయారీ: మామిడిపండు ముక్కలను మిక్సీలో వేసి, కాసిన్ని కొబ్బరినీళ్లు పోసి జ్యూస్ చేసుకోవాలి. దీన్ని గ్లాసులోకి తీసుకుని తేనె కలిపి పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే తియ్యతియ్యటి జ్యూస్ రెడీ.
ఆమ్ కా పన్నా..
కావాల్సినవి: మామిడికాయ- ఒకటి, బెల్లం- అర కప్పు, మిరియాలు- చెంచా, యాలకులు- నాలుగు, నల్లుప్పు- చెంచా, జీలకర్రపొడి- చెంచా, పుదీనా ఆకులు- గుప్పెడు, చల్లటి నీళ్లు- తగినన్ని.
తయారీ: మామిడి కాయను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి ఐదారు కూతలు వచ్చేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి లోపలి గుజ్జును మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. (మామిడికాయలో విటమిన్-సి మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంపులో తోడ్పడుతుంది.) ఇప్పుడు మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి పొయ్యి వెలిగించాలి. కాసిన్ని నీళ్లు పోసి బెల్లం వేసి మెల్లగా కలపాలి. అర కప్పు మామిడికాయ గుజ్జుకు కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ ద్రవాన్ని వేరొక పాత్రలోకి వడకట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అది వేడయ్యాక మామిడికాయ గుజ్జు వేసి కలపాలి. దీంట్లో బెల్లం నీళ్లు కలపాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, యాలకులు, నల్లుప్పు వేసి గడ్డలు లేకుండా బాగా కలపాలి. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.