పండగ నాడు అమ్మవారికి చక్కెర పొంగలి, దద్ధ్యోజనం, పరమాన్నం, పులిహోర, పులగం, పూర్ణం బూరెలు, నానబెట్టిన సెనగలు.. ఇలా రకరకాల నైవేద్యాలను సమర్పిస్తాం. ఆ తర్వాత అందరికీ ప్రసాదాలుగా పంచిపెడతాం. మరి ఈ ప్రసాదాల్లో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందామా.
పచ్చిసెనగలు.. మొలకెత్తిన సెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా బలవర్థకం. 100 గ్రాముల సెనగల్లో 20 గ్రా. ప్రొటీన్, 9 గ్రా. పీచు ఉంటాయి. బి - కాంప్లెక్స్ విటమిన్లు, సి, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు మెండుగా ఉంటాయి. పచ్చి సెనగలు తేలికగా జీర్ణమవుతాయి. ఇవి సంపూర్ణ ఆహారం. మొలకెత్తినప్పుడు వీటిలోని ఫైటేజ్, టానిక్ ఆమ్లం లాంటివి తగ్గిపోతాయి. అందులోని ఇనుము, క్యాల్షియం సులువుగా వంటబడతాయి. ఈ గింజలను నానబెట్టడం వల్ల గ్యాస్ కారకాలు పోతాయి. దాంతో వీటిని తిన్నా అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావు.
పులగం.. ఇదీ సంపూర్ణ ఆహారమే. సమాన పరిమాణాల్లో బియ్యం, పప్పులతో తయారు చేస్తారు. దీని నుంచి ఎక్కువ మొత్తంలో కెలొరీలు /శక్తి లభిస్తాయి. తక్కువ నూనె వేసి చేస్తే పెద్ద మొత్తంలో మాంసకృత్తులు, పిండి పదార్థాలు కూడా అందుతాయి.
దద్ధ్యోజనం..దీన్లో పెరుగు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి అది మేలైన బ్యాక్టీరియాను అందిస్తుంది. తేలికగా జీర్ణమవడానికి తోడ్పడుతుంది. జీర్ణకోశానికి హాయిని కలిగిస్తుంది.