తెలంగాణ

telangana

ETV Bharat / priya

వేడి వేడి 'ఎరాచీ పిడి' ఒక్కసారి రుచి చూడండి.. - etv bharat food

మటన్ అంటే మాంసాహారులకు ఇష్టమే.. కానీ, ఎప్పుడూ ఒకే స్టైల్​లో తింటే మాత్రం బోర్ కొట్టక మానదు. అందుకే, ఈ సారి మటన్ మరోలా.. నోరూరించేలా చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం ఎరాచీ పిడి రెసిపీ చూసేద్దాం రండి..

erachi pridi or mutton pidi recipe at home
వేడి వేడి 'ఎరాచీ పిడి' ఒక్కసారి రుచి చూడండి..

By

Published : Sep 28, 2020, 1:00 PM IST

ఎరాచీ అంటే మాంసం.. పిడి అంటే పిండి మిశ్రమంతో చేసిన కుడుములు వంటివి. మాంసం కూరలో ఈ పిడిలు కలిపి తింటే ఆ రుచికి ఆహా అనక మానరు..

కావాల్సినవి

పిడి కోసం

బియ్యప్పిండి - మూడుకప్పులు, కొబ్బరి తురుము - కప్పు, చిన్న ఉల్లిపాయలు - ఏడు, వాము - అరచెంచా, ఉప్పు - తగినంత, వేడినీళ్లు - మూడుకప్పులు.

మటన్‌ కర్రీ కోసం

మటన్‌ - కేజీ (ముక్కల్లా కోయాలి), ఉల్లిపాయ - ఒకటి పెద్దది, ధనియాల పొడి - రెండున్నర చెంచాలు, పసుపు - అరచెంచా, అల్లంవెల్లుల్లి తరుగు - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు.

మసాలా కోసం

ఉల్లిపాయలు - రెండు పెద్దవి, చిన్న ఉల్లిపాయలు - పదిహేను, అల్లం వెల్లుల్లి తరుగు- టేబుల్‌స్పూను చొప్పున, టొమాటో - ఒకటి పెద్దది, పచ్చిమిర్చి - మూడు, ధనియాల పొడి - రెండు చెంచాలు, కారం - రెండు చెంచాలు, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, చిక్కని కొబ్బరి పాలు - ముప్పావుకప్పు, కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు, వెల్లుల్లి - నాలుగు, వాము - పావుచెంచా, కరివేపాకు రెబ్బలు - నాలుగు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.

తయారీ

  • ఈ కూరను రెండు అంచల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పిడి తయారీ కోసం సిద్ధం చేసుకున్న చిన్నఉల్లిపాయలూ, వామూ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. బియ్యప్పిండిలో ఈ మిశ్రమం, కొబ్బరితురుమూ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి.
  • తరవాత వేడినీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక్కోదాంట్లో బొటనవేలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ వీటిలోకి చక్కగా చేరుతుంది. తరవాత ఈ ఉండల్ని ఆవిరిమీద ఎనిమిది నుంచి పదినిమిషాలు ఉడికించి తీసుకోవాలి.
  • ఇప్పుడు కూర తయారుచేసుకోవాలి. మటన్‌ ముక్కలపై పసుపూ, ఉల్లిపాయముక్కలూ, కారం, ధనియాలపొడీ, అల్లం, వెల్లుల్లి తరుగూ, ఉప్పూ, కరివేపాకు రెబ్బలు వేయాలి. తరవాత సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.
  • తరవాత కుక్కర్‌ మూత తీసేసి సన్ననిమంటపై ఉంచాలి. ఇంతలో మసాలా చేసుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయముక్కలూ, పొట్టు తీసేసిన చిన్న ఉల్లిపాయలూ వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి. రెండు నిమిషాల తరవాత ధనియాల పొడీ, కారం, సగం పసుపు వేయాలి. రెండు నిమిషాల తరవాత టొమాటో ముక్కలూ, పచ్చిమిర్చి ముక్కలూ, సరిపడా ఉప్పూ వేసుకోవాలి.
  • టొమాటోముక్కలు మెత్తగా అయ్యాక ఈ మిశ్రమాన్నంతా ఉడుకుతున్న మటన్‌లో వేయాలి. అదే బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేడిచేసి కొబ్బరితురుమూ, వెల్లుల్లి ముక్కలూ, వామూ, మిగిలిన పసుపూ, కరివేపాకు రెబ్బలూ వేయించుకోవాలి. కొబ్బరి కాస్త వేగాక అన్నింటినీ దింపేసి మెత్తని ముద్దలా చేసుకుని మటన్‌లో వేయాలి. ఈ కూర పావువంతు దగ్గర పడ్డాక అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యప్పిండి ఉండల్నీ, తరవాత కొబ్బరిపాలూ, మిగిలిన నూనె ఇందులో వేయాలి. చివరగా ఆ ఉండలకు మటన్‌ మసాలా పట్టాక దింపేయాలి.

ఇదీ చదవండి: 'కొబ్బరి పాల పాయసం' సింపుల్ రెసిపీ!

ABOUT THE AUTHOR

...view details