తెలంగాణ

telangana

ETV Bharat / priya

FOOD: ఈ కిట్లు తెచ్చుకుంటే... హోటల్‌ రుచులు ఇంట్లోనే! - వంటలు

ఇంట్లో ఎన్నిరకాల పదార్థాలు వండుకున్నా... కనీసం నెలకోసారయినా రెస్టారెంట్‌లో చేసిన బిర్యానీ, మసాలా కూరలు తింటే అదో ఆనందం.  కానీ ఇప్పుడు వెళ్దామంటే కరోనా భయం. పోనీ ఇంట్లోనే ఆ వంటకాల్ని ప్రయత్నిద్దామనుకుంటే... వాళ్లు చేసే పద్ధతి తెలియదు కదా అని సంకోచం. మరెలా అంటారా... ఇప్పుడు చాలా రెస్టారెంట్లు కస్టమర్లు కోరిన వంటకాలను ‘డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌ కిట్స్'​ రూపంలో అందిస్తున్నాయి. ఇంతకీ ఈ కిట్లలో ఏం ఉంటాయంటే...

FOOD: ఈ కిట్లు తెచ్చుకుంటే... హోటల్‌ రుచులు ఇంట్లోనే!
FOOD: ఈ కిట్లు తెచ్చుకుంటే... హోటల్‌ రుచులు ఇంట్లోనే!

By

Published : Jul 25, 2021, 9:50 AM IST

పొగలుగక్కే సూప్‌తోపాటూ కాస్త స్పైసీగా ఉండే పనీర్‌ మంచూరియా తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో... హోటల్‌కు వెళ్లి మంచి చికెన్‌ బిర్యానీ లాగించేస్తే అదో తృప్తి... వేడివేడి పనీర్‌ బటర్‌ మసాలా-రెండు నాన్‌లు తింటే వచ్చే మజానే వేరు... అని తెలిసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో హోటల్‌కో రెస్టారెంట్‌కో వెళ్లాలంటే భయం. అక్కడికి వెళ్లి కోరి సమస్యల్ని తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే ఆ వంటకాలను వండేసుకుంటే సరి అనుకుంటాం కానీ వాటికి బోలెడు పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. అన్నీ తెచ్చుకుని వండేందుకు సిద్ధమైనా అచ్చంగా ఆ రుచిలోనే వస్తాయని చెప్పలేం. డబ్బుతోపాటు సమయం కూడా వృథా కాబట్టి కష్టమైనా సరే కొన్నాళ్లపాటు నోరుకట్టేసుకోవడమే మంచిదనుకునే ఆహారప్రియుల సంఖ్య పెరిగింది. ఇక, రెస్టారెంట్ల పరిస్థితి చూస్తే... కరోనా, సోషల్‌ డిస్టెన్స్‌... తదితర కారణాల వల్ల రెస్టారెంట్లూ, హోటళ్లకూ వచ్చి భోంచేసేవారి సంఖ్య బాగా తగ్గింది. టేక్‌ అవేలూ, జొమాటో, స్విగ్గీల ద్వారా ఆర్డర్లు వస్తున్నా ఆదాయం ఒకప్పటిలా అయితే లేదు. అందుకే అవి వినియోగదారుల్ని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నాయి. అలా అటు కస్టమర్లకూ, ఇటు రెస్టారెంట్లకూ మేలు జరిగేలా ప్రారంభమైనవే ఈ ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ కిట్‌’లు.

ఏమేం ఉంటాయి...

కిట్‌ అనగానే... కేవలం వంటకు అవసరమైన ముఖ్యమైన పదార్థాలను మాత్రమే ఇవ్వరు. ఒక వంటకానికి సంబంధించిన వస్తువులన్నింటినీ కొలతల ప్రకారం డబ్బాల్లో పెట్టి, దానికి తయారీ విధానాన్ని జతచేసి మరీ కిట్‌గా అందిస్తున్నాయి రెస్టారెంట్లు. ఉదాహరణకు బిర్యానీని తీసుకుంటే... కూరగాయ ముక్కలు, మసాలా దినుసులు కలిపిన బాస్మతీ బియ్యం, బిర్యానీ మసాలా, వేయించిన ఉల్లిపాయల నుంచి ఉప్పూ పసుపూ దాకా - ప్రతిఒక్క పదార్థమూ ఇందులో ఉంటుంది. వాటితోపాటూ దాన్ని ఎలా వండుకోవాలనేది తెలియజేసే వివరాలు కూడా ఉంటాయి కాబట్టి... ఇంట్లోనే తక్కువ సమయంలో హోటల్‌ స్టైల్‌ బిర్యానీని చేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్లు అయితే క్యూఆర్‌కోడ్‌ను కూడా ఇస్తున్నాయి. ఫోనుతో దాన్ని స్కాన్‌ చేసుకుంటే హోటల్‌లోని చెఫ్‌ సూచనలతోనే ఆ వంటకాన్ని వండేసుకోవచ్చు. ఇలా వచ్చే కిట్‌లలో బిర్యానీ, బటర్‌చికెన్‌, కడాయిచికెన్‌, పనీర్‌బటర్‌మసాలా, రోటీలూ, పిజా, బర్గర్‌, పాస్తా, నూడుల్స్‌, థాయ్‌ రుచులూ, ఇటాలియన్‌ వంటకాలూ, కాజూ మసాలా, వడల పిండ్లూ-చట్నీలూ, కాక్‌టెయిల్స్‌, స్వీట్లూ... ఇలా అన్నిరకాలూ ఉంటాయి. ఈ కిట్‌లు అందించే రెస్టారెంట్లు హైదరాబాద్‌తోపాటూ దిల్లీ, ముంబయి, చెన్నై, గుర్గావ్‌ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. చెన్నైలోని నొవొటెల్‌, కాక్‌టెయిల్‌ మిక్స్‌, స్నాక్స్‌ని అందిస్తుంటే... హైదరాబాద్‌లోని నొవొటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ స్టార్టర్ల నుంచీ డెజర్ట్‌ల వరకూ అన్నింటినీ ఆర్డర్లమీద కిట్‌గా ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా ఓవర్‌ ద మూన్‌ బ్రూ కంపెనీ.. అనే రెస్టారెంట్‌ కూడా ఈ పంథాను అనుసరిస్తోంది. దిల్లీలోని రాడిసన్‌ పార్క్‌ఇన్‌ కూడా కోరిన పదార్థాన్ని కిట్‌రూపంలో ఇచ్చే ఏర్పాటు చేస్తే... ఆల్మండ్‌హౌస్‌ రెడీ టు ప్రిపేర్‌ మోతీచుర్‌ లడ్డూ, కాజూ కత్లీ వంటి మిఠాయిలను మార్కెట్లో విడుదల చేసింది. ఎవరికి వారు ఇంట్లో వండుకోవడానికే కాదు ఆహార ప్రియులకు కానుకగా ఇవ్వడానికీ బాగుంటాయివి.

ఇదీ చదవండి: నయా బిజినెస్​.. స్పేస్ టూరిజంలో కాసుల వర్షం

ABOUT THE AUTHOR

...view details