దోశలు ఎప్పుడూ నోరూరిస్తాయి కానీ.. ఒకేరకం చేసుకోవాలంటేనే బోర్. అందుకే ఈసారి వాటికి మరికొన్ని పదార్థాలు చేర్చి కాస్త కొత్తగా చేసుకుందామా..
మరమరాలతో..
కావాల్సిన పదార్థాలు:-బియ్యం (కప్పు),
మరమరాలు: నాలుగు కప్పులు,
మినప్పప్పు: పావుకప్పు,
మెంతులు: అరచెంచా,
నూనె: అరకప్పు.
తయారీవిధానం:బియ్యం, మినప్పప్పు, మరమరాలు, మెంతుల్ని మూడు గిన్నెల్లో వేసి విడిగా నానబెట్టుకోవాలి. బియ్యం, మినప్పప్పు నానాక మిక్సీలో వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఆ తరువాత అందులో మరమరాలు, మెంతులు వేసి కాసిని నీళ్లు పోసి దోశపిండిలా గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండిని కొద్దిగా పులవనివ్వాలి. తరువాత స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా పరిచి చుట్టూ నూనె వేసి ఎర్రగా కాలాక తీసుకోవాలి.
ఓట్స్ కొబ్బరితో..
కావాల్సిన పదార్థాలు:గోధుమపిండి: అరకప్పు,
బియ్యప్పిండి: అరకప్పు,
ఓట్స్‌పిండి: అరకప్పు,
కొబ్బరి తురుము: పావుకప్పు,
ఉప్పు: తగినంత,
నూనె: అరకప్పు,
పచ్చిమిర్చి: ఒకటి,
అల్లం తురుము: చెంచా,
కరివేపాకు రెబ్బలు: రెండు,
మిరియాలపొడి: అరచెంచా.
తయారీవిధానం:నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనం పెట్టి నూనె వేసి ఈ పిండిని దోశలా వేసి.. మూత పెట్టాలి. రెండువైపులా కాలాక తీసేయాలి. దీనికి కొబ్బరిచట్నీ మంచి కాంబినేషన్.
అడై దోశ
కావాల్సిసిన పదార్థాలు:బియ్యం: ముప్పావుకప్పు,
సెనగపప్పు: పావుకప్పు,
కందిపప్పు: పావుకప్పు,
పెసరపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు,
మినప్పప్పు: రెండు టేబుల్‌స్పూన్లు,
అల్లం: చిన్న ముక్క,
ఎండుమిర్చి: అయిదు,
జీలకర్ర: ముప్పావుచెంచా,
ఉప్పు: తగినంత,
ఉల్లిపాయ: ఒకటి,
కొత్తిమీర: కట్ట,
నూనె: అరకప్పు.
తయారీ విధానం:ముందురోజు పప్పులూ, బియ్యం, ఎండుమిర్చిని విడివిడిగా నానబెట్టుకోవాలి. మర్నాడు మొదట బియ్యాన్ని మెత్తగా రుబ్బుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను మిక్సీలో తీసుకుని అన్నింటినీ మెత్తగా రుబ్బుకుని బియ్యప్పిండి మిశ్రమంలో వేసి బాగా కలిపి రెండు గంటలు నాననివ్వాలి. స్టౌమీద పెనం పెట్టి ఈ పిండిని దోశలా వేసి నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.
బ్రెడ్‌తో..
కావాల్సిన పదార్థాలు:బ్రెడ్‌స్లైసులు: నాలుగు,
బొంబాయిరవ్వ: కప్పు,
బియ్యప్పిండి: కప్పు,
ఉప్పు: తగినంత,
జీలకర్ర: అరచెంచా,
ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు,
అల్లం తరుగు: రెండు చెంచాలు,
పచ్చిమిర్చి తరుగు: చెంచా,
నూనె: అరకప్పు.
తయారీవిధానం:బ్రెడ్‌స్లైసుల్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర మిక్సీలో వేసి.. కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలో వేసి.. మరికాసిని నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా పరిచి.. చెంచా నూనె వేయాలి. కొద్దిగా కాలాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేయాలి. దోశ పూర్తిగా కాలాక ప్లేటులోకి తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.
ఆలుతో..
కావాల్సిన పదార్థాలు:మైదా: కప్పు,
సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు,
బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు,
పచ్చిమిర్చి తరుగు: చెంచా,
బంగాళాదుంపలు: రెండు (తురుముకోవాలి),
పసుపు: అరచెంచా,
కారం: చెంచా,
ఉప్పు: తగినంత,
పాలకూర తరుగు: పావుకప్పు,
నూనె: అరకప్పు.
తయారీవిధానం:ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా వేసి.. రెండువైపులా నూనె వేస్తూ కాల్చుకుని తీసుకోవాలి.
స్వీట్‌కార్న్‌తో..
కావాల్సిన పదార్థాలు:బియ్యం: కప్పు,
స్వీట్‌కార్న్: కప్పు,
జీలకర్ర: అరచెంచా,
పచ్చిమిర్చి: రెండు,
ఉప్పు: తగినంత,
నూనె: అరకప్పు.
తయారీవిధానం:బియ్యాన్ని మూడుగంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి నానాల్సిన అవసరం లేదు. స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని దోశలా వేసి నూనె వేసి, ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఈ దోశల్ని వేడివేడిగా తింటే భలే ఉంటాయి.
ఇదీ చూడండి..నోరూరించే రొయ్యదోశలు.. తింటే వదలరు!