Chicken Recipes: చికెన్‌తో ఎన్నిరకాల కూరలు చేసుకుంటున్నా.. ఇంకా వెరైటీగా ఎలా వండొచ్చని ఆలోచిస్తుంటారు చికెన్ ప్రియులు. అలాంటివారికోసమే ఈ కూరలు. అన్నం, రోటీ, పులావ్... ఇలా దేంతోనైనా తినగలిగే ఈ వంటకాలనూ మీరూ చూసేయండోసారి.
దహీ మసాలా కర్రీ:
కావలసినవి:చికెన్: అరకేజీ, పెరుగు: కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద: చెంచా, జీలకర్రపొడి: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నెయ్యి: పావుకప్పు, టొమాటోలు: రెండు, ఉల్లిపాయలు: రెండు, జీడిపప్పు ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: మూడు, గోరువెచ్చని నీళ్లు: కప్పు, కసూరీమేథీ: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం:ఓ గిన్నెలో పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్రపొడి, మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, చికెన్ ముక్కలు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, టొమాటో తరుగు వేయించాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి ఓసారి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక జీడిపప్పు ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, మరికొంచెం ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికాక కొత్తిమీర తరుగు, కసూరీమేథీ వేసి దింపేయాలి.
మలై చికెన్:
కావలసినవి: చికెన్ ముక్కలు: కేజీ, అల్లం-వెల్లుల్లి పేస్టు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: రెండు, చిక్కటి పెరుగు: అరకప్పు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, కారం: చెంచా, పచ్చిమిర్చి: నాలుగు, కసూరీమేథీ: రెండు టేబుల్‌స్పూన్లు (పావుకప్పు నీటిలో నానబెట్టుకోవాలి), తాజా క్రీమ్: పావుకప్పు, చిక్కని పాలు: అరకప్పు, బాదం పేస్టు: రెండు చెంచాలు, దాల్చినచెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు, మిరియాలు: చెంచా, నూనె: పావుకప్పు.
తయారీ విధానం:మూడు గంటల ముందు చికెన్ ముక్కలపైన కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, కారం, అల్లం-వెల్లుల్లి పేస్టు, గరంమసాలా వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి... నూనె వేయాలి. అది వేడెక్కాక దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు వేయించి ఉల్లిపాయముక్కలు వేసి కలపాలి. అవి వేగాక చికెన్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. చికెన్ ఉడికాక పావుకప్పు నీళ్లు, మిగిలిన పదార్థాలు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.