కొన్నిసార్లు పిల్లలు దోసెలు కావాలని మారాం చేస్తారు. దోసె పిండి లేదని కుదరదని వారికి చెబితే నానా బీభత్సం చేసేస్తారు. అలాంటి సమయాల్లో ఈ ఇన్‌స్టంట్ దోసెలను ప్రయత్నించవచ్చు. మరింకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం రండి..
నీర్ దోసె
కావాలసినవి..
బియ్యప్పిండి: కప్పు, కొబ్బరిపాలు: అరకప్పు, మంచినీళ్లు: తగినన్ని, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి తగినంత
తయారుచేసే విధానం
- బియ్యప్పిండిలో ఉప్పు వేసి కలపాలి. తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు పోసి పలుచగా చేయాలి.
- స్టవ్‌మీద బాణలి పెట్టి పెనం కాగాక గరిటెతో పైనుంచి దోసె పిండిని చిల్లులు పడేలా వేసి కొద్దిగా నూనె చిలకరించి మూతపెట్టాలి. దోసె కాలిన తరవాత మెల్లగా అంచుల నుంచి లేపి, మధ్యకు మడిచి తీయాలి.
ఓట్స్ దోసె
కావాలసినవి
ఓట్స్: అరకప్పు, బియ్యప్పిండి: అరకప్పు, జీలకర్ర: టీస్పూను, బొంబాయిరవ్వ: పావుకప్పు, పెరుగు: అరకప్పు, అల్లంతురుము: టీస్పూను, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, మిరియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిముక్కలు: అరకప్పు, ఉప్పు: తగినంత, నీళ్లు: మూడు కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
- ఓట్స్ మిక్సీలో వేసి పొడి చేయాలి. తరవాత దానికి బియ్యప్పిండి, రవ్వ, పెరుగు జోడించి కలపాలి. తరవాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాలపొడి, ఉల్లిముక్కలు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి కలిపి ఓ 20 నిమిషాలు నాననివ్వాలి.
- పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని గరిటెతో రవ్వదోసె మాదిరిగానే వేయాలి. బాగా కాలిన తరవాత రెండోవైపున కూడా కాల్చి తీసి ఇష్టమైన చట్నీ లేదా కూరతో అందిస్తే సరి.
అన్నం దోసె
కావాలసినవి
అన్నం: కప్పు, గోధుమపిండి: అరకప్పు, బియ్యప్పిండి: కప్పు, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు, పెరుగు: పావుకప్పు, ఉప్పు: రుచికి సరిపడా, కుకింగ్‌సోడా: చిటికెడు, నూనె: తగినంత
తయారుచేసే విధానం
- మిక్సీలో అన్నం, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. తరవాత సుమారు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరవాత అవసరమైతే కొంచెంకొంచెంగా మరో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసి కలపాలి.
- ఉప్పు, వంటసోడా వేసి అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి కలిపి, కాగిన పెనంమీద దోసె వేసి రెండువైపులా కాల్చి తీయాలి.
రవ్వ దోసె
కావాలసినవి
బొంబాయి రవ్వ: కప్పు, బియ్యప్పిండి: కప్పు, మైదా: అరకప్పు, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, ఉల్లితురుము: 2 టేబుల్‌స్పూన్లు, అల్లంతురుము: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, నీళ్లు: తగినన్ని
తయారుచేసే విధానం
- ఓ గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి, మైదా, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. తరవాత సుమారు ఓ కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. అన్నీ వేసి కలిపిన తరవాత అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి మిశ్రమాన్ని పలుచగా చేయాలి. దీన్ని ఓ అరగంట పక్కన ఉంచాలి. తరవాత పెనం కాలాక దోసెలా వేసి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.
గోధుమ దోసె
కావాలసినవి
గోధుమపిండి: కప్పు, బియ్యప్పిండి: ముప్పావుకప్పు, పుల్లని మజ్జిగ: పావుకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, కరివేపాకు తురుము: కొద్దిగా, నూనె: తగినంత, నీళ్లు: 3 కప్పులు, ఉప్పు: సరిపడా
తయారుచేసే విధానం
- గోధుమపిండిలో బియ్యప్పిండి, పుల్లని మజ్జిగ, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
- తరవాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. బాణలిలో టీస్పూను నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక పిండి మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ పాన్‌మీద దోసెల్లా వేసి, నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.
ఇదీ చూడండి:చిరుతిండి వల్ల బరువు తగ్గుతుందా?
ఇదీ చూడండి:నోరూరించే ఎగ్-65.. చిటికెలో చేసుకుందామిలా...