దహీపూరీలో మసాలా నషాలానికి ఎక్కకుండా చల్లటి దహీ ఓ కాపుకాస్తుంది. బూందీ కూరలో ఆఖర్న పెరుగేసి చూడండి.. బందీలైపోవాల్సిందే! ఇలా బోలెడన్ని వంటల్లో పెరుగు తోడుంటోంది. ఆత్మారాముడిని సంతృప్తి పరుస్తోంది. కావాలంటే ఈ వంటకాలు వండి వడ్డించుకొని చూడండి..
- పెరుగు తినడం వల్ల చర్మం తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది. యాక్నె సమస్యలుంటే తొలగిపోతాయి. రోజూ తినేవారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
- సాధారణంగా స్త్రీలల్లో ఎదురయ్యే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లని సమర్థంగా అడ్డుకుంటుంది.
- ప్రొబయాటిక్ గుణాలున్న పెరుగుని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఉదర సమస్యలు రాకుండా ఉంటాయి.
బూందీకూర
కావాల్సినవి: పెరుగు- ఒకటిన్నర కప్పు, సెనగపిండి- నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద- చెంచా, అల్లంవెల్లుల్లి పేస్ట్- చెంచా, పసుపు- పావుచెంచా, ఉప్పు, కారం- తగినంత, నెయ్యి- రెండు చెంచాలు, లవంగాలు- నాలుగు, మిరియాలు- ఐదు, జీలకర్ర- చెంచా, మెంతులు- పావు చెంచా(రాత్రంతా నానబెట్టాలి), ఇంగువ- చిటికెడు, బూందీ- కప్పు
తయారీ: ఒక పాత్రలో పెరుగు, సెనగపిండి, కారం, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి లవంగాలు, జీలకర్ర, మిరియాల పొడి, నానబెట్టిన మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పెరుగు మిశ్రమం వేయాలి. దగ్గరకు వచ్చేంతవరకూ ఉండి బూందీ, కొత్తిమీర వేసి దించుకోవాలి.
దహీ చికెన్
కావాల్సినవి: చికెన్- పావుకిలో, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లిపేస్ట్- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, బటర్- చెంచా, పెరుగు- 125గ్రా, పచ్చిమిర్చి- మూడు, యాలకులపొడి- చిటికెడు, కొత్తిమీరకట్ట- అరకట్ట గరంమసాలా- అరచెంచా
తయారీ: చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో చికెన్ తీసుకుని పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఇలాచీపొడి, ఉప్పు, పెరుగు వేసి రెండుగంటలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో బటర్ వేసి అది కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పెరుగు వాడుతున్నాం కాబట్టి ప్రత్యేకించి నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసి పూర్తిగా ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే క్రీం కూడా వేసుకోవచ్చు. చివరిగా గరంమసాలా, కొత్తిమీర వేసుకుని దించుకోవడమే.
స్వీట్‌కార్న్‌తో..
కావాల్సినవి: స్వీట్‌కార్న్- అరకప్పు, పెరుగు- అరకప్పు, నూనె- చెంచా, సెనగపిండి- చెంచా, జీలకర్ర- అరచెంచా, పసుపు- తగినంత, పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, కసూరీమేథి- చెంచా, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లిపలుకులు- అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత.
తయారీ: ముందుగా మిక్సీలో అల్లం, వెల్లుల్లిపలుకులు, ఉల్లిపాయముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకుని దానికి సెనగపిండి వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేసుకుని అందులో జీలకర్ర వేసి వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసి నూనెపైకి తేలేంతవరకూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కసూరిమేథి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మగ్గనిచ్చి ఆపై పెరుగు మిశ్రమం, స్వీట్‌కార్న్ కూడా వేసి ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేంతవరకూ ఉండి.. కొత్తిమీర వేసి దించుకోవడమే.