Coconut Milk Pulao Making Process:ఈ కాలంలో వెరైటీ వంటకాలు చేసుకోని తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చేసుకోవడం రాదు. పోనీ.. బయట ఏదైనా హోటల్ నుంచి ఆర్డర్ పెడదామంటే అదో టెన్షన్.. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో అని. వీటన్నింటికి చెక్ పెడుతూ కేవలం ఇంట్లోనే అదిరిపోయే టేస్ట్‌తో చేసుకోవచ్చు. మాకు అంతబాగా చేయడం రాదంటారా..? అవసరం లేదండి.. మొదటిసారి చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీలో ఉన్న రెసిపీలపై ఓ లుక్కేసి.. మీరూ ఇంట్లో ట్రై చేయండి..
కొబ్బరిపాల పులావ్:
Coconut Milk Pulao:కొబ్బరిపాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి1, బి2, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సెలెనియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి లభిస్తాయి. కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తిని అందించడంలో ఇవి ముందుంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరి కొబ్బరిపాల పులావ్ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీస్ - ఈ వెరైటీస్‌తో పార్టీ అద్దిరిపోద్ది!
కావలసినవి:
- బాస్మతి బియ్యం: కప్పు (నానబెట్టుకోవాలి)
- ఆలూ, బీన్స్, క్యారెట్, బఠాణీ: అన్నీ కలిపి ఒకటిన్నర కప్పు
- పుదీనా తరుగు: అరకప్పు
- కొబ్బరి తురుము: అరకప్పు
- కారం: చెంచా
- అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా
- గరంమసాలా: చెంచా
- మిరియాలపొడి: చెంచా
- కొబ్బరిపాలు: పావుకప్పు
- నెయ్యి: టేబుల్‌స్పూను
- బిర్యానీఆకులు: రెండు
- ఉప్పు: తగినంత
Pulao recipe: ఘుమఘుమలాడే 'పుట్టగొడుగుల పులావ్'
తయారీవిధానం:
- కూరగాయ ముక్కలపైన కొబ్బరి తురుము, పుదీనా తరుగు, తగినంత ఉప్పు, కొబ్బరిపాలు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, మిరియాలపొడి వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి.
- స్టౌమీద కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి.
- అది వేడెక్కాక బిర్యానీ ఆకులు వేయించి... ముందుగా కలిపి పెట్టుకున్న కూరగాయముక్కలు వేసి అన్నింటినీ కొద్దిసేపు వేయించాలి.
- ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి.
- రెండు కూతలు వచ్చాక దింపేయాలి. అంతే వేడి వేడి కొబ్బరిపాల పులావ్ రెడీ!