బలమైన ప్రాంతీయ ఆకాంక్షలు, అస్తిత్వ రాజకీయాలు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తీవ్ర వ్యతిరేకతతో అసోం జాతీయ పరిషత్ (ఏజేపీ), రైజోర్ దళ్ (ఆర్‌డీ) అనే రెండు రాజకీయ పార్టీలు కొత్త ఫ్రంట్‌గా జట్టు కట్టాయి. ఏప్రిల్ మధ్యలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోరు బరిలో నిలిచేందుకు కొత్త కూటమి సిద్ధమైంది. ఇది కీలకశక్తిగా అవతరించి, ఎన్నికల అంచనాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కూటమికి వివిధ వర్గాల్లో విస్తృతమైన మద్దతు ఉన్నా, దాన్ని ఎన్నికల్లో విజయంగా మార్చుకోగలుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు మూలాలు- పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ)ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు, విస్తృతంగా వ్యాపించిన నిరసనల్లోనే ఉన్నాయి. సీఏబీకి వ్యతిరేకంగా 2019 జనవరిలో ఆందోళనలు మొదలవ్వగా, 2019 అక్టోబర్ నాటికి తీవ్రస్థాయికి పెరిగాయి. బిల్లు కాస్తా సీఏఏ చట్టంగా మారడంతో హింస పెచ్చరిల్లింది.
స్టూడెంట్స్ యూనియన్ అండదండలతో..
అసోం జాతీయ పరిషత్(ఏజేపీ)కు నేతృత్వం వహిస్తున్న లూరిన్‌జ్యోతి గొగోయ్‌కి శక్తిమంతమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) అండదండలున్నాయి. 1979 నుంచి 1985 వరకు విదేశీయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర ఏఏఎస్‌యూకు ఉంది. ఏఏఎస్‌యూకు ఉన్న విస్తృత వ్యవస్థాగత బలాన్ని తోడుగా చేసుకొని ఏజేపీ బ్రహ్మపుత్ర లోయలో వ్యాపించింది. దాదాపు అచేతనంగా మారిన అసోం గణ పరిషత్ (ఏజీపీ) సభ్యులు, మద్దతుదారులను ఏజేపీ ఆకర్షించింది. దీనికితోడు, అస్సామీ ప్రాంతీయవాదుల మద్దతు తనకే దక్కుతుందని ఏజేపీ ఆశిస్తోంది. గొగోయ్ ఏఏఎస్‌యూ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఏజేపీ మద్దతుదారులు ఎక్కువగా యువత, సాంకేతికత ప్రియులు కావడంతో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి విభిన్న దృక్కోణాల్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఎగువ, దిగువ అసోం రాజకీయ భేదాలు, కుల సమీకరణాలు వంటివి వీరి రాజకీయ అజెండాలో ముఖ్యాంశం కాకపోయినా, కేంద్ర అధికారాల్ని పరిమితం చేయడం ద్వారా అసోమ్‌కు భారీ ప్రయోజనాల్ని సాధించవచ్చనే సమాఖ్యవాదనే కీలక సిద్ధాంతంగా తెలుస్తోంది.
కీలక నేతగా అఖిల్ గొగోయ్..