ఆన్‌లైన్ బెట్టింగ్ జనాల జేబులు గుల్లచేస్తోంది. మధ్యవయస్కులే కాదు యువత సైతం ఈ ఆటకు బానిసై అందిన ప్రతిచోటా అప్పులు చేసి వాటిని తీర్చే దారిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. కళాశాలలకు కట్టాల్సిన రుసుములను సైతం ఆన్‌లైన్ జూదాల్లో పోగొడుతున్న విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకున్నవారు, ప్రభుత్వోద్యోగులు సైతం బాధితుల జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. సులువుగా సంపాదించాలన్న ఆశ, బాగా సంపాదించి జల్సాగా బతకాలన్న కోరికతో చాలామంది ఆన్‌లైన్ బెట్టింగుల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఈ యాప్స్ లేదా వెబ్‌సైట్లు కొత్తగా ఆడేవారిని మొదట్లో కొంత సొమ్ము గెలుచుకునేలా చేసి ఆకర్షిస్తుంటాయి. ఆ తరవాత వారు డబ్బులు పోగొట్టుకోవడం చాలా సాధారణంగా జరిగిపోతుంటుందని నిపుణులు చెబుతున్నారు. రమ్మీ, పోకర్ వంటి ఆటలు ఆన్‌లైన్‌లో ఆడేటప్పుడు అవతల ఆడేది కంప్యూటర్ కావచ్చు, ఎంత బాగా ఆడామనుకున్నా చివరికి ఓడిపోయేలా ముందే ప్రోగ్రామ్ సిద్ధం చేసి ఉండే అవకాశాలూ కొట్టిపారేయలేం. ఒకదశ దాటాక చేతిలో డబ్బులు లేకపోతే బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పందేలు కాస్తున్నారు. ఆన్‌లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకున్నవారికి అప్పులివ్వడానికి అంతర్జాలం ద్వారానే రుణాలు ఇచ్చే యాప్స్ కూడా అందుబాటులోకి రావడం ఈ వ్యవహారంలో మరో కోణం. డబ్బులు పోగొట్టుకుని, అప్పులు తీర్చడం తలకు మించిన భారమవడంతో ఈ ఏడాది ఇప్పటికే పదుల సంఖ్యలో యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు.
సరైన చట్టాలు కరవు..
ఆన్‌లైన్ బెట్టింగ్ ఇప్పుడు దేశంలో వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్‌తోపాటు బెట్టింగ్ సైతం భారీగా పెరిగింది. నియంత్రణకు సరైన చట్టాలు లేకపోవడంతో ఈ జూదం జడలు విప్పుతోంది. ఆన్‌లైన్ క్రీడలకు, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మధ్య ఉన్న తేడాను వీటిని నిర్వహించే కంపెనీలు చాలా తెలివిగా సొమ్ము చేసుకుంటున్నాయి. క్రీడా నైపుణ్యం అవసరం లేకుండా కాసే ఏ పందెమైనా జూదమే అని 'పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్' 1867లో స్పష్టంగా పేర్కొన్నారు. 'ఒక ఆట లేదా పోటీలో గెలవడానికి ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. అలాంటి నైపుణ్యంతో పందెం గెలుచుకుంటే అది జూదం కాదు, అలా కాకపోతే మాత్రం అది జూదమే' అని సుప్రీంకోర్టు సైతం చెప్పింది. కానీ దీన్ని కంపెనీలు తెలివిగా దాటవేస్తూ ఆన్‌లైన్ గేమ్‌ల ముసుగులో జనం మీదికి వల విసిరి వారిని పందేల్లోకి దింపుతున్నాయి.
దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిరోధించడానికి సమగ్ర చట్టం లేదు. ఎప్పుడో 150 ఏళ్ల కింద తీసుకొచ్చిన 'పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్-1867'నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఆ తరవాత బెట్టింగ్‌లో ఎన్నోరకాల పెడధోరణులు మొదలయ్యాయి. గడచిన దశాబ్దకాలంగా వేగం పుంజుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అడ్డుకోవడానికి ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవు. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జూదాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని చట్టంలో వెసులుబాటు ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ లాంటి జూదం, బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తూ రెండు నెలల క్రితమే ఏపీ గేమింగ్ యాక్ట్ -1974కు సవరణలు చేసింది. శిక్షలు, జరిమానాలు పెంచింది. దీని ప్రకారం ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తేలితే ఆరునెలల జైలు, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా, రెండోసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను తమిళనాడు ఇటీవలే నిషేధించింది. కర్ణాటక కూడా ఇదే దిశగా యోచిస్తోంది.