చదువుకునే రోజుల్లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిందట యామీ. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదం కారణంగా తనకు తగిలిన దెబ్బలు, వాటినుంచి ఉపశమనం పొందడానికి తానెలాంటి జాగ్రత్తలు తీసుకుందో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఐఏఎస్ కావాలనుకుని!
‘ఫెయిర్ అండ్ లవ్లీ’ గర్ల్‌గా అందరికీ దగ్గరైన యామీ తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి సినిమాల్లో నటించింది. ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘యాక్షన్ జాక్సన్’, ‘బద్లాపూర్’, ‘సనమ్ రే’, ‘కాబిల్’, ‘బాలా’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి హిట్ సినిమాలతో అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. అయితే ముందు ఐఏఎస్ కావాలనుకున్న యామీ కొన్ని వ్యక్తిగత కారణాలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాల్సి వచ్చిందట. హిమాచల్ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో పుట్టినప్పటికీ ఆమె చదువంతా చండీగఢ్‌లోనే కొనసాగింది. ఈ క్రమంలో అక్కడి యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందంటోందీ అందాల తార.
ఎలాంటి వర్కవుట్లు చేయద్దన్నారు!
‘నేను చండీగఢ్ లో చదువుకుంటున్న రోజుల్లో ద్విచక్రవాహనం పైనే రోజూ కాలేజీకి వెళ్లేదాన్ని. అలా ఒకరోజు కాలేజీకి వెళ్తున్న సమయంలో నా ముందు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి రైట్ సిగ్నల్ ఇచ్చి సడన్‌గా లెఫ్ట్‌కు టర్న్ అయ్యాడు. దీంతో కారు వెనక ఉన్న నేను కింద పడిపోయాను. అయినా అతను నన్ను ఏ మాత్రం పట్టించుకోకుండా వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అదృష్టవశాత్తూ హెల్మెట్ ఉండడంతో తలకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. కానీ హఠాత్తుగా కింద పడిపోవడంతో కొద్దిసేపు షాక్‌లోనే ఉండిపోయాను. అసలు పక్కకు కదల్లేకపోయాను. ఈ పరిస్థితుల్లో ఆ మార్గంలో వెళుతున్న ఓ వ్యక్తి నన్ను ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ప్రమాదం శీతాకాలంలో జరిగినట్లు నాకు బాగా గుర్తు. ఈ సీజన్‌లో ఉత్తరాదిన విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో చలి నుంచి రక్షణ పొందే క్రమంలో నేను మల్టీ లేయర్స్ ఉండే దళసరి దుస్తులను ధరించడం అలవాటు చేసుకున్నాను. లక్కీగా ప్రమాద సమయంలో కూడా ఇలాంటి దుస్తులనే ధరించాను. దీంతో నా శరీరం బయట ఎలాంటి దెబ్బలు తగల్లేదు. అయితే అంతర్గతంగా కొన్ని గాయాలయ్యాయని, ప్రత్యేకించి మెడ భాగంలో ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు చెప్పారు. అదేవిధంగా జీవితాంతం ఎలాంటి వర్కవుట్లు, వ్యాయామాలు చేయకూడదని సూచించారు. అప్పటికి నేను ఐఏఎస్ కావాలన్న ప్రయత్నంలో ఉన్నాను’..