తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంక్షోభం వేళ చైనా దూకుడు- మరి కళ్లెం పడేదెప్పుడు? - Former Indian envoy to Canada and South Korea

భారత్​-చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు కొత్తకావు. కానీ... అవన్నీ చర్చలతోనే పరిష్కారమయ్యేవి. ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదు. 4 వారాలైనా ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకిలా? చైనా దూకుడు వెనుక వ్యూహమేంటి? కెనడా, దక్షిణ కొరియాలో గతంలో భారత రాయబారిగా పనిచేసిన విష్ణు ప్రకాష్... ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

Worrisome timing of Chinese incursions
భారత్​-చైనా

By

Published : Jun 1, 2020, 2:59 PM IST

జవాన్ల మధ్య ఘర్షణలు... సైనిక, దౌత్య వర్గాల విఫల చర్చలు... భారీగా మోహరింపులు... నాలుగు వారాలుగా భారత్​-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి ఇది.

వేర్వేరు మీడియా కథనాల ప్రకారం... సరిహద్దుల వద్ద 4,000 మంది సైనికులను, భారీ యుద్ధ పరికరాలను మోహరించింది చైనా. పక్కా సమన్వయం, ప్రణాళికతో ఉన్నత స్థాయిలో బీజింగ్ అనుమతి లేనిదే ఇంత భారీ ఏర్పాట్లు, చొరబాట్లు జరగవు. మరి వుహాన్, మహాబలిపురం అనధికారిక శిఖరాగ్ర సమావేశాలలో చేసిన తీర్మానాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణాలేంటి? అనేది విశ్లేషించుకోవాలి.

చైనాపై ప్రస్తుతం ఉన్నంత ప్రపంచ ఒత్తిడి ఇంతకుముందు ఎన్నడూ లేదు. ఇందుకు కారణం కరోనా. 1918-20 మధ్య స్పానిష్ ఫ్లూ తర్వాత మానవాళికి తెలిసిన అంతటి ప్రాణాంతకమైన మహమ్మారికి పుట్టినిల్లుగానే చైనా ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది. అంతర్జాతీయ వేదికపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజింగ్ బెదిరింపులు, తోటి దేశాల పట్ల దురుసు ప్రవర్తన.. ప్రపంచానికి చైనాపై ఉన్న అనుమానాలను మరింత పెంచాయి.

ఇలాంటి ప్రతికూల వాతావరణం మధ్య విదేశీ సంస్థలు చైనా నుంచి బయట పడడానికి చూస్తున్నాయి.

నియంత్రించింది...

కరోనా వైరస్ మహమ్మారి వల్ల కలిగే వినాశనం గురించి చర్చించకుండా తనకున్న వీటో అధికారంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అడ్డుకుంది బీజింగ్. అయితే 120 దేశాల మద్దతుతో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి (మే 18-19) సమర్పించిన ఈయూ ముసాయిదా తీర్మానం విషయంలో మాత్రం చైనా తలొంచాల్సి వచ్చింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మరో అవకాశం లేక తన సహకారాన్ని అస్పష్టంగానే వ్యక్తం చేస్తూ అసహనంతో ప్రసంగించారు.

చైనాకు ముందు నుంచే తెలిసిన ఒకే ఒక విద్య డబ్బును ముఖంమీద కొట్టడం. దానికి అనుగుణంగానే ఆఫ్రికాలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటుకు 2 బిలియన్ డాలర్ల సహాయానికి హామీ ఇచ్చారు జిన్‌పింగ్.

చైనా X అమెరికా...

ప్రపంచంపై ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా చైనా ఎప్పుడూ అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కరోనా కారణంగా ఇరు దేశాల మధ్య పోరు మరింత తీవ్రమైంది. కరోనా సంక్షోభానికి కారణమైందన్న ఆరోపణలతో చైనా నుంచి రెండు మూడు ట్రిలియన్ డాలర్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు సిద్ధమవుతోంది అమెరికా కాంగ్రెస్.

"అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాప్తిస్తోంది. తన ముందు ఉన్న అవకాశాలన్నింటినీ చైనాపై ఎలా దాడి చేయాలి? చైనాను ఎలా అపహాస్యం చేయాలి? అన్న వాటికే ఉపయోగిస్తోంది" అని మండిపడ్డారు చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్​ యీ.

చైనా రూటే వేరు...

ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు ఏ దేశమైనా ఆచితూచి అడుగులు వేస్తూ అంతర్జాతీయ సమాజం పట్ల సానుకూల వైఖరితో వ్యవహరిస్తుంది. కానీ చైనా మాత్రం ఇందుకు భిన్నం. దక్షిణ చైనా సముద్రం దగ్గర ఉద్రిక్తతను పెంచుతోంది. తైవాన్​ను రెచ్చగొడుతోంది. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి, అసమ్మతిని అణగదొక్కడానికి కొత్త భద్రతా చట్టాలను తీసుకురావడం వంటి చర్యలకు ఉపక్రమిస్తోంది.

అందుకే... "ప్రస్తుత పరిస్థితులు చుస్తే హాంకాంగ్ ఇక స్వయంప్రతిపత్తి హోదాను కోల్పోయినట్టే. ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చింది" అని అభిప్రాయపడ్డారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో.

భారత్​ X చైనా...

ఇక ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతల విషయానికి వస్తే... చైనాతో సరిహద్దు రేఖలు స్పష్టంగా లేవు. సంవత్సరానికి 400-500 చొరబాట్లు జరుగుతాయి. కానీ ఆ వివాదాలు త్వరగా పరిష్కారమయ్యాయి. ఇరు దేశాల మధ్య 2017లో డోక్లామ్ పీఠభూమి వద్ద నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడడానికి మాత్రం 72 రోజులు పట్టింది.

అయితే అప్పటికీ ఇప్పటికీ సమయం, స్థాయి, సైనిక నిర్మాణం, ఆలోచన వంటి విషయాల్లో చాలా తేడా ఉంది. చైనా మోహరింపులు ఈసారి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. గాల్వన్ లోయ చుట్టూ 3 చోట్ల, లద్దాఖ్​లోని పాంగోంగ్ త్సో సరస్సు సమీపంలో మరో చోట ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

భారత్​పై ఈ సమయంలో కయ్యానికి కాలు దువ్వడానికి చైనా వద్ద చాలానే కారణాలున్నాయి.

  1. కరోనా సంక్షోభ సమయంలో తనపై పడిన మచ్చను చెరిపేసి, బలమైన నాయకుడిగా తన ప్రాభవాన్ని పెంచుకోవాలని తపిస్తున్నారు అధ్యక్షుడు జిన్‌పింగ్.
  2. బీజింగ్​ ప్రపంచంలో అమేయ శక్తిగా నిలబడేందుకు భారత్​ అడ్డంకిగా ఉందని చైనా భావిస్తుండవచ్చు.
  3. భారతదేశం ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని చాలా భారంగా మోస్తోందని చైనా ఒక అంచనాలో ఉంది.
  4. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా తాము చలించబోమని తెలియజేయాలనుకుంటుంది చైనా.
  5. చైనాకు వ్యతిరేకంగా నిలబడితే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ చూపించాలనుకుంటుంది.
  6. చైనా భారత్​ సంకల్పాన్నే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని పరీక్షించాలనుకుంటుంది.

అందుకే, చైనా అధ్యక్షుడు ప్రమాదకర చర్యలకు ఒడిగడుతున్నట్టు కనిపిస్తోంది. చైనా మీడియా ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే ప్రముఖంగా తెలియజేస్తూ, భారత్​ను దురాక్రమణదారిగా చిత్రీకరిస్తోంది.

మే 26న జరిగిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) ప్లీనరీలో జిన్‌పింగ్ మాట్లాడుతూ ఏ దేశం పేరును ప్రస్తావించకుండా, "యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఈ మేరకు చైనా సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

అయితే రెండు వైపులా అనేక ద్వైపాక్షిక, సైనిక, దౌత్య, రాజకీయ చర్చా యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయి, ఇవి ఇప్పటికే చర్చలకు రంగం సిద్ధం చేశాయి. వీటితో ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుందనే అందరూ భావిస్తున్నారు. అయితే, ఎప్పటికైనా భారత్​కు చైనా ఒక పెద్ద సవాలు అన్నది నమ్మక తప్పని నిజం.

ABOUT THE AUTHOR

...view details