ప్రపంచ దేశాల్లోని ఆదివాసులు ఆధునిక సాంకేతిక యుగంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విలువైన అటవీ, జల, ఖనిజ వనరులు ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ వనరులే వారికి శాపంగా మారాయి. వాటి వినియోగంపై ఎన్నో బయటి శక్తులు, వ్యవస్థలు విపరీతమైన శ్రద్ధ చూపుతున్నాయి. ఆదివాసీ సమూహాల హక్కులను గౌరవించి, సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతుండటం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 40 కోట్లకుపైగా ఆదివాసుల జనాభా ఉంది. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులతో ఆదివాసీ ప్రాంతాలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉన్నాయి. 1994లో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఆదివాసుల హక్కుల కల్పన కోసం సమగ్ర ఒడంబడికపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగానే నిర్వహిస్తున్నాయి. అయితే మన రాజ్యాంగం గిరిజనులకోసం రూపొందించిన చట్టాల అమలులో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.
రాజ్యాంగ హక్కులకు తూట్లు
భిన్న సంస్కృతులు, జీవన వైవిధ్యాలున్న భారత్ లాంటి దేశాల్లో ఆదివాసులు మరింత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో 10.42 కోట్ల మంది ఆదివాసులు (జనాభాలో 8.6శాతం) ఉన్నారు. మొత్తం 461 రకాల తెగలు ఉండగా- ఇందులో 90శాతం అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడే జీవిస్తున్నారు. మన దేశంలో ఆదివాసీ ప్రాంతాల పరిపాలన, సంక్షేమంపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపేందుకు వీలుగా రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూళ్లను తీర్చిదిద్దారు. ఆరో షెడ్యూలులో ఈశాన్య రాష్ట్రాల గిరిజన ప్రాంతాలను, అయిదో షెడ్యూలు పరిధిలోకి పది రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను చేర్చారు. బయటివాళ్లు వనరుల దోపిడికి పాల్పడకుండా అయిదో షెడ్యూల్‌లో నిబంధనలు విధించారు. దీని ప్రకారం గిరిజన ఎమ్మెల్యేలతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విశేషమైన హక్కులు ఉంటాయి. దేశవ్యాప్తంగా అధికశాతం గిరిజన కుటుంబాలు ఉండి అయిదో షెడ్యూల్ ప్రాంతంగా గుర్తింపు పొందని వేలాది గ్రామాలు నేడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ నిధులు గానీ, రాజ్యాంగ హక్కులు గానీ దక్కని ఈ గ్రామాల గిరిజనులను పాలనా వ్యవస్థలు సైతం పట్టించుకోవడంలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ తరహా గ్రామాలు 800 వరకు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడి నియంత్రణ, సంక్షేమం కోసం సలహా మండళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్న తీర్మానాలు తగిన రీతిలో ఆదరణకు నోచుకోవడంలేదు. గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల హక్కుల విషయంలో చారిత్రక తప్పిదాలను సరిదిద్దే పేరుతో 'అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006' రూపుదిద్దుకుంది. ఆదివాసీ గ్రామసభలకు స్వీయపరిపాలన హక్కులు కల్పించే పంచాయతీ రాజ్ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం(పెసా)-1996నూ అమలులోకి తెచ్చారు. దశాబ్దాలు దాటుతున్నా, వాటిని పటిష్ఠంగా అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు శ్రద్ధ చూపడం లేదు. అటవీ హక్కుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయి కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో అటవీ హక్కుల గుర్తింపు లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు.