దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు. ఏ దేశాభివృద్ధికైనా మానవ వనరులే ప్రాణవాయువు. తమ శ్రామిక శక్తిని ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మార్చుకోవడమన్నది ఆయా దేశాల విధానాలు, ప్రణాళికల పైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తుతుందన్న అంచనాతో చైనా దశాబ్దాల పాటు నిర్బంధ జన నియంత్రణను కఠినంగా అమలు చేసింది. శ్రామిక జనాభా తగ్గిపోవడం వల్ల తప్పు తెలుసుకుని 2016లో ఇద్దరు పిల్లలకు అనుమతిచ్చింది. దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేక ఇటీవల ఆ సంఖ్యను మూడుకు పెంచింది. జనాభా పరంగా భారత్ 2025 నాటికి డ్రాగన్ దేశాన్ని (ప్రస్తుతం 142 కోట్లు) అధిగమిస్తుందని 2019లో ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 2048 నాటికి భారత జనాభా 160 కోట్లకు చేరి, ఆ తరవాత 2100 నాటికి 32 శాతం తగ్గి 109 కోట్లకు పరిమితమవుతుందని గతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవ్తేతల అధ్యయనం పేర్కొంది. అయినా అధిక జనాభా పరంగా భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం 2019లో భారత జనాభా 134 కోట్లు. దేశంలో శ్రామిక వయో జనాభా (20-59 ఏళ్లు) 2021-31 మధ్యలో ఏటా 97 లక్షలు, 2031-41 మధ్యలో సాలీనా 42 లక్షల చొప్పున వృద్ధిచెందుతుందని నిపుణుల అంచనా. ఒకవైపు కొవిడ్ రక్కసి విజృంభణతో కొలువులు తెగ్గోసుకుపోతుండటం, మరోవైపు నైపుణ్యాలు నానాటికీ సన్నగిల్లుతున్న తరుణంలో కొత్తగా శ్రామిక ప్రపంచంలోకి వచ్చే వారికి ఉపాధి ఎలా అందుతుందన్నదే కీలక ప్రశ్న!
వరంగా జనాభా వృద్ధి..
భారత్‌లో శ్రామిక వయో జనాభా 2011లో 61 శాతం ఉంటే, 2036 నాటికి 65 శాతానికి చేరుతుందని కేంద్ర మంత్రిగా హర్షవర్ధన్ ఈ ఫిబ్రవరిలో ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఏటా 1.2 కోట్ల శ్రామిక శక్తి దేశానికి అదనంగా జతపడుతోంది. జనాభా పెరుగుదల దేశాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తుందని 18వ శతాబ్దం చివర్లో ప్రఖ్యాత ఆర్థిక వేత్త థామస్ మాల్థస్ సూత్రీకరించారు. పరిమిత వనరులు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఆ సిద్ధాంతాన్ని చాలా మంది విశ్వసించారు. కానీ, కాలక్రమంలో సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కడం, వనరులను విస్తృతంగా ఉపయోగించుకోవడం వల్ల జనాభా పెరుగుదల ఆయా దేశాలకు వరంగా మారిందనే చెప్పుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచ జనాభా రెట్టింపైంది. ప్రపంచ జీడీపీ అయిదు రెట్ల వరకు అధికమైంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాలు పెరిగిన శ్రామిక జనాభాతో ఎంతగానో అభివృద్ధి సాధించాయి.
వాటిపై శ్రద్ధ అనివార్యం..