తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చిప్‌ల కొరతతో.. ప్రపంచం సతమతం - సెమీ కండక్టర్ల కొరత

కొవిడ్‌ లాక్‌డౌన్‌ల సమయంలో కార్ల పరిశ్రమలు, గృహోపకరణాలను ఉత్పత్తి చేసే కర్మాగారాలు మూతపడటంతో సిలికాన్​ చిప్‌ (సెమీ కండక్టర్ల)కు గిరాకీ పడిపోయింది. లాక్‌డౌన్‌లను ఎత్తివేశాక కార్లు, ఇతర వస్తువుల తయారీ కర్మాగారాలు తిరిగి తెరుచుకొన్నా పెరిగిన డిమాండ్‌కు తగినట్లు చిప్‌లు సరఫరా కావటం లేదు. వీటి తయారీలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది.

scarcity of semi conductor chips
చిప్‌ల కొరత

By

Published : Apr 12, 2021, 6:37 AM IST

ప్రపంచానికి సిలికాన్‌ చిప్‌ల కరవొచ్చింది. నేడు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కార్ల వరకు, వీడియో గేమ్‌ కన్సోల్స్‌ నుంచి వాషింగ్‌ మెషీన్ల వరకు, ల్యాప్‌ టాప్‌ల నుంచి టీవీల వరకు, వెబ్‌క్యామ్‌ల నుంచి సీసీటీవీ కెమెరాల వరకు అన్నీ సిలికాన్‌ చిప్‌ల (సెమీ కండక్టర్ల)తోనే నడుస్తున్నాయి. అవి లేకుండా ఆధునిక ప్రపంచం ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు. కానీ, కొవిడ్‌ లాక్‌డౌన్‌ల సమయంలో కార్ల పరిశ్రమలు, గృహోపకరణాలను ఉత్పత్తి చేసే కర్మాగారాలు మూతపడటంతో చిప్‌లకు గిరాకీ పడిపోయింది. తరవాత అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రంపై మంచు తుపానుల దాడికి విద్యుత్‌ సరఫరా విచ్ఛిన్నం కావడంతో చిప్‌ల ఉత్పత్తి మరింత దెబ్బతిన్నది. కొవిడ్‌ వల్ల ప్రజా రవాణా సాధనాల్లో కాకుండా సొంత కార్లలో ప్రయాణాలు చేయడం ఎక్కువై కార్లకు డిమాండ్‌ పెరిగింది. లాక్‌డౌన్‌లను ఎత్తివేశాక కార్లు, ఇతర వస్తువుల తయారీ కర్మాగారాలు తిరిగి తెరుచుకొన్నా పెరిగిన డిమాండ్‌కు తగినట్లు చిప్‌లు సరఫరా కావడం లేదు. ఈ కారణం వల్లే భారత్‌లో ఫోర్డ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు కార్ల ఉత్పత్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా టొయోటా, జనరల్‌ మోటార్స్‌ వంటి కంపెనీలూ అదే యోచన చేస్తున్నాయి. మరోవైపు కొవిడ్‌ వల్ల ఇంటి నుంచి పని చేయడం ఎక్కువై, కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, టెలికం నెట్‌వర్కులకు అమాంతం గిరాకీ పెరిగిపోయింది. చిప్‌ల కొరత వీటి తయారీనీ దెబ్బతీస్తోంది. అందుకే సామ్‌సంగ్‌, ఆపిల్‌ సంస్థలు తమ సరికొత్త శ్రేణి ఫోన్ల విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ కేబుల్‌ టీవీ సంస్థ నేషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌బీఎన్‌) మోడెమ్‌ల కొరత వల్లే తన ఖాతాదారుల సంఖ్యను విస్తరించలేకపోతోంది.

అన్నింటికీ మూలం అవే

చిప్‌ లేదా సెమీకండక్టర్లు లేనిదే కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), 5జీ, రోబోటిక్స్‌, డ్రైవర్‌రహిత కార్ల వంటి అత్యధునాతన సాంకేతికతలు సాధ్యపడవు. ప్రస్తుతం అమెరికా, తైవాన్‌, దక్షిణ కొరియా, చైనా, చివరకు వియత్నాం కూడా చిప్‌ల తయారీ కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. భారత్‌ ఇటీవల ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్‌ మార్కెట్‌గా అవతరించినా, ఇక్కడ చిప్‌ల తయారీ ఇంకా వేళ్లూనుకోలేదు. దక్షిణ కొరియా, చైనా కంపెనీలు మొబైల్‌ విడిభాగాలను తమ దేశం నుంచి తెచ్చి భారత్‌లో కూర్పు చేసి అమ్ముకుంటున్నాయి. మొబైల్‌ ఫోన్లకు కావలసిన చిప్‌లలో 80 శాతానికిపైగా తైవాన్‌, దక్షిణ కొరియాలలోనే తయారవుతున్నాయి. భారత్‌కు రెండే సొంత చిప్‌ తయారీ కర్మాగారాలు (ఫ్యాబ్‌) ఉన్నాయి. వీటిలో ఒకటైన సితార్‌ బెంగళూరులో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలో నడుస్తోంది. రెండోది- చండీగఢ్‌లోని సెమీ కండక్టర్‌ లేబరేటరీ. ఇవి భారత రక్షణ దళాలకు, అంతరిక్ష పరిశోధన సంస్థకు మాత్రమే చిప్‌లను అందిస్తాయి తప్ప, వ్యాపార అవసరాల కోసం ఉత్పత్తి చేయడం లేదు. భారత్‌ భారీయెత్తున చిప్‌లను తయారు చేయలేకపోతున్నా, చిప్‌ల డిజైనింగ్‌లో మాత్రం తనకుతానే సాటి. ప్రపంచంలోని 90 శాతం సెమీకండక్టర్‌ కంపెనీలు భారత్‌లో చిప్‌ డిజైన్‌కు సంబంధించి పరిశోధన-అభివృద్ధి కేంద్రాలను నడుపుతున్నాయి. వీటిలో ఇంటెల్‌, ఏఎండీ, బ్రాడ్‌కామ్‌ వంటి ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. భారత్‌ స్వావలంబన సాధించి, అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా ఎదగాలంటే చిప్‌ల తయారీయే కీలకం. అవి లేకుండా రక్షణ, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో రాణించలేం.

చిప్​ల తయారీలో సవాళ్లు..

మొదట సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ కర్మాగారాల(ఫ్యాబ్స్‌)ను స్థాపించాలంటే అత్యంత భారీ పెట్టుబడులు కావాలి. కేవలం ఒక ఫ్యాబ్‌ స్థాపనకే వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం. చిప్‌ తయారీ సాంకేతికత మూడునాలుగేళ్లకే మారిపోతుంది. ఫ్యాబ్‌కు అవిచ్ఛిన్నంగా విద్యుత్తును సరఫరా చేయాలి. ఈ వసతులన్నీ ఉండబట్టి చైనా 2025కల్లా తన ఉత్పత్తుల్లో 70 శాతానికి స్వదేశీ సెమీకండక్టర్లనే వాడాలని నిశ్చయించింది. మనదేశం కూడా 2025కల్లా 40,000 కోట్ల డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్లు, ఐఓటీ పరికరాలు, వైద్య పరికరాలు, ఆటోమోటివ్‌, పారిశ్రామిక ఎలక్ట్రానిక్‌ సాధనాలను సొంతంగా తయారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం 'ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల' పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రకటించింది. 1.97 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పథకం కింద 2025కల్లా దేశంలో వంద కోట్ల మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించాలని లక్షిస్తోంది. స్మార్ట్‌ సిటీ, 5జీ నెట్‌వర్క్‌ కోసం 500 కోట్ల ఐఓటీ పరికరాలనూ తయారు చేయాలని భావిస్తోంది. ఇంకా అయిదు కోట్ల ల్యాప్‌టాప్‌, నోట్‌బుక్‌, టాబ్లెట్‌ కంప్యూటర్లను ఉత్పత్తి చేయదలచింది. ఇవన్నీ సాధ్యమైతే భారత్‌ ప్రపంచానికి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ కంప్యూటర్లను అందించే ప్రధాన కేంద్రంగా ఎదుగుతుంది. 2025కల్లా 10,000 కోట్ల డాలర్ల ప్రపంచ మార్కెట్‌ను కైవసం చేసుకుని, తన యువతకు అయిదు లక్షల ఉద్యోగాలు సృష్టించగలుగుతుంది.

ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు
మన దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయడానికి ముందుకొచ్చే ప్రతి ఉత్పత్తిదారుడికీ 100 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారతీయ కంపెనీలను విదేశాల్లోని సెమీ కండక్టర్‌ యూనిట్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహించనున్నది. స్వదేశంలో తయారయ్యే సెమీకండక్టర్‌ చిప్‌లను భారత ప్రభుత్వం నికరంగా కొనడమే కాదు, ప్రైవేటు రంగమూ కొనేలా నిబంధనలు విధిస్తుందని వెల్లడించారు. దీనికి పైవేటు రంగం సానుకూలంగా స్పందిస్తోంది. టాటా గ్రూపు ఆపిల్‌ సంస్థతో కలిసి తమిళనాడులో రూ.5,000 కోట్లతో మొబైల్‌ ఫోన్‌ పరికరాల ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పబోతోంది. తెలంగాణ ప్రభుత్వ అండదండలతో ఇంటెల్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏఐ పరిశోధన కేంద్రాన్ని స్థాపించనున్నది.

ఇండియాకు అసాధ్యమేమీ కాదు

మొబైల్‌ ఫోన్లు, ఐఓటీ సాధనాలు, కంప్యూటర్లకు సొంత సెమీకండక్టర్‌ చిప్‌లను అమర్చగలిగితేనే భారత్‌ అధునాతన సాంకేతిక, ఆర్థిక శక్తిగా అవతరించగలుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలో చైనా తరవాత అతిపెద్ద మొబైల్‌ ఉత్పత్తిదారుగా నిలుస్తున్న భారత్‌కు ఇది అసాధ్యమేమీ కాదు. ఇంతవరకు మన టెలికం నెట్‌వర్క్‌లకు, ఎలక్ట్రానిక్‌, మొబైల్‌ యూనిట్లకు చిప్‌ల కోసం చైనాను ఆశ్రయించిన మనదేశం, నిరుటి సరిహద్దు ఘర్షణల తరవాత దిగుమతులు తగ్గించుకుని సొంత గడ్డపై చిప్‌ల తయారీని ప్రోత్సహించాలని నిశ్చయించింది.

-కైజర్‌ అడపా

ఇదీ చదవండి:అప్​స్టాక్స్​పై సైబర్ దాడి- కీలక డేటా లీక్​

ABOUT THE AUTHOR

...view details