ప్రపంచంలో ఏడాదికి 1.9 కోట్ల మంది గుండె కవాటాల సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో మొత్తం గుండెపోటు(World Heart Day) కేసుల్లో 50 శాతం యాభై ఏళ్ల లోపువారిలో, 25 శాతం 40 ఏళ్లలోపు వారిలోనే నమోదవుతున్నాయి. గడిచిన దశాబ్దకాలంలో 20లు, 30లలోనే గుండెపోటుకు గురయ్యేవారి కేసులు పెరగడం తాము గమనించినట్లు గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల కంటే భారతీయుల్లోనే గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గత పదేళ్లలో ఈ తరహా సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. గుండెపోటు కేసుల సంఖ్య పురుషుల్లో ఎక్కువగా ఉండగా, మహిళల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.
పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయుల్లో తక్కువ వయసులోనే గుండె వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో గుండె కవాటాల సమస్యలే అధికం. పాశ్చాత్యులకు 60లలో ఇలాంటి సమస్యలు వస్తే, భారతీయులకు 50లలోనే వస్తున్నాయని 'ఇండియన్ హార్ట్ అసోసియేషన్' స్పష్టం చేస్తోంది. అభివృద్ధి చెందిన, పాశ్చాత్య దేశాల కంటే భారతదేశంలో, ఆగ్నేయాసియా దేశాల్లో గుండె వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోంది. అక్కడ 40శాతం జనాభాలో ఈ సమస్య ఉంటే, మనదేశంలో 60శాతం జనాభాలో ముప్పు కనిపిస్తోంది.
ఒత్తిడి అధికం
భారతీయుల్లో గుండెకు వెళ్ళే రక్తనాళాల పరిమాణం చిన్నగా ఉండటమే సమస్య తీవ్రత అధికం కావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనికితోడు మధుమేహం, ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం.. వీటన్నింటివల్లా చిన్నవయసులోనే గుండె సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లూ భారతీయుల్లో గుండె సమస్యలకు ఒక కారణం. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయని, వాటికితోడు మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వాడకం సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, వృత్తి జీవితంలో ఒత్తిడి పెరగడం, సామాజికంగా కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల చిన్నకుటుంబాల్లో సమస్యలను పంచుకొనేవారు లేకపోవడం వంటి పరిణామాలన్నీ చిన్న వయసులో గుండె వ్యాధులు ముంచుకురావడానికి కారణమవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
మనదేశంలో గుండె వైద్య నిపుణుల వద్దకు ఏదో ఒక సమస్యతో వెళ్తున్నవారిలో కార్పొరేట్, ఐటీ రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణులే ఎక్కువగా ఉంటున్నారు. గత రెండేళ్లుగా అత్యధికులు ఇంటినుంచే పని చేస్తుండటంతో మామూలుకంటే మరింత ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అది కూడా రాత్రివేళల్లో విధులు నిర్వర్తించడం వల్ల చాలినంత నిద్ర ఉండటం లేదు. ఆలస్యంగా లేవడంతో శారీరక వ్యాయామానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. నిద్రలేమి వల్ల హార్మోన్లలో అసమతౌల్యం ఏర్పడి ఊబకాయం, మధుమేహం, రక్తపోటు పెరిగి గుండె సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటితోపాటు, యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువవుతోంది. దాన్నుంచి బయటపడేందుకు మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ లాంటివాటికి బానిసలవుతున్నారు. ఇవన్నీ కలిసి గుండెవ్యాధుల రూపంలో ప్రాణాంతకంగా మారుతున్నాయి. మరోవైపు, భారతీయుల్లో ఆర్థికంగా వెనకబడిన వారే మొత్తం గుండెవ్యాధి బాధితుల్లో మూడొంతులు ఉంటున్నారు. పేద ప్రజలు ఆరోగ్య సంరక్షణపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం, అందుబాటులో వైద్య సదుపాయాలు, ఆంబులెన్సు సేవలు లేకపోవడంతో సమస్య ముదిరి ప్రాణాంతకంగా మారుతోంది.