World forest day: ప్రపంచ దేశాల్లో వందల కోట్ల జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా అరణ్యాలపై ఆధారపడి జీవిస్తోంది. ప్రకృతి సంపదతోపాటు విశిష్టమైన జీవవైవిధ్యం కలిగిన అడవులు భూమిపై 80శాతం మేర వన్యప్రాణులు, వృక్షజాతులు, కీటకాలకు ఆవాసంగా ఉన్నాయి. వాతావరణ మార్పులకు దారితీసే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను అందించడంలో వనాలది విశేష పాత్ర. అడవుల్లో లభించే ఆహార, ఔషధ, కలపేతర ఉత్పత్తులద్వారా ఏటా భారీగా ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పూర్తిస్థాయి ఉపాధి పొందుతున్నారు. 75శాతం స్వచ్ఛమైన నీటి ప్రవాహాలకు అడవులే ఆధారంగా నిలుస్తున్నాయి. భూమిపై ఉన్న అటవీ ప్రాంతాల విశిష్టత, వాటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించేలా ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకొంటున్నాం.
లోపాలపై సమీక్ష అవసరం
అడవుల పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా, దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది. అడవుల రక్షణకు 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఓ బీట్ అధికారి చొప్పున నియమించాలని గతంలో జాతీయ అటవీ కమీషన్ సూచించింది. వనాల అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాల బడ్జెట్‌లలో నిర్దిష్టంగా నిధులను కేటాయించాలని సిఫార్సు చేసింది. అవేవీ అమలుకు నోచుకోలేదు. అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలనే ఆశయంతో రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఉమ్మడి అటవీ యాజమాన్యం, సామాజిక అటవీ యాజమాన్యం వంటి పథకాలు కనుమరుగయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్త జాతీయ అటవీ విధానం ముసాయిదాను ప్రకటించినా తరవాత పక్కన పెట్టేసింది. పర్యావరణ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ, నీటి, వాయు కాలుష్య నియంత్రణ వంటి వేర్వేరు చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సమగ్ర పర్యావరణ న్యాయ (నిర్వహణ) చట్టం తీసుకురావాలని సుబ్రమణియన్ కమిటీ కేంద్రానికి నివేదించింది. గతేడాది అటవీ పరిరక్షణ చట్టం-1980లో మార్పులు చేసి గనుల తవ్వకాలు, ప్రాజెక్టులకు అటవీ భూములిచ్చే ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. వ్యతిరేకత రావడంతో ఆ తరవాత వెనక్కి తగ్గింది. అడవుల పరిరక్షణలో ముందుగా వ్యవస్థాగత లోపాలను విశ్లేషించుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అడవితో మమేకమై జీవిస్తున్న స్థానికులను వనాల పరిరక్షణలో భాగస్వామ్యం చేయడానికి పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేయాలి. అటవీ ఆధారిత ఉత్పత్తులే జీవనాధారంగా బతుకుతున్న ఆదివాసులు, ఇతర సమూహాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఆశయంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం తెచ్చారు. దాని ప్రకారం వారికి కనీస హక్కులు దఖలు పరచడంలో అలసత్వం చోటుచేసుకుంది. ఫలితంగా ఆదివాసులు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలి.
దేశంలో భూమి లేని నిరుపేదలు అడవుల్లో కలపేతర ఉత్పత్తుల సేకరణ ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం మూడు కోట్ల మంది అసంఘటిత పేదలు ఏటా రమారమి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అటవీ ఫలసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా అడవుల్లో లభించే సేంద్రియ ఉత్పత్తులైన తేనె, కరక్కాయ, కుంకుడు, నల్లజీడి గింజలతో పాటు చెట్ల వేర్లు, వృక్షాల బెరడు, ఇతర మూలికలు, పుష్పాలు వంటి ఔషధ ఉత్పత్తులు, గృహోపకరణాలు కలపేతర అటవీ ఫలసాయం కిందకు వస్తాయి. మొత్తం సేకరిస్తున్న ఉత్పత్తుల్లో 60శాతందాకా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంతటి గిరాకీ ఉన్న ఈ ఉత్పత్తులను సేకరించే స్థానిక సమూహాలకు, ప్రభుత్వ వ్యవస్థలకు సరైన ఆదాయం సమకూరడం లేదు. ఏళ్ల తరబడి అటవీ, గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయం, సహకారం కొరవడటం, మార్కెట్ వసతులు, రవాణా సౌకర్యాల కొరత మూలంగా పేదలు నామమాత్రం ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
లక్ష్య సాధనలో విఫలం