తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అలా చేస్తే 'ఇంటి నుంచి పని' ఒత్తిడి దూరం

కరోనా లాక్​డౌన్​తో వర్క్‌ ఫ్రం హోం చేసే ఉద్యోగులు.. పని భారం, శారీరక, మానసిక ఒత్తిళ్లు సహా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే కార్యాలయాలకు హాజరవుతున్న ఉద్యోగులకు.. రెండో విడత ఉద్ధృతి పెరుగుదలతో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తుంది. అయితే పనిపై ఆసక్తి పెంచుకుంటే 'ఇంటి నుంచి పని' ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Work from home stress distance if interest in work increases
అలా చేస్తే 'ఇంటి నుంచి పని' ఒత్తిడి దూరం

By

Published : Mar 31, 2021, 8:37 AM IST

గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా 'ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రం హోం)'తో విధులు నిర్వర్తించిన ఉద్యోగులు కొన్ని నెలలుగా కార్యాలయాలకు హాజరవుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా రెండో విడత ఉద్ధృతి పెరగడం వల్ల కంపెనీలు మళ్లీ ఆలోచనలో పడ్డాయి. మరోసారి ఇంటి నుంచే పని అనే అంశం తెరపైకి వస్తోంది. తొలి రోజుల్లో 'ఇంటి నుంచి పని'కి ఉద్యోగులు అమితమైన ఆసక్తి చూపారు. గంటల తరబడి ప్రయాణం, ఇంధన వ్యయం, రాకపోకల శ్రమ లేకుండా పోయాయనే సంతోషం వ్యక్తమైంది. అయితే సహచరులతో కలిసి పనిచేసే, మాట్లాడుకునే వెసులుబాటు కోల్పోవడం, స్నేహితులతో సరదాలు, పార్టీలు వంటి సామాజిక సంబంధాలు కోల్పోవడం.. క్రమంగా వారిలో కొంతవెలితిని పెంచిందనే అభిప్రాయాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇంటి నుంచి పని వల్ల.. తమ పై అధికారులకు అన్నివేళలా అందుబాటులో ఉండాల్సి రావడం, రోజంతా పని చేసినా, సంతృప్తికర ఫలితాలను సాధించలేక పోతున్నామన్న తెలియని మానసిక ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలున్నాయి. వ్యక్తిగత, ఉద్యోగ జీవితం మధ్య తెర తొలగిపోవడం, పని గంటలు పెరిగి విశ్రాంతికి, కుటుంబ జీవనానికి తగినంత సమయం వెచ్చించే సమయం లేకపోవడం పట్ల ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు.

ఇంటి నుంచే పని సమయంలో మహిళలకు ఇంటెడు చాకిరీ, పిల్లల పెంపకంతో పాటు, కార్యాలయ పనులతో తీవ్ర ప్రభావం పడింది. సాఫ్ట్‌వేర్‌తోపాటు ఇతర పలు రంగాల్లో పనిచేసే మహిళలపై సైతం పనిభారం పెరిగింది. శారీరక, మానసిక సమస్యలు అధికమయ్యాయి. వ్యాధుల తీవ్రత పెరిగిందన్న అంచనాలున్నాయి. మొత్తంమీద 80శాతం మహిళల జీవితాలపై కరోనా ఏదో రకంగా వ్యతిరేక ప్రభావం చూపిందని వాణిజ్య కన్సల్టెన్సీ సంస్థ 'డెలాయిట్‌ గ్లోబల్‌' పేర్కొంది. ఇంటి నుంచి పని అంశంపై ప్రత్యేక అధ్యయనం చేపట్టిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)- పిల్లల పెంపకం, డిజిటల్‌ కనెక్టివిటీ మహిళల్లో మానసిక, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు స్పష్టం చేసింది. పిల్లలు కలిగినవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. కుటుంబ సభ్యులతో చిన్న ఇళ్లలో నివసించే ఆడవారి పరిస్థితి దయనీయమని, సాధ్యమైనంత త్వరగా వారిని కార్యాలయాలకు రప్పించి పని చేయిస్తే మంచిదని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్స్‌గేట్‌ లోగడ వ్యాఖ్యానించారు.

ఉద్యోగం మారిపోవాలని..

మైక్రోసాఫ్ట్‌ గత ఏడాది అక్టోబరులో ఎనిమిది దేశాల్లో ఉద్యోగుల మానసిక స్థితిపై అధ్యయనం నిర్వహించింది. వ్యక్తిగత, వృత్తిపర జీతాలకు మధ్య తేడా లేకుండా పోయిందని 41శాతం అభిప్రాయపడగా, తాము త్వరగా బడలికకు గురవుతున్నట్లు 29శాతం పేర్కొనడం గమనార్హం. మరోవైపు, కరోనా పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మారిన పరిస్థితులతో సర్దుబాటు కాలేక పలువురు ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతరంలో ఈ వైఖరి ప్రబలంగా కనిపిస్తోంది. గత నెలలో మైక్రోసాఫ్ట్‌ వెలువరించిన 'వర్కింగ్‌ ట్రెండ్స్‌- 2021' అధ్యయనంలో.. 1995-2002 మధ్య జన్మించిన వారిలో 60 శాతం తాము ప్రస్తుతం చేస్తున్న పని ఏ మాత్రం నచ్చడం లేదని, బలవంతంగా సర్దుకుపోతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది డెలాయిట్‌ సంస్థ 42 దేశాల్లో చేపట్టిన అధ్యయనంలో దాదాపు సగం మంది (49శాతం) రాబోయే రెండేళ్లలో ప్రస్తుత ఉద్యోగాల నుంచి మారిపోవాలని భావిస్తున్నట్లు వెల్లడైంది. కార్పొరేట్‌ ఉద్యోగాల నుంచి ఫ్రీలాన్స్‌ వైపు ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు.

అలా చేస్తే ఒత్తిడి దూరం

ఉద్యోగుల్లో ఎక్కువ మంది త్వరగా అలసిపోవడం వంటి సమస్యతో బాధపడుతున్నారు. చేస్తున్న పనిపై ఆసక్తిని పెంచుకుంటే మానసిక ఆనందం దక్కుతుందని, శారీరక సమస్యలున్నా పెద్దగా బాధించబోవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడమే బడలికకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను కీలక అంశంగా పరిగణించాలి. ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తీవ్రమై కుంగుబాటుకు, వ్యాకులతకు లోనైతే మెరుగైన చికిత్స అందించేందుకు తోడ్పడాలి. ఉద్యోగి తన సామర్థ్యంపై స్పష్టత ఏర్పరచుకుని, ఉత్పాదకత విషయంలో వాస్తవిక ధోరణితో మెలగాల్సిన అవసరం ఉంది. తాము సాధించలేని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు లేదా తమకంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో పోల్చుకున్నప్పుడు సహజంగా దాని ప్రభావం పడి, అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. సమయపాలనను పాటించడం, మానసిక ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి సహచరులతో మనసు విప్పి మాట్లాడటం, పనివిధానంలో కొత్తదనం, సృజనాత్మకత కోసం ప్రయత్నించడం వంటి చర్యల ద్వారా ‘ఇంటి నుంచి పని’ చాలావరకు ఆహ్లాదకరంగా మారుతుంది.

రచయిత- పార్థసారథి చిరువోలు

ABOUT THE AUTHOR

...view details