Work From Home Benefits: కొవిడ్ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలిపోయే పరిస్థితి కనిపించడంలేదు. కొత్త రకం వైరస్ ఒమిక్రాన్ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దాంతో ఐటీ ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు వెళ్లి పనిచేసే అవకాశం కనిపించడంలేదు. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‌లో 2025 వరకు ఏ రోజైనా కేవలం 25శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తారని, మిగిలిన వారు ఇళ్లనుంచే విధులు నిర్వర్తిస్తారని సీనియర్ ఉపాధ్యక్షులు తాజాగా పేర్కొన్నారు. ఈ విధమైన హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది. కరోనా వంటి సహజ, ఇతర మానవ ప్రేరిత సంక్షోభ సమయాల్లో కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా దూర ప్రాంతం నుంచి పని చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తోంది. స్కైప్, ఫేస్ టైం, స్లాక్, జూమ్, గూగుల్ హ్యాంగ్‌ఔట్స్ వంటి యాపులు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి అందుకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) పద్ధతి తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ప్రారంభమైనప్పటికీ, సౌలభ్యత కారణంగా వివిధ దేశాలు దానికి చట్టబద్ధతను కల్పిస్తున్నాయి. మన దేశంలోనూ సేవేతర రంగాలకు దాన్ని విస్తరిస్తూ చట్టం చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రత్యేక మార్గదర్శకాలు
Work From Home News India: ఇంటి నుంచి పనిచేయడం యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఉభయ తారకంగా ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ పద్ధతిలో సంస్థలకు ఉత్పాదకత పెరగడం, వ్యవస్థాగత ఖర్చులు తగ్గి పెట్టుబడి ఆదా కావడం వంటి ప్రయోజనాలున్నాయని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధనలో తేలింది. ఇంటినుంచి పనిచేసే ఉద్యోగులు అతి సంక్లిష్టమైన విధులను ఉత్తమంగా నిర్వర్తిస్తున్నారని మరొక అధ్యయనం పేర్కొంది. విధి నిర్వహణలో స్వేచ్ఛ, పని-జీవితం మధ్య సమతౌల్యం, కార్యాలయానికి వెళ్లే ప్రయాణ సమయం, ఒత్తిడి తగ్గడం, శబ్ద కాలుష్యం లేకపోవడం, అధిక సంతృప్తి, ఆర్థిక పొదుపు, అదనపు భత్యాలవంటి ప్రయోజనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు లభిస్తాయి. అదేసమయంలో ఒంటరితనం, అధిక పనిభారం, సహ ఉద్యోగులకు దూరంగా ఉన్నామనే భావన, పనిపట్ల ఏకాగ్రత లోపించడం, ఇంట్లో ఎదురయ్యే ఆటంకాలు వంటి వాటినీ ఉద్యోగులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంటి నుంచి పని పరంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) గతేడాది పలు మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ఆధారంగా వివిధ దేశాలు ప్రత్యేక చట్టాలను చేశాయి. కొన్నిచోట్ల కార్మిక చట్టాలను సవరించారు. కరోనాకంటే ముందే ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉద్యోగులు సరళంగా పనిచేసే చట్టాలను తెచ్చాయి. కొవిడ్ తరవాత అర్జెంటీనా, చిలీ, కొలంబియా, స్పెయిన్, పోర్చుగల్, టర్కీ దేశాలు ప్రత్యేక చట్టాలు చేశాయి. రష్యా, మెక్సికోలు తమ కార్మిక చట్టాలను సవరించాయి. భారత్‌లో సేవా రంగంలో వర్క్ ఫ్రమ్ హోముకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులను 2020లో జారీచేశారు. వాటి ప్రకారం మూడు వందలకు మించి కార్మికులు ఉన్న సంస్థలు ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయడానికి అవకాశం కల్పించాలి. వివిధ దేశాల చట్టాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, అన్నింటిలో ఉమ్మడి అంశాలు కనిపిస్తాయి. తమపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని అన్ని చట్టాలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోముకు అవసరమైన సాధనాలు, వాటి వినియోగ, మరమ్మతు ఖర్చులను యాజమాన్యమే భరించాలని, పని గంటలు పూర్తయిన తరవాత ఉద్యోగులను ఇబ్బందిపెట్టకూడదని పేర్కొంటున్నాయి. నిబంధనలకు కట్టుబడని యాజమాన్యాలకు అపరాధ రుసుము విధించాలని పోర్చుగల్ నిర్ణయించింది. యాజమాన్యం, ఉద్యోగుల మధ్య చర్చల ద్వారా ఇంటినుంచి పనిచేయడంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూసుకోవాలని యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల చట్టాలు ఉద్ఘాటిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఐఎల్‌ఓ తేల్చి చెప్పింది.