తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహాత్ముడు చెప్పిన మాటలు- భారతావనికి పాఠాలు - గాంధీ జయంతి

గాంధీజీ తన జీవితకాలం అంతా సత్యానికే కట్టుబడి ఉన్నారు. సత్యాన్ని ఎంతగానో ప్రేమించారు. అందుకే తన ఆత్మకథకు 'సత్యంతో నా ప్రయోగాలు' అని పేరు పెట్టుకున్నారు. స్వేచ్ఛాయుత భారతావనికి ఆయన చెప్పిన మాటలే పాఠాలు.

WORDS OF GANDHI
మహాత్ముడు చెప్పిన మాటలు- భారతావనికి పాఠాలు

By

Published : Oct 3, 2020, 8:36 AM IST

నిరాడంబర జీవితం, ఉన్నతమైన భావనలు... ఈ వాక్యంతో మొదలవుతుంది గాంధీయిజం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ- సత్యం, సహనం, అహింస, ఇతరుల పట్ల గౌరవభావం చెక్కుచెదరకూడదు. ఇవి ఉన్నతమైన భావనలు. సత్యభావన గాంధీయిజానికి ప్రాణం. గాంధీజీ తన జీవితకాలం అంతా సత్యానికే కట్టుబడి ఉన్నారు. సత్యాన్ని ఎంతగానో ప్రేమించారు. అందుకే తన ఆత్మకథకు 'సత్యంతో నా ప్రయోగాలు' అని పేరు పెట్టుకున్నారు.

గాంధీజీ ప్రవచించిన మరో మౌలిక సూత్రం- అహింస. ఎటువంటి క్లిష్టసమయంలోనూ వీటిని ఆయన వీడలేదు. సత్యానికి, అహింసకు దూరమై సత్యాగ్రహులు బ్రిటిష్‌ అధికారులను సజీవదహనం చేసిన చౌరీ-చౌరా హింసాకాండ అనంతరం ఆయన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. యుద్ధాలతో రగులుతున్న నేటి ప్రపంచంలో, ఉగ్రవాద మృత్యుహేలకు సామాన్యప్రజ బలవుతున్న నేటి కాలంలో- గాంధీజీ అహింసా సిద్ధాంతం గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత సమాజంలో వేరూనిన పలు ఇతర దురవస్థలకూ ఆయన సూత్రాలు తారక మంత్రాల వంటివి.

ఆర్థిక పాఠాలు..

అన్ని మతాలనూ గౌరవించే గాంధీజీ లౌకిక భావాలు భారత రాజ్యాంగంలోనూ చోటుదక్కించుకున్నాయి. భారతీయ సమాజంలో అవి అంతస్సారంగా నిలిచిన మౌలిక విలువలు. గాంధీయిజం ప్రబోధిస్తున్న పరమత సహనం పాటించే వ్యక్తుల అవసరం మతం పేరిట హింసకు లోనవుతున్న నేటి సమాజాల్లో మునుపటి కంటే ఎంతో ఎక్కువగా ఉంది. కుల వ్యవస్థలో లాగా పుట్టుకను బట్టి కాకుండా- వృత్తి ప్రాతిపదికన వర్ణాలు ఒసగిన వైదిక వర్ణ వ్యవస్థను గాంధీజీ ఇష్టపడ్డారు.

నేడు మరొక రకం అంటరానితనం రాజ్యమేలుతోంది. అది ఆర్థిక అంటరానితనం. పరిశుభ్ర భారతదేశం బాపూకల. దీన్ని నెరవేర్చడానికి చేపట్టిందే స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ బృహత్పథకం. భౌతిక శుభ్రతతో పాటు మానసిక స్వచ్ఛతా కావాలని గాంధీజీ కోరుకున్నారు. రోడ్లు మరుగుదొడ్లతో పాటు మనకు అవినీతిరహిత సమాజం కావాలి.

కొవిడ్‌ మనకు ఆత్మనిర్భరతను నేర్పించింది. గాంధీజీ దశాబ్దాల క్రితమే తన కార్యక్రమాల్లో ఆత్మనిర్భర్‌ను ప్రతిబింబించారు. ఆయన ఖాదీ ఉద్యమం ఇందుకు చక్కటి ఉదాహరణ. నూలు వడికి తన వస్త్రాలను తానే తయారు చేసుకున్నారు. యావత్‌ దేశం ఆయన్ను అనుసరించింది. దీంతో దేశం జౌళి రంగంలో స్వావలంబన సాధించింది. ఆత్మనిర్భరత అంటే అదే! అలాగే రాట్నంతో స్త్రీలకు సంపాదన సమకూరింది. పురుషులు సైతం రోజువారీ పనుల అనంతరం నూలు వడికి అదనపు ఆదాయం పొందగలిగారు. ఇవి ఖాదీ ఉద్యమం నేర్పిన ఆత్మనిర్భర ఆర్థిక పాఠాలు.

స్వదేశీ ఉద్యమం ఈ దిశలో ఆయన తెచ్చిన మరో గొప్ప విప్లవం. దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు దేశీ వస్తువులనే వాడాలని పిలుపిచ్చారు. ఉప్పు సత్యాగ్రహం ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ఆయన ప్రయోగించిన మరో అస్త్రం. చైనా దూకుడు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో స్వదేశీ ఉద్యమం నేడు మరోసారి మనకు అనివార్యమవుతోంది. భూతాపం, వాతావరణ మార్పులు, వనరుల కటకట వంటి సంక్షోభాలతో విలవిల్లాడుతున్న నేటి ప్రపంచానికి గాంధేయవాదం తాలూకు సుస్థిరాభివృద్ధి భావన గొప్ప పరిష్కారం. ఈ సిద్ధాంతానికి ప్రతీకగా ఐరాస ప్రధాన కార్యాలయంలో గాంధీ సోలార్‌ పార్క్‌ నెలకొల్పారు.

వాతావరణ ఒప్పందాలు, పర్యావరణ సంరక్షణ ఒడంబడికలు, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు- వీటన్నింటికీ చోదక శక్తి గాంధీమార్గమే! 'భూగోళం మానవ అవసరాలను తీర్చగలదు కాని, మానవుడి దురాశను కాదు' అన్న మహాత్ముడి మాట ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూనే ఉంది. తమ కోరికల కోసం సాటి మనిషి ప్రాణం తీసే స్థాయికి మనిషి పతనమైన నేటి సమాజానికి గాంధేయవాద స్వీయనిగ్రహం ఎంతో అవసరం.

స్త్రీలను గౌరవించాలని గాంధీజీ మరో ప్రబోధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొంటున్న హింస, అణచివేతలకు ఈ హితవు వర్తించాలి. ఆయన అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం- వరసలోని చిట్టచివరి వ్యక్తికి సైతం ఉత్తమసేవలను అందించడానికి మన పాలన యంత్రాంగం తప్పనిసరిగా సమయపాలన, కర్తవ్య నిర్వహణ, నిజాయతీ వంటి గాంధేయవాద నైతిక విలువలను ఒంటపట్టించుకోవాల్సిందే! ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలన్నది గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం.

2019 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, భారత్‌ జనాభాలో అగ్రశ్రేణి ఒక్క శాతం పౌరులు 73 శాతం సంపద కలిగి ఉన్నారు. బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవంక దేశంలోని సగం మంది నిరుపేదలు (67 కోట్ల మంది) తమ సంపదను ఒక్క శాతం పెంచుకోగలిగారు. బిలియనీర్లు పెరిగిపోవడం ఆర్థిక వ్యవస్థ జోరుకు సంకేతం కాదు. అది ఆర్థిక వ్యవస్థ వైఫల్యానికి సంకేతం.

సమానతా సూత్రం

మనిషి జీవితంలో చాలా భాగం విద్య నేర్వడానికే సరిపోతోంది. అలాకాకుండా తక్కువ కాలంలోనే విలువైన విజ్ఞానం అందించాలన్నది మహాత్ముడి భావన. విద్య కేవలం డబ్బు సంపాదన సాధనంలా కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలి. వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కోగలిగిన- విలువలతో కూడిన, నైపుణ్యాలు సంపాదించిన, గుండె నిండా ధైర్యం నింపుకొన్న వ్యక్తులను సృష్టించడంలో నేటి విద్యావ్యవస్థ విఫలమైంది.

విద్యకు సంబంధించి గాంధీజీ భావనలు సామాజిక అభ్యున్నతి సాధనకు సోపానాలు. గాంధీయిజానికి మరో సైద్ధాంతిక అస్తిత్వం సామ్యవాదం (సోషలిజం). బీదరికం, ఆకలి, నిరుద్యోగిత లేని- అందరికీ విద్య ఆరోగ్యం ఉండే వర్గరహిత సమాజాన్నే అది కోరుకుంటుంది. భారత విధాన నిర్ణేతలకు ఎన్నో సంవత్సరాలుగా గాంధేయ సిద్ధాంతాలే దీపస్తంభంలా నిలిచాయి. గాంధీజీ రాజకీయ సేవలు మనకు స్వాతంత్య్రం తెచ్చాయి. కాని ఆయన సిద్ధాంతాలు ఇన్నేళ్ల తరవాత ఈనాటికీ ప్రపంచానికి జ్ఞానబోధ గావిస్తున్నాయి. కనుకనే గాంధీజీ... మహాత్ముడు, మహితాత్ముడు!

- రాధా రఘురామపాత్రుని (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, గీతం విశ్వవిద్యాలయం)

ABOUT THE AUTHOR

...view details