తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఓ మహిళా మేలుకో... ఉన్నంతలో కొంత దాచుకో...! - ఈనాడు వసుంధర

‘ఆడవారికి ఆర్థిక విషయాల్లో అవగాహన అంతంత మాత్రమే!’ నిజానికి సమాజం అనే ఇలాంటి నిరుత్సాహకరమైన మాటలే మహిళల్ని మరింత వెనక్కి లాగుతున్నాయేమో అని ఒక్కోసారి అనిపించకమానదు. దీనికి తోడు పొదుపు-మదుపు.. వంటి విషయాల్లో మహిళలు చాలా వెనకబడి ఉన్నారని పలు అధ్యయనాలు, గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

vasundara story, women savings
personal-finance, women savings

By

Published : Mar 26, 2021, 5:28 PM IST

ఆర్థిక విషయాల్లో కొవిడ్‌కు ముందు వరకు కొంతమంది మహిళలు ఆసక్తి చూపినా.. కరోనా వచ్చాక మాత్రం అంతా తారుమారైపోయింది. ఈ క్రమంలో మహిళల ఉద్యోగాల పైన కూడా వేటు పడింది. జీతాల్లేక, వ్యాపారాలు నష్టపోయి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టే ఆ తక్కువ శాతం మంది కూడా వెనక్కి తగ్గారు. మరికొంతమంది మహిళలేమో నష్ట భయంతో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు. అయితే ఇలా లాభమా? నష్టమా? అన్నది పక్కన పెట్టి మహిళలంతా ముందు పెట్టుబడి పెట్టడమే పరమావధిగా ముందుకు సాగాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. తద్వారా ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లతో ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారని, ఇది వారిలో ఆర్థిక అవగాహనను మరింత పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి, పెట్టుబడుల విషయంలో ప్రస్తుతం మహిళల పాత్ర ఎంత వరకు ఉంది? వారు ఆర్థికంగా అక్షరాస్యత సాధించాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..


కరోనా ప్రతి ఒక్కరినీ ఆర్థికంగా ఎంతలా దెబ్బతీసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంపాదన తగ్గిపోయి దాని ప్రభావం పొదుపు-మదుపుల పైనా పడింది. ఈ క్రమంలో ఈక్విటీ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు కొవిడ్‌కి ముందు అంటే 2019 సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో 1 శాతంగా ఉంటే.. సరిగ్గా ఏడాది తర్వాత ఆ సంఖ్య 0.87 శాతానికి పడిపోయిందని సీఎంఐఈ సర్వేలో తేలింది.


ముందు మొదలు పెట్టాలి!
అంతేకాదు.. చాలామంది ఈక్విటీలను (స్టాక్‌మార్కెట్‌ షేర్స్‌) విస్మరించినా.. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, పోస్ట్‌ ఆఫీస్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌), ఇన్సూరెన్స్‌ లేదా చిట్‌ ఫండ్స్‌.. వంటి సుమారు 13 విభాగాల్లో అది కూడా అతి కష్టం మీద పెట్టుబడులు పెడుతున్నారని ఈ నివేదిక తెలిపింది. ఇక వీటిలోనూ ఎక్కువ మంది కేవలం ఇన్సూరెన్స్‌, పీఎఫ్‌, చిట్‌ఫండ్స్‌.. వంటి రెండు మూడు రకాల మదుపు మార్గాల్నే ఎంచుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది. అయితే లాభమా? నష్టమా? అన్నది ఆలోచించకుండా ప్రతి మహిళా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలని, తద్వారా మదుపు గురించి క్రమంగా అవగాహన పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడమూ ముఖ్యమేనంటున్నారు.
* కంపెనీతో మనకున్న అనుబంధాన్ని బట్టి కాకుండా కంపెనీ షేరు విలువను బట్టి దాన్ని కొనుగోలు చేయడం మంచిది.
* ఒక సంస్థ షేర్లు కొనే ముందు మీకున్న సందేహాలను ఒకసారి ఫైనాన్షియల్‌ ప్లానర్‌ ద్వారా నివృత్తి చేసుకోవడం ఉత్తమం.
* ఒకే రంగంలో కాకుండా.. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడితే ఒకదాంట్లో నష్టం వచ్చినా మరో దాంట్లో వచ్చే లాభాలతో దాన్ని పూడ్చుకునే వీలుంటుంది.

* షేరు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మాలనేది తెలివైన పెట్టుబడిదారులు అనుసరించే మంత్రం అంటున్నారు నిపుణులు. కొత్తగా షేర్లు కొనుగోలు చేసే క్రమంలో మనం కూడా ఈ మాటల్నే అనుసరించచ్చు.
* ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు సహజం.. కాబట్టి కంపెనీ షేరు విలువ పడిపోతుందని ఆ పెట్టుబడుల్ని వెనక్కి తీసేసుకుంటే.. కొంత కాలానికి అదే షేరు ధర విపరీతంగా పెరిగిపోవచ్చు.. అలాంటప్పుడు బాధపడకుండా ఉండేందుకు కంపెనీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగడం మంచిది.

ఈ మదుపు మార్గాల్లోనూ..!
* చాలామంది మహిళలకు సొంత ఇల్లు అనేది ఒక కల. ఈ క్రమంలోనే ఇల్లు కొనుగోలు చేయడం లేదంటే రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఈ మధ్య రియల్‌ ఎస్టేట్‌ మదుపు విషయంలో మహిళలు పురుషులనే దాటేశారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సుమారు 77 శాతం మంది గృహాలు కొనుగోలు చేస్తుండగా, 23 శాతం మంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని ఓ సర్వే తేల్చింది. ఇలా దీనివల్ల ఓవైపు భూమి విలువ పెరుగుతుంది.. మరోవైపు అద్దె కూడా వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది మహిళలు ఈ దిశగా ముందుకు సాగుతున్నారట!


* ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి సిప్‌ (సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) సరైన ఎంపిక అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని మన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు కేటాయించి ఆ మొత్తానికి తగిన షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా ఆర్థికంగా ఎక్కువగా భారం పడకుండా ఉండడంతో పాటు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
* చాలామంది మహిళలు చిట్స్‌లోనే మదుపు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలనుకునే వారికి ఇది చక్కటి ప్రత్యామ్నాయం. అలా కాకుండా దీర్ఘకాలం పాటు ఇందులో పెట్టుబడి పెడుతూ ఉంటే ఆఖరికి కొంత మొత్తాన్ని పోగు చేసుకోవచ్చు కూడా! అయితే ఈ క్రమంలో ఏ కంపెనీ పడితే అది, ఎవరిని పడితే వారిని నమ్మకుండా.. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్న విశ్వసనీయమైన, రిజిస్టర్డ్‌ సంస్థలను ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా మీరు పెట్టిన పెట్టుబడికి పూర్తి భరోసా ఉంటుంది.
* బ్యాంకు అందించే వడ్డీ రేట్లతో పోల్చితే మ్యూచువల్‌ ఫండ్లలో వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది. వీటిలో కొన్ని కంపెనీలు ట్యాక్స్‌ బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. అలాగే వేలకు వేలు డబ్బు ఉంటేనే ఈ ఫండ్లలో డిపాజిట్‌ చేయాల్సిన అవసరం ఉండదు.. సిప్‌ ద్వారా తక్కువ మొత్తాన్ని పొదుపు చేసుకున్నా.. మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలం తర్వాత మంచి లాభాలను పొందచ్చు.


చిన్నతనం నుంచే..!
ఆర్థిక అంశాలపై అవగాహన లేదంటూ పెద్దయ్యాక బాధపడే కంటే చిన్నతనం నుంచే ఆయా విషయాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు వివరించడం మంచిది. ఈ క్రమంలో వారి పాకెట్‌మనీ కోసం ఇచ్చిన డబ్బును పొదుపు చేయడం దగ్గర్నుంచి మొదలుపెట్టచ్చు. ఇందుకోసం వారి పేరిట ఓ బ్యాంక్‌ ఖాతా తెరిచి వారినే స్వయంగా అందులో పొదుపు చేసుకోమని చెప్పండి. ఎలాగో ఇప్పుడంతా ఆన్‌లైనే కాబట్టి ఇంటి వద్ద నుంచే వారి ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చు. అలాగే చిన్న పిల్లలే కదా అని వదిలేయకుండా ఇంట్లో పెట్టే ఖర్చుల గురించి వారికీ తెలియజేయండి. ఆర్థిక విషయాల గురించి ఇంట్లో చర్చించుకునేటప్పుడు పిల్లల్నీ భాగస్వాముల్ని చేయండి. ఇలా ముందు నుంచే వారిని ఆర్థికంగా అక్షరాస్యుల్ని చేస్తే తర్వాత్తర్వాత ఇతరులపై ఆధారపడకుండా పొదుపు-మదుపు విషయాల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

ఇలా మహిళలు ఆయా పెట్టుబడి మార్గాల్ని అనుసరించి తమ డబ్బును క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. అయితే ఈ క్రమంలో ఎలాంటి సందేహాలు ఎదురైనా, ఇతర పెట్టుబడి మార్గాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలన్నా సంబంధిత నిపుణుల్ని సంప్రదించచ్చు. తద్వారా ఆర్థిక అవగాహన ఏర్పడుతుంది.. చక్కటి పెట్టుబడి మార్గాల గురించి కూడా తెలుసుకునే వీలుంటుంది.

ఇదీ చూడండి:ఓడిపోయానని కుంగిపోకండి.. తిరిగి ప్రయత్నించండి!

ABOUT THE AUTHOR

...view details