తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా మహమ్మారితో మహిళలకు కొత్త కష్టాలు - మానసిక పరిస్థితి

ఉరుకులు పరుగుల జీవితంలో మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు ఒక మజిలీగా కరోనా లాక్​డౌన్ ను భావించారు చాలామంది. అయితే గణాంకాలు మాత్రం మహిళల విషయంలో లాక్​డౌన్ ప్రతికూల ప్రభావం చూపిందంటున్నాయి. పిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమైన వేళ.. మల్టీ టాస్కింగ్​ పేరుతో మహిళలు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఇంత చేసినా ఫలితం శూన్యం. వారిపై మానసికంగా, శారీరకంగా హింస పెరిగిపోయిందనే లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.

women life style changed during corona time domestic voilance increased
మహిళలకు పెనుశాపమైన కొవిడ్‌

By

Published : Jan 20, 2021, 10:25 AM IST

కరోనా నామ సంవత్సరంగా పేరొందిన 2020- మానవాళి చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అది ప్రపంచానికి అన్ని రకాలుగా సరికొత్త విషయాలను పరిచయం చేసి వెళ్లిపోయింది. మానవ జీవన పోకడలే మారిపోయాయి. అప్పటిదాకా బాగా పరిచయమున్న జీవితమే కొత్తగా ఆవిష్కృతమైంది. ఏ దేశమూ తప్పించుకోలేకపోయింది. ఏ రంగం సురక్షితంగా ఉండలేకపోయింది. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికీ మినహాయింపు దక్కలేదు. ఆర్థిక రంగం తలకిందులై పోయింది. సామాజికంగా జీవనాలు అస్తవ్యస్తంగా మారాయి. లాక్‌డౌన్‌తో విమానాలు, రైళ్లు, బస్సులు...మూలనపడ్డాయి. రైలుపట్టాలే నడకదారులయ్యాయి. పాదాలే బస్సు చక్రాలయ్యాయి. బడులు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు. సామాన్యులకు ఉపాధి కరవైంది. చిరుద్యోగుల బతుకు భారమైంది. ఇళ్ల నుంచే బడులు, కార్యాలయాలు పనిచేశాయి. పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా ఇంటిపట్టున చేరారు. ఈ పరిణామాల మొత్తం ప్రభావం మహిళలపై పడింది. కొత్త కష్టాలు నెత్తిన పడ్డాయి. ఎప్పుడూ ఉండే కష్టాలు, సమస్యలే అయినా- తీవ్రత మరింత పెరిగింది. ఇంటి నుంచి పనిచేసే మహిళలది మరింత పెద్ద కష్టం. పిల్లలు, కుటుంబ సభ్యులకు సేవలు అందిస్తూనే, కార్యాలయం పనులు కూడా చేయాల్సి రావడం వారికి శక్తికి మించిన పనిగా మారింది. ఇళ్లలో ఉండిపోయిన పురుషుల్లో ఉపాధి కోల్పోయిన వారు, ఉద్యోగంలో ఆదాయం తగ్గిన వారు, వ్యాపారాలు నిలిచిపోయిన వారు, వివిధ వ్యవహారాల్లో డబ్బులు ఇరుక్కుపోయిన వారు, పనులు ఆగిపోయిన వారు... ఇలా రకరకాల కష్టాల పాలైన పురుషుల ఆక్రోశాల్ని, ఆగ్రహాల్ని, ఆవేదననల్ని మహిళలే భరించాల్సి వచ్చింది. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు వెల్లువెత్తిన ఫిర్యాదులే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

భారీగా ఫిర్యాదులు..

జాతీయ మహిళా కమిషన్‌కు 2020లో మహిళలపై నేరాలకు సంబంధించి 23,722 ఫిర్యాదులు వచ్చాయి. గత ఆరేళ్లలో ఇదే అత్యధికం. ఇందులో నాలుగింట ఒక వంతు గృహహింసకు సంబంధించినవే. ఇందులో 7,708 ఫిర్యాదులు గౌరవంగా జీవించే హక్కు నిబంధన కింద స్వీకరించినవి. వివాహితపై వేధింపులు లేదా వరకట్న హింస కింద నమోదైన ఫిర్యాదుల సంఖ్య 3,784 ఉండగా, లైంగిక వేధింపులకు సంబంధించినవి 1,679. మహిళలపట్ల పోలీసుల ఉదాసీనవైఖరికి సంబంధించి 1,276, సైబర్‌ నేరాలపై 704 ఫిర్యాదులు అందాయి. 1,234 ఫిర్యాదులు అత్యాచారం, అత్యాచార యత్నాలపై నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా- మహిళలు తమను వేధించే వారితో కలిసి ఇళ్లకే పరిమితం కావాల్సి రావడం వారి పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఈ పరిణామాలపై ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ స్పందిస్తూ- ఆర్థిక అభద్రత, ఒత్తిడి పెరగడం, ఆందోళన, డబ్బులపరమైన చింత, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి మానసికపరమైన మద్దతు లేకపోవడం వంటివి గృహహింస పెచ్చరిల్లడానికి కారణమైనట్లు వివరించారు. భార్యాభర్తలు ఇంటి నుంచే పనిచేయడం, పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులతో ఇళ్లకే పరిమితమవడంతో మహిళలపై ఒకేసారి పలురకాల పనులు చేయాల్సిన ఒత్తిడి పెరిగిందని ఆవేదన చెందారు. మరోవైపు, వేధింపులకు సంబంధించి మహిళల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడానికి- వారిలో పెరిగిన చైతన్యాన్ని కూడా ఒకకారణంగా చూడాల్సి ఉంటుందని మహిళా ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు.

ఇళ్లకే బందీలైన మహిళలకు లాక్‌డౌన్‌ కారణంగా ఎటువైపు నుంచీ సాయం అందే పరిస్థితి లేకుండా పోయింది. సాధారణ పరిస్థితుల్లో గృహహింస బాధితులకు అండగా నిలిచే వ్యవస్థలన్నీ దూరమయ్యాయి. హింస, తిట్లు, వేధింపులు పెరిగినా, సురక్షితమైన మరోచోటికి వెళ్లే అవకాశమూ చిక్కలేదు. గృహహింస చట్టం కింద ఏర్పాటైన యంత్రాంగాన్ని లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర విభాగంగా గుర్తించకపోవడంతో రక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు- బాధితుల ఇళ్లను చేరలేకపోయారు. పోలీసు అధికారులు కొవిడ్‌ విధుల్లో ఉండటంతో ఇలాంటి బాధితులకు సహాయం అందించడం కష్టంగా మారింది. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ ద్వారా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 2,878 కేసుల్లో ఉచిత న్యాయ సేవలు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

స్పందించే గుణం పెరగాలి..

మహిళలపై గృహహింసతోపాటు అన్నిరకాల అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో వారికి సరైన న్యాయం జరగాలంటే- పోలీసు విభాగంలో సునిశితత్వం, సత్వరం స్పందించే గుణం పెరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది జరగాలంటే మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. జనాభాలో దాదాపు సగం మహిళలున్నా, పోలీసుల్లో వారివాటా కేవలం 7.28 శాతం మాత్రమే. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు విభాగాల్లో మహిళా సిబ్బంది సంఖ్య 16 శాతం పెరగడం స్వాగతించదగ్గ పరిణామమే అయినా, ఇదేమాత్రం సరిపోదు. 39 దేశాల్లో చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం- మహిళా పోలీసుల సంఖ్య పెరిగినప్పుడు గృహహింస, జీవిత భాగస్వామి చేసే నేరాల రేట్లు తగ్గినట్లు వెల్లడైంది. ఇతరత్రా అనేక అంశాల విషయంలోనూ మహిళా పోలీసుల వల్ల ప్రయోజనం చేకూరుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసు బలగాల్లో మహిళల సంఖ్యను పెంచుకోవడం స్త్రీల క్షేమానికే కాకుండా, యావత్‌ సమాజానికే శ్రేయస్కరం.

- శ్రీనివాస్​, దరెగోని

ఇదీ చదవండి:ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు శాంత కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details