తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఎన్నికల వేళ శీతాకాల సమావేశాలు.. పైచేయి ఎవరిదో?

winter session 2021: సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెగసస్​ వ్యవహారం, నిరుద్యోగం, ఇంధన ధరల పెరుగుదల, కనీసమద్దతు ధరపై చట్టం.. తదితర అంశాల్లో కేంద్రంపై ప్రశ్నలను సంధించేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. దాంతో అన్ని పార్టీలు సమావేశాలను ఆ ఎన్నికలకు వేదికగా మలచుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

Winter Session of Parliament
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

By

Published : Nov 29, 2021, 8:10 AM IST

winter session 2021: పార్లమెంటు శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూలేనంత వేడిని పుట్టిస్తున్నాయి. వీటి తరవాత ఉత్తర్‌ ప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. దాంతో అన్ని పార్టీలూ సమావేశాలను ఆ ఎన్నికలకు వేదికగా మలచుకోవాలన్న వ్యూహంతో సిద్ధమయ్యాయి. తొలిరోజునే సాగుచట్టాల రద్దు బిల్లును తీసుకొచ్చి పరిస్థితులను తన నియంత్రణలో ఉంచుకొనేందుకు అధికారపక్షం సమాయత్తమవుతోంది. బిల్లుల రద్దుకు మొగ్గుచూపి ఒకమెట్టు దిగిన అధికార పక్షాన్ని మరింత ఇరుకునపెట్టడానికి ప్రతిపక్షాలు వ్యూహాలకు సానపడుతున్నాయి. వచ్చేనెల 23 వరకు సాగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం మూడు పాత బిల్లులతోపాటు మరో 26 కొత్తవి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. అందులో క్రిప్టోకరెన్సీ నియంత్రణ, విద్యుత్తు సంస్కరణలు, బ్యాంకుల ప్రైవేటీకరణలాంటివి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

ఈ సమావేశాలను తన పనితీరు చాటుకొనే వేదికగా మలచుకొని రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పైచేయి సాధించాలని భాజపా భావిస్తుంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి తామే ఓ మెట్టు పైనున్నామని నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నాయి. వచ్చే సార్వత్రిక సమరానికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికలు సెమీఫైనల్‌ లాంటివి. ఆ ప్రభావం పార్టీల భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే అన్నిపార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకాయి. అందువల్ల ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆవేశకావేషాలు తీవ్రస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆ అంశాలను ఆయుధాలుగా..

కరోనా నియంత్రణ, 100 కోట్లకు మించిన వ్యాక్సినేషన్‌, పేదలకు ఉచితంగా తిండిగింజల పంపిణీ, ఆర్థికరంగ పునరుత్థానం, ఎగుమతుల పెరుగుదల, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు, సాగుచట్టాల రద్దులాంటి అంశాలను ఆయుధాలుగా మలచుకొని ప్రతిపక్షాలపై దాడి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, సరిహద్దుల్లో చైనా ఆక్రమణ, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతలాంటి అంశాలపై ఎదురుదాడి చేయడానికి ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. తాజాగా సెంట్రల్‌ హాల్‌ వేదికగా జరిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్‌ సహా పదిహేను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. తద్వారా రాబోయే సమావేశాల్లో తాము అనుసరించబోయే వైఖరిని బహిర్గతం చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ పేరెత్తకుండా కుటుంబపార్టీలు రాజ్యాంగ సూత్రాలకు ముప్పుగా పరిణమించాయని మోదీ సైతం తమ ఎదురుదాడి సరళిని రుచిచూపించారు.

తొలిరోజు సాగుచట్టాల రద్దు బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుందా లేదా అన్నది తెలియడంలేదు. ప్రతిపక్షాలన్నీ ఆ బిల్లుపై చర్చకోసం పట్టుపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ఆ బిల్లు ఓ అవకాశం కాబట్టి ప్రతిపక్షాలు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడవు. ప్రభుత్వం ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వడానికి సుముఖత చూపదు. తొలిరోజు జరిగే ఈ ద్వంద్వ యుద్ధంలో పైచేయి సాధించిన వారు సమావేశాల ఆసాంతం మరింత దూకుడు ప్రదర్శించడం ఖాయం. ప్రస్తుతం కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎత్తులు వేస్తోంది. అందుకే అది విస్తరణ వాదంలోకి వెళ్ళిపోయి మేఘాలయ, గోవా, త్రిపుర, అస్సామ్‌లలో కాంగ్రెస్‌ నాయకులను తనవైపు లాక్కొని పార్లమెంటు సమావేశాలకు ముందే కాంగ్రెస్‌ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.

భాజపాతో పోటీపడే శక్తిసామర్థ్యాలు కాంగ్రెస్‌కు లేవని, దాన్ని అలాగే వదిలిస్తే భాజపాను ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు సాధ్యం కాదన్న ఉద్దేశంతో మమతాబెనర్జీ ముందువరసలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని టీఎంసీ ఈ పార్లమెంటు సమావేశాల్లో కొత్త మిత్రులను చేర్చుకొని సరికొత్త వ్యూహాలు అమలుచేసే సూచనలూ కనిపిస్తున్నాయి.

వాయిదాలే అసలు సమస్య

పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు నెగ్గించుకోవడం అధికార పక్షానికి పెద్ద పనేమీకాదు. సమస్యల్లా సభకు అంతరాయాలతోనే వస్తోంది. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తుండటంతో సభను రోజుల తరబడి వాయిదావేస్తూ పోయిన ఘటనలు గత సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు బల్లలమీదికెక్కి చేసిన ఆందోళనలు, వారిని నిలువరించడానికి మార్షల్స్‌ ప్రయత్నించడం అప్పట్లో వివాదాస్పదమైంది.

సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన సభ్యులపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో మరెవరూ అలాంటి సాహసం చేయకుండా చూడాలని అధికారపక్షం యోచిస్తోంది. ఆ ఘటనపై కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనంచేసి, ఆ సభ్యులపై చర్యలు తీసుకొనేలా చూడాలని ప్రయత్నించింది. కమిటీలో చేరడానికి ప్రతిపక్ష సభ్యులు ముందుకు రాకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. కమిటీ నివేదిక లేకపోయినా కట్టుతప్పిన సభ్యులపై చర్యలు తీసుకొనే అధికారం సభకు ఉంటుంది. అలా తీర్మానం ప్రవేశపెట్టి సభ్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారపక్షం ప్రయత్నిస్తోందన్న వాదనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ సమావేశాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ ఉత్పాదకత గత రాజ్యసభ సమావేశాల్లోనే చోటుచేసుకున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు రాజ్యాంగ దినోత్సవంలో పేర్కొన్నారు. సభాస్తంభన వైఖరిని వదిలి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపిచ్చారు.

పార్టీల మధ్య శత్రుత్వం తగదని, వాటి మధ్య స్పర్ధ ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగపడాలే తప్ప రాజకీయ స్వార్థాలకు కాదని రాష్ట్రపతి మార్గనిర్దేశం చేశారు. పెద్దల మాటలను పార్టీలు చెవికెక్కించుకుంటే సమావేశాలు సఫలం కావడానికి ఆస్కారం లభిస్తుంది. లేదంటే ఘర్షణాత్మక వైఖరుల ప్రదర్శన అనివార్యమవుతుంది.

ప్రాబల్య ప్రదర్శనకే ప్రాధాన్యం!

ఇప్పటిదాకా టీఎంసీ రాజ్యసభలో చూపినంత దూకుడును లోక్‌సభలో ప్రదర్శించలేదు. ఈసారి ఆ దృశ్యం కనిపించవచ్చు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని తూర్పారబడుతున్న తెరాస సైతం ఈసారి లోక్‌సభలో ప్రతిపక్షాలతో కలిసి లేదా ఒంటరిగా పోరాటం సాగించవచ్చు. ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల్లో బలమైన పక్షాలుగా ఉన్న సమాజ్‌వాదీ, అకాలీదళ్‌, ఆప్‌లాంటి పార్టీలూ తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఈ సమావేశాలను అవకాశంగా మలచుకొనే ప్రయత్నాలు చేయడం ఖాయం. సమకాలీన పరిస్థితులనుబట్టి చూస్తే ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలకంటే రాజకీయపార్టీల బలప్రదర్శనే కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేడీ, జేడీయూ మినహా మిగిలిన పక్షాలేవీ భాజపాతో సహకారపూర్వకంగా వ్యవహరించడం లేదు. అలాగని అన్నిపార్టీలూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే అవకాశమూ కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో పెద్దన్నపాత్ర పోషించాలని చూస్తున్న కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ప్రతిపక్షాలను పునరేకీకరణ చేసి పార్లమెంటు వేదికగా కొత్త కూటమిని కూడగట్టే అవకాశాలున్నాయి. అదే జరిగితే భవిష్యత్తు రాజకీయాలకు అది కొత్త సంకేతం అవుతుంది.

- చల్లా విజయభాస్కర్‌

ABOUT THE AUTHOR

...view details