ఉన్నతంగా జీవించేందుకు అవసరమైన జ్ఞానాన్ని నేర్పించి, ఇష్టమైన రంగంలో కొనసాగే సామర్థ్యాన్ని కల్పించడమే విద్య పరమార్థం. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు అన్ని జాతీయ విద్యావిధానాల(1968-1986)నూ ఈ ఉన్నత లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రకటించారు. దేశంలో నిరక్షరాస్యత ఇంకా పెద్దయెత్తున పేరుకుపోయి ఉంది. అభ్యసన సంక్షోభం విద్యారంగాన్ని కిందకులాగుతోంది. నిధుల కొరత విద్యాలయాలను వేధిస్తోంది. విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రతిభావంతులైన శాశ్వత ఉపాధ్యాయుల కొరత దశాబ్దాలుగా ఇబ్బందిపెడుతోంది. ఉన్నత విద్యలు చదువుకున్నా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. విద్యారంగంలో ప్రైవేటీకరణ మితిమీరింది. ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చాలావరకు ఇప్పటివరకు ఉన్న విద్యావిధానాల నిర్మాణమే కారణం. రెండు విద్యా కమిటీల (సుబ్రమణ్యన్ -2016; కస్తూరి రంగన్-2019) సూచనల అనంతరం, కేంద్ర మంత్రివర్గ ఆమోదం తరవాత ఇటీవల ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానం- ప్రస్తుత విద్యా సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేసేదిగా ఉంటుందనే అందరూ ఆశించారు. కానీ, ఇది కూడా పాత విధానాల్లాగే గొప్ప ఆశయ ప్రకటనలు, మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలతో నిండి ఉంది. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు మాత్రం కరవయ్యాయి.
నైపుణ్యాలపై దృష్టి
దేశంలో ప్రీ-ప్రైమరీని, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో కలిపి బాలలకు మూడు నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని సూచించడం ప్రశంసనీయం. కానీ ఇందుకోసం ‘విద్యాహక్కు చట్టం’లో సవరణలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం దీని అమలుపై సందేహాలకు కారణమవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల తీరులోనే భారత్‌లోనూ మాతృ/స్థానిక భాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని ప్రస్తావించడం హర్షణీయం. కానీ, దాని అమలు గురించి చెబుతూ ‘ఎక్కడైతే అవకాశం ఉంటుందో’ అక్కడ ప్రవేశపెట్టాలని ప్రస్తావించడం అనేక సంశయాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఈ నిబంధనను ఎంతవరకు అమలు చేస్తాయనేది సందేహం. దేశంలో 56శాతం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస విద్యగానీ, నైపుణ్యత స్థాయిగానీ లేవని అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాలస్థాయిలో విద్యార్థి పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం, సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనడం; పాఠశాల విద్యను మధ్యలో మానేసేవారిని అరికట్టాలన్న సూచనలు కొనియాడదగినవవే. కాకపోతే వాటి అమలుకు నిర్దిష్ట సూచనలు చేయాలి. పాఠశాల విద్యలో విద్యార్థులకు వృత్తివిద్యా నైపుణ్యాలు కల్పించాలనే ఆలోచన చాలా మంచిది. ఇది విద్యార్థికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతోపాటు; భవిష్యత్తుపట్ల భరోసానూ కలిగిస్తుంది. వృత్తివిద్యను ఆరో తరగతి నుంచే ప్రవేశపెట్టాలనడమే భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. ఇది విద్యార్థులు తమకు అవసరమైన ప్రాథమిక జ్ఞానం నేర్చుకోకుండా అడ్డుపడవచ్ఛు కాబట్టి వృత్తివిద్యలను తొమ్మిదో తరగతి స్థాయినుంచి ప్రవేశపెడితే విద్యార్థులు అవగాహనతో, ఆసక్తితో వాటిని నేర్చుకుంటారు.
ఉన్నతవిద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తిని ప్రస్తుతమున్న 26శాతం నుంచి 2035 నాటికి 50శాతానికి పెంచాలనడం హర్షణీయం. దేశంలో ఉన్నత విద్యలో ఉత్తీర్ణులవుతున్న 80శాతం విద్యార్థులకు ఉద్యోగనైపుణ్యాలు లేవు. ఇప్పుడున్న నైపుణ్య అభివృద్ధి పథకం కింద రెండు మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చే పద్ధతి సరైంది కాదు. వీటితోపాటు విద్యానాణ్యతలపైనా నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడే విద్యార్థి సామర్థ్య, నైపుణ్యాలను పెంచి నిరుద్యోగితను తగ్గించవచ్ఛు నాలుగు సంవత్సరాల డిగ్రీ ప్రతిపాదన పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడానికి సంబంధించింనంతవరకూ మంచిదే. ఇందులో ఒకటి లేదా రెండేళ్ల అనంతరం నిష్క్రమించే అవకాశం ఇవ్వడంవల్ల విద్యార్థులకు తాము పొందే డిప్లొమా సర్టిఫికెట్లవల్ల ఎంతమేరకు ఉపయోగం ఉంటుందో స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న కళాశాలలను స్వతంత్ర ప్రతిపత్తిగల బహుళాంశ విశ్వవిద్యాలయాలుగా తీర్చిదిద్ది- విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల వ్యవస్థను ఎత్తివేయాలన్న ఆలోచన సరైనదే. దీనివల్ల కళాశాలలు అభివృద్ధి చెందడంతోపాటు; యూనివర్సిటీలపై పాలన భారం తగ్గుతుంది. తద్వారా అవి బోధన, పరిశోధనలపై ప్రధానంగా దృష్టి సారించవచ్ఛు విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు(కేంద్ర, రాష్ట్రాలు కలిపి)ను స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 4.4శాతం నుంచి ఆరుశాతానికి తీసుకువెళ్ళాలని ప్రతిపాదించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెంపు ఏ మూలకూ సరిపోదు. స్కాండినేవియన్ (స్వీడన్, నార్వే, డెన్మార్క్) దేశాల్లోలాగా స్థూల దేశీయోత్పత్తిలో విద్యపై వ్యయాన్ని ఎనిమిది శాతానికి పెంచాలి. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి దానిపై వ్యయాన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వమూ సమానంగా భరించాలి. పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఈ విధానంలో నిర్ణయించారు. అందుకోసం ‘జాతీయ పరిశోధన సంస్థ’ను ఏర్పరచడం స్వాగతించదగిన పరిణామం. కానీ, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల తరహాలో పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడంకోసం స్థూల దేశీయోత్పత్తిలో సుమారు రెండు శాతం వాటాను ప్రత్యేకించాలి.