బంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఒంటి కాలిపై గెలిపించిన మమతా బెనర్జీ భాజపాయేతర లౌకిక పార్టీలకు నేతగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు జాతీయస్థాయిలో భాజపాకు కాంగ్రెస్‌పార్టీ ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ- దాన్ని నడిపే నేతల రాజకీయ చాతుర్యం నానాటికీ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో సహా, ఇతర ప్రతిపక్షాలకు మమత నాయకత్వాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే ప్రాంతాల్లో బలంగా ఉన్న యాదవ నేతలు ములాయంసింగ్, లాలూప్రసాద్, మరాఠా యోధుడు శరద్‌పవార్ వయోభార పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభ దిల్లీ పరిధి దాటలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్పీ ప్రాబల్యం తగ్గి, మాయావతి రాజకీయ క్రియాశీలతను కోల్పోయారు. ఇవన్నీ మమతకు కలిసి వచ్చే అంశాలుగా మారాయి. విభిన్న రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల వ్యక్తిగత పరిమితులు, సమస్యలు అన్నీ కలిసి మమతనే ప్రత్యామ్నాయ నేతగా చూపిస్తున్నాయి.
కానరాని వ్యతిరేకత
జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో వేళ్లూనుకోవడం ముఖ్యం. ఇక్కడి రాజకీయాలను శాసించే నాయకులే జాతీయ రాజకీయాల్లో వెలుగొందడం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. ఇప్పుడు అక్కడ ములాయం, లాలూప్రసాద్ యాదవ్ క్రియాశీలక రాజకీయాలనుంచి వైదొలగడంతో వారసులు అఖిలేష్, తేజస్వి యాదవ్‌లు పార్టీలు నడుపుతున్నారు. స్వరాష్ట్రాల్లో నిలదొక్కుకొనేందుకు ఈ యువనేతలిద్దరూ జాతీయ రాజకీయాలకంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మమత నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ బంగాల్‌కు వెళ్లి ఎన్నికలకు ముందే దీదీకి సంఘీభావం ప్రకటించడం ద్వారా ముందస్తు సంకేతాన్ని ఇచ్చారు. ఉత్తరాదిలో పంజాబ్, ఝార్ఖండ్‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శిరోమణి అకాళీదళ్, ఝార్ఖండ్ ముక్తిమోర్చాలు సైతం జాతీయ రాజకీయాల్లో భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలబడే వారికి సంపూర్ణ మద్దతు పలికే అవకాశం ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ వయసు రీత్యా జాతీయ రాజకీయాలవైపు చూసే పరిస్థితి లేదు. అందువల్ల మమత నాయకత్వంపట్ల సానుకూలత వ్యక్తం చేయకపోయినా వ్యతిరేకత కనబరచే అవకాశం ఉండదు.
చాలా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు భాజపాకు వ్యతిరేకంగా నిలవడానికి కొంత జంకుతున్నాయి. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలకు బలమైన నాయకత్వం లేకపోవడంవల్ల ఎదురునిలిచినా తట్టుకోలేమన్న భయంతో చాలాపార్టీలు మిన్నకున్నాయి. ఇప్పుడు ఆ నాయకత్వ శూన్యతను భర్తీచేయడానికి మమతా బెనర్జీ ముందుకొస్తే ఆమెతో జట్టుకట్టడానికి ప్రాంతీయపార్టీలు ధైర్యం చేసే అవకాశాలున్నాయి. ఎంపీ సీట్ల పరంగా అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్, బిహార్ పార్టీలకు చెందిన నేతలు స్థానిక రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ఆ తరవాత అత్యధిక స్థానాలున్న మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీలకు అక్కడ రాష్ట్రాన్ని పూర్తిగా శాసించే పట్టులేదు. 42 లోక్‌సభ స్థానాలున్న బెంగాల్ నేత మమతా బెనర్జీ జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి గణాంకాలు సైతం సహకరించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్‌కు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కాస్తోకూస్తో పట్టున్నందువల్ల అక్కడి ప్రతిపక్షాలూ ఆమె నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం ఉంటుంది. వీధిపోరాటాలకు ప్రత్యామ్నాయంగా మారిన ఆమె ఆ దూకుడును కొనసాగిస్తూనే- కొంత సర్దుబాటుతత్వాన్ని, జాతీయస్థాయి రాజకీయాలకు అవసరమైన పరిపక్వతను అలవరుచుకోవాలి. అప్పుడు రాజకీయ పునరేకీకరణకు చొరవ తీసుకుంటే 2024 లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది.